భాజపా నిరోధానికి ఎవరికైనా మద్దతిస్తాం: అసదుద్దీన్‌ ఒవైసీ

‘భాజపా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ రాలేదు. ఆ పార్టీలో అంతర్గత సమస్యలున్నాయి.

Published : 05 Jun 2024 05:06 IST

అబిడ్స్, న్యూస్‌టుడే: ‘భాజపా సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ రాలేదు. ఆ పార్టీలో అంతర్గత సమస్యలున్నాయి. భాజపాయేతర పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొస్తే పరిస్థితుల ఆధారంగా వ్యవహరిస్తాం’ అని మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించాక పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘భాజపాను నిరోధించేందుకు ఎవరు ముందుకొచ్చినా మద్దతిస్తాం. నరేంద్ర మోదీ పదేళ్లుగా దేశ ప్రజలను మోసం చేయడం, ముస్లింలపై దుర్మార్గంగా మాట్లాడటం వల్లే ప్రజలు భాజపాను ఆదరించలేదు. భారాస నాకు కాకుండా భాజపాకు బహిరంగంగా మద్దతు ఇచ్చింది. ప్రజాక్షేత్రంలో పని చేస్తున్నప్పుడు గెలుపోటములను సమానంగా స్వీకరించాలి. అధికారంలో ఒకలా, ప్రతిపక్షంలో మరోలా వ్యవహరించకూడదు. ఇప్పటికీ మా పార్టీకి కేసీఆర్‌ అంటే గౌరవం ఉంది. ఏపీలో జగన్‌మోహన్‌రెడ్డి పరాజయాన్ని ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావించాలి. ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు చేరతారా..? లేదా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది. భాజపా ఒకవేళ తన మిత్రులతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. మోదీ తన విధానాలను ఎలా అమలు చేస్తారో చూసేందుకు ఆసక్తికరంగా ఉంటుంది. సొంతంగా నిర్ణయాలు తీసుకుంటే వెలువడే వ్యతిరేకత ఎలా ఉంటుందో తొలిసారి ఆయనకు అర్థమవుతుంది’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని