ఎన్నికల సంక్షిప్త వార్తలు

అయోధ్య, అమేఠీలో భాజపా ఓటమి పాలవడం.. వారణాసిలో మోదీ హవా తగ్గడంతో దేశవ్యాప్తంగా ఇండియా కూటమి బలం పెరిగిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అభిప్రాయపడ్డారు.

Updated : 05 Jun 2024 08:03 IST

మోదీ హవా తగ్గింది.. కూటమి బలం పెరిగింది: మంత్రి పొన్నం

కరీంనగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: అయోధ్య, అమేఠీలో భాజపా ఓటమి పాలవడం.. వారణాసిలో మోదీ హవా తగ్గడంతో దేశవ్యాప్తంగా ఇండియా కూటమి బలం పెరిగిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అభిప్రాయపడ్డారు. కరీంనగర్‌ జిల్లాలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్‌ లోక్‌సభ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘దేశవ్యాప్తంగా ఎగ్జిట్‌ పోల్స్‌ తలకిందులు చేస్తూ.. ఇండియా కూటమికి సానుకూల ఫలితాలు రావడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. మోదీ ప్రభావం చాలా రాష్ట్రాల్లో పని చేయలేదు. ఓటర్లు ప్రజాస్వామ్యం వైపు నిలిచారనేది ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఉపఎన్నికలో గణేశ్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించడం సీఎం రేవంత్‌రెడ్డి ఐదునెలల పాలనకు నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ గెలిచింది. మరో ఎనిమిది స్థానాల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటాం. పార్టీ గెలుపు కోసం ప్రతి కార్యకర్త, నాయకుడు శ్రమించారు. గెలిచినా, ఓడినా నాదే బాధ్యత’’ అని పొన్నం పేర్కొన్నారు. 


కాంగ్రెస్‌ శ్రేణులకు భట్టి అభినందనలు

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ రికార్డుస్థాయి మెజారిటీలు సాధించేందుకు కృషి చేశారంటూ పార్టీ శ్రేణులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అభినందనలు తెలిపారు. ‘‘దేశంలో స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కాంగ్రెస్‌ పార్టీ, ఇండియా కూటమి అభ్యర్థులకు ఓటువేసి గెలిపించాలని అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ, రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ ఇచ్చిన పిలుపునకు స్పందించి అద్భుతమైన విజయాన్ని అందించారు’’ అని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.


చంద్రబాబు ప్రభుత్వం.. ఏపీ ప్రజల అదృష్టం
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ

రంగంపేట (వరంగల్‌), న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రానుండడం అక్కడి ప్రజల అదృష్టమని తెలంగాణ రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన డాక్టర్‌ కడియం కావ్యను మంగళవారం మంత్రి అభినందించారు. అనంతరం వరంగల్‌ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి మంచి ఫలితాలొచ్చాయన్నారు. ‘‘చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించిన రోజే వైసీపీ ఓటమి ఖాయమైంది. కక్ష సాధింపు చర్యలతోనే జగన్‌ ఓటమి పాలయ్యారు’’ అని మంత్రి సురేఖ పేర్కొన్నారు.


తెలుగు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలి: మంత్రి తుమ్మల 

ఈనాడు, హైదరాబాద్‌: చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీలో ఘన విజయం సాధించిన తెలుగుదేశం కూటమికి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. కూటమిని భారీ మెజారిటీతో గెలిపించిన ఏపీ ప్రజలను ఆయన అభినందించారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగాలని అన్నారు. భౌతికంగా విడిపోయినా మానసికంగా ఎప్పటికీ కలిసి ఉండి తెలుగు జాతి కీర్తిపతాకాన్ని ప్రపంచ పటంలో ఎగురవేసేందుకు రెండు ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. దేశానికే తలమానికంగా అభివృద్ధి సాధించాలన్నారు.


చంద్రబాబు, పవన్‌లకు.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ అభినందనలు

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లకు భారాస అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ‘ఎన్నికల్లో భారీ విజయం సాధించిన మీరు.. ఏపీ ప్రజల సేవలో విజయవంతం కావాలని కోరుకుంటున్నా’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.


7.44 లక్షల మెజారిటీతో అమిత్‌ షా ఘనవిజయం

భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గుజరాత్‌లోని గాంధీనగర్‌ లోక్‌సభ స్థానంలో 7.44 లక్షల ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. పోలైన ఓట్లలో ఆయనకు ఏకంగా 10,10,972 ఓట్లు దక్కాయి. ఆయన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌  అభ్యర్థి సోనాల్‌ పటేల్‌ 2,66,256 ఓట్లు మాత్రమే సాధించారు.


విజేతల్లో పిన్నలూ పెద్దలూ..

ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు- పుష్పేంద్ర సరోజ్‌ (25), ప్రియా సరోజ(25)లు అత్యంత పిన్న వయస్కులు. ఇక అత్యంత వృద్ధ ఎంపీ రికార్డు డీఎంకేకు చెందిన 82 ఏళ్ల టీఆర్‌ బాలుకు దక్కనుంది.


నేటి నుంచి కొత్త ఎంపీల రిజిస్ట్రేషన్లు  

నూతన ఎంపీల కోసం రిజిస్ట్రేషన్‌ కౌంటర్లను పార్లమెంట్‌ హౌస్‌ ఎనెక్స్‌లో లోక్‌సభ సచివాలయం ప్రారంభించింది. ఇవి ఈ నెల  5 నుంచి 14 వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేయనున్నాయి. ఆన్‌లైన్‌ ఇంటిగ్రేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ ద్వారా ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరగనుంది.


కేరళలో ఖాతా తెరిచిన కమలం

కేరళలో త్రిశ్శూర్‌ నుంచి సినీనటుడు, భాజపా అభ్యర్థి సురేశ్‌ గోపి సాధించిన విజయంతో కమలం పార్టీ తొలిసారి రాష్ట్రంలో ఖాతాను తెరిచింది.  20 స్థానాల్లో 18 కైవసం చేసుకోవడం ద్వారా సీపీఎం కూటమిని కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ దెబ్బ తీసింది.


ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్‌ విజయం

జైలు నుంచి  స్వతంత్ర అభ్యర్థిగా పోటీ

చండీగఢ్‌: ఖలిస్థానీ వేర్పాటువాది, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ చీఫ్‌ అమృత్‌పాల్‌ సింగ్‌ జైలు నుంచే పోటీ చేసి గెలిచారు. జాతీయ భద్రతా చట్టం కింద అస్సాంలోని దిబ్రూగఢ్‌ జైల్లో ఉన్న అమృత్‌పాల్‌.. పంజాబ్‌లోని ఖడూర్‌ సాహిబ్‌ స్థానం నుంచి పోటీచేసి లక్షన్నర ఓట్లకు పైగా తేడాతో కాంగ్రెస్‌ అభ్యర్థి కుల్బీర్‌ సింగ్‌పై గెలిచారు. మరోవైపు జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా నుంచి బరిలో దిగిన ఎన్‌సీ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లాపై మాజీ ఎమ్మెల్యే, జైలు నుంచి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి అబ్దుల్‌ రషీద్‌ షేక్‌ దాదాపు 2 లక్షలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 


పవన్‌ విజయం ప్రజలకు అంకితం 

జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు 

పవన్‌ కల్యాణ్‌ విజయానికి సంబంధించిన ధ్రువపత్రాన్ని అందుకుంటున్న ఆయన సోదరుడు నాగబాబు 

పిఠాపురం, న్యూస్‌టుడే: పవన్‌ కల్యాణ్‌ విజయం రాష్ట్ర ప్రజలకు అంకితమని ఆయన సోదరుడు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. కాకినాడలోని జేఎన్‌టీయూ అంబేడ్కర్‌ సెంట్రల్‌ లైబ్రరీలో కాకినాడ జేసీ, ఆర్‌వో రామ సుందర్‌రెడ్డి చేతులు మీదుగా పవన్‌ కల్యాణ్‌ గెలుపునకు సంబంధించిన ధ్రువపత్రాన్ని నాగబాబు అందుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, భారీ మెజారిటీ అందించిన పిఠాపురం ఓటర్లకు, ఆయన ధన్యవాదాలు తెలిపారు.  


ఎన్టీఆర్‌ భవన్‌లో తెదేపా శ్రేణుల సంబురాలు

ఈనాడు, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి భారీ మెజారిటీతో గెలుపొందడంతో మంగళవారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌కు తెదేపా నేతలు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. నృత్యాలు చేస్తూ, టపాసులు కాలుస్తూ విజయోత్సవ సంబురాలను చేసుకున్నారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు మాట్లాడుతూ న్యాయం గెలిచిందని, అధర్మం పాతాళానికి పడిపోయిందన్నారు. 


అల్లు అర్జున్‌ ప్రచారం చేసిన అభ్యర్థి ఓటమి

ఈనాడు డిజిటల్, అమరావతి: సినీ నటుడు అల్లుఅర్జున్‌ ప్రచారం చేసిన నంద్యాల వైకాపా అభ్యర్థి రవిచంద్ర కిశోర్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆయనపై తెదేపా అభ్యర్థి ఎన్‌ఎండీ ఫరూక్‌ 12 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 


వైకాపా కార్యాలయం వద్ద తెదేపా సంబరాలు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించడంతో తెదేపా కార్యకర్తలు తాడేపల్లిలోని వైకాపా కార్యాలయం ముందు బాణసంచా కాల్చి సందడి చేశారు. తెదేపా కార్యకర్తలు ర్యాలీగా రావడంతో వైకాపా కార్యాలయంపై దాడి చేస్తారేమోనన్న ఆందోళన వ్యక్తమైంది. అయితే వారు సంబరాలు చేసుకుని అక్కడి నుంచి ముందుకు కదిలారు. అనంతరం కుంచనపల్లిలో ఉన్న సిట్‌ కార్యాలయం వీధిలో బాణసంచా కాల్చి హడావుడి చేశారు.


అరాచకానికి శాస్తి చేశారు: అచ్చెన్నాయుడు 

ఈనాడు డిజిటల్, అమరావతి: ‘ప్రజలు ఎప్పుడూ విజ్ఞతతో ఆలోచిస్తారు. ఈ ఎన్నికలతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది. ఈరోజు వచ్చిన ఫలితాలే జగన్‌ ఎంత అరాచకం చేశారో చెబుతున్నాయి. రౌడీలు, గూండాలతో పాలన కొనసాగించి.. పేద ప్రజల్ని ఆర్థికంగా, మానసికంగా జగన్‌ పెట్టిన ఇబ్బందులకు ప్రజలు సమాధానం చెప్పారు.’


ఇదే ప్రజాస్వామ్య స్ఫూర్తి

-భాజపా నేత లంకా దినకర్‌

‘జగన్‌ పాలన తీరుపై రాష్ట్రప్రజలు తమ ఓటు ద్వారా తిరస్కరణ వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమికి 90% పైగా అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలు గెలిపించి రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు’. 


సత్సంబంధాలు కొనసాగాలి

-తెలంగాణ సీఎం ఎ.రేవంత్‌రెడ్డి 

‘‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లకు నా అభినందనలు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథం వైపు సాగుదాం’’ 


ప్రజల కలలు నెరవేర్చాలి..

- తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ 

‘‘ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తెదేపా అధినేత చంద్రబాబునాయుడుకి శుభాకాంక్షలు. చంద్రబాబు నాయకత్వం ఆంధ్రప్రదేశ్‌కు సంపదను, అభివృద్ధిని కల్పించి.. ఆ రాష్ట్ర ప్రజల కలలు, నమ్మకాన్ని నెరవేరుస్తుందని ఆకాంక్షిస్తున్నా’’


చంద్రబాబు, పవన్‌కు.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ అభినందనలు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లకు భారాస అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, హరీశ్‌రావు అభినందనలు తెలిపారు. ‘ఎన్నికల్లో భారీ విజయం సాధించిన మీరు.. ఏపీ ప్రజల సేవలో విజయవంతం కావాలని కోరుకుంటున్నా’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.


నాపై ప్రజల నమ్మకాన్ని నిలబెడతా

- అనకాపల్లి ఎంపీగా గెలిచిన సీఎం రమేశ్‌

తక్కువ కాలంలోనే నన్ను ఆదరించిన అనకాపల్లి జిల్లా ప్రజల నమ్మకాన్ని నిలిపేలా పనిచేస్తా. ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలకు చర్యలు తీసుకుంటా. అధికారమిస్తే జగన్‌కు కళ్లు నెత్తికెక్కి, ప్రజలను బానిసల్లా భావించారు. పవన్‌కల్యాణ్‌ వైకాపా వ్యతిరేక ఓట్లు చీలకుండా చేశారు.


అహంకారం పెంచుకుంటే గుణపాఠం తప్పదు

- గుంటూరు ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్‌

ఎంపీగా ఈ విజయాన్ని గుంటూరు జిల్లా అభివృద్ధికి వినియోగిస్తా. జగన్‌.. అహంకారాన్ని పెంచుకొని జనానికి దూరమయ్యారు. కక్ష సాధింపులతో అందరి జీవితాల్లో నిరాశ, నిస్పృహలు నింపారు. అహంకారులకు గుణపాఠాలు తప్పవు. ఎన్డీయే శ్రేణులు ప్రజలకు మేలు చేసేలా వ్యవహరించాలి. 


పవన్‌ నిర్ణయమే కూటమికి పునాది

- తెనాలి నుంచి గెలిచిన జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ 

ప్రజలు అహంకార పాలనకు బుద్ధి చెప్పి, ప్రజాస్వామ్య విలువలకు పట్టం కట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పవన్‌ నినాదమే పునాదిగా ఏర్పడిన కూటమిని ప్రజలు ఆశీర్వదించిన తీరు చరిత్రాత్మకం. రాష్ట్ర ప్రగతే ధ్యేయంగా ప్రణాళికతో పాలన సాగిస్తాం. తెనాలి ప్రజల రుణం తీర్చుకుంటా.


చంద్రబాబు నివాసానికి పలువురు ప్రముఖులు

ఉండవల్లిలో తెదేపా అధినేత చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్న భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సిద్ధార్థ్‌నాథ్‌ సింగ్‌

ఈనాడు డిజిటల్, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు నివాసానికి ఉదయం నుంచే పలువురు ప్రముఖులు రావడం మొదలైంది. మధ్యాహ్నానికే విజయం ఖాయం కావడంతో భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్‌ సింగ్‌.. చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ ఉన్నారు. వారికంటే ముందు సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు, వంగవీటి రాధా తదితరులు చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు.  


జగన్‌ నిరంకుశ పాలనపై ప్రజల తీర్పు

-సీపీఐ

జగన్‌ నిరంకుశ పాలన వల్లే వైకాపాకు ఘోర పరాభవం ఎదురైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. జగన్‌రెడ్డి చేసిన కక్షసాధింపు రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పుగా పరిగణిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమాలను జగన్‌ అణచివేసి, పోలీసు రాజ్యం నడిపించారని అన్నారు.


ప్రజాగ్రహానికి నిదర్శనమే ఈ ఫలితాలు

-సీపీఎం

వైకాపా దుష్పరిపాలనపై ప్రజాగ్రహమే ఈ ఫలితాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. ‘సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. భాజపా పోటీ చేసిన ఆరు లోక్‌సభ స్థానాల్లో మూడు చోట్ల ఓడిపోవడం కేంద్రం చేసిన ద్రోహానికి ప్రజల స్పందన. ఇండియా కూటమి అభ్యర్థులకు ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు. 


వైకాపాను తిరస్కరించిన ఓటర్లు

-జనచైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి 

ఐదేళ్లుగా అరాచక పాలన సాగించిన వైకాపాను రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రకటనలో పేర్కొన్నారు. రూ.13.5 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడాన్ని ఓటర్లు గమనించారని విశ్లేషించారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడడం, పరిశ్రమలను ప్రోత్సహించకపోవడాన్ని గుర్తించి ప్రజలు ఓటు ద్వారా వైకాపాకు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.


పశ్చిమ బెంగాల్‌లో క్రీడాకారుల హవా

లోక్‌సభ ఎన్నికల్లో పలువురు క్రీడాకారులు సత్తా చాటారు.  మరి కొందరు ఓటమి పాలయ్యారు. భారత క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్, మాజీ క్రికెటర్‌ కీర్తి ఆజాద్‌ ఇరువురూ పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ అభ్యర్థులుగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఫుట్‌బాల్‌ దిగ్గజం ప్రసూన్‌ బెనర్జీ హావ్‌డా ఎంపీగా మూడోసారి విజయం సాధించారు.


‘కిశోరీ భయ్యా! మీకు అభినందనలు

యూపీలోని అమేఠిలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై గెలుపొందిన కాంగ్రెస్‌ అభ్యర్థి కిశోరీ లాల్‌ శర్మను ప్రియాంక గాంధీ ప్రశంసించారు. ‘కిశోరీ భయ్యా! మీరు గెలుస్తారని తెలుసు. మీకు నా అభినందనలు’ అని సోషల్‌మీడియాలో పోస్టు పెట్టారు.


మధ్యప్రదేశ్‌లో కమలం క్లీన్‌స్వీప్‌

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో పాలకపక్షమైన భాజపా మొత్తం 29 స్థానాలనూ క్లీన్‌స్వీప్‌ చేసింది. కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే, వీరేంద్రకుమార్‌ విజయం సాధించారు. కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న ఛింద్వాడా స్థానంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కమలనాథ్‌ కుమారుడైన సిటింగ్‌ ఎంపీ నకుల్‌నాథ్‌ ఓటమిని చవిచూశారు. రాజ్‌గఢ్‌ నుంచి దిగ్విజయ్‌సింగ్‌  ఓడిపోయారు.


మోదీకి విదేశీ నేతల అభినందన

కొలంబో, కాఠ్‌మాండూ: సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోసారి విజయం సాధించడంపై వివిధ దేశాధినేతలు మోదీకి అభినందనలు తెలిపారు. మరోసారి ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహాల్‌ పేర్కొన్నారు.


నేడు కేంద్ర కేబినెట్‌ భేటీ

కేంద్ర కేబినెట్‌ సమావేశం బుధవారం జరగనుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో జరిగే ఈ భేటీలో ప్రస్తుత లోక్‌సభ రద్దుకు నిర్ణయం తీసుకుంటారు. మోదీ నివాసంలో ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం జరగనుంది.


మూడు తరాల ముచ్చట

ఒకే పార్లమెంటు స్థానంలో మూడు తరాల వారు విజయబావుటా ఎగురవేయడం అరుదే. పెద్దపల్లిలో ఈ ఘనత సాధ్యమైంది. గతంలో ఇక్కడి నుంచి గడ్డం వెంకటస్వామి నాలుగుసార్లు, ఆయన కుమారుడు గడ్డం వివేక్‌ ఒకసారి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు వివేక్‌ తనయుడు వంశీకృష్ణ తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 

న్యూస్‌టుడే, లక్షెట్టిపేట, చెన్నూరు 


అత్యధికం 5,59,905.. అత్యల్పం 4,500

నల్గొండలో రాష్ట్రంలోనే అత్యధికంగా 5,59,905 ఓట్ల మెజార్టీని కాంగ్రెస్‌ అభ్యర్థి రఘువీర్‌ సాధించారు. ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థి రఘురాంరెడ్డి 4,67,847    ఆధిక్యంతో రెండో స్థానంలో నిలిచారు. అత్యల్పంగా మహబూబ్‌నగర్‌లో భాజపా అభ్యర్థి డీకే అరుణకు 4,500 ఓట్ల ఆధిక్యతే వచ్చింది.

ఈనాడు, హైదరాబాద్‌


వారసులొచ్చారు.. 

లోక్‌సభ ఎన్నికలు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుల వారసులకు కలిసొచ్చాయి. 4 స్థానాల్లో వారు విజయం సాధించారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి కుమారుడు రఘువీర్‌ నల్గొండ నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచారు. ఖమ్మంలో మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి కుమారుడు రఘురాంరెడ్డి, పెద్దపల్లిలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ కుమారుడు గడ్డం వంశీకృష్ణ, వరంగల్‌లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య గెలిచారు. నాగర్‌కర్నూల్‌లో సిటింగ్‌ ఎంపీ రాములు కుమారుడు భరత్‌ ప్రసాద్‌ పోటీ చేసినా గెలుపు దక్కలేదు. 


సిటింగ్‌ ఎంపీల్లో నలుగురికి మోదం.. 

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన 9 మంది సిటింగ్‌ ఎంపీల్లో నలుగురు మాత్రమే మళ్లీ విజయం సాధించారు. భారాస ఎంపీలు నామా నాగేశ్వరరావు ఖమ్మంలో, మన్నె శ్రీనివాస్‌రెడ్డి మహబూబ్‌నగర్‌లో, మాలోత్‌ కవిత మహబూబాబాద్‌లో విజయం సాధించలేకపోయారు. భారాస నుంచి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో, జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ భాజపాలో చేరి పోటీ చేసినా పరాజయం తప్పలేదు. భాజపా ఎంపీలు కిషన్‌రెడ్డి, సంజయ్, అర్వింద్‌తో పాటు అసదుద్దీన్‌ ఒవైసీ మరోసారి విజయం సాధించారు.


అప్పుడు ఓడారు... ఇప్పుడు గెలిచారు

శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన ఇద్దరు సిటింగ్‌ ఎంపీలకు పార్లమెంటు ఎన్నికల్లో విజయాలు దక్కాయి. కరీంనగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్‌ ఇదే లోక్‌సభ స్థానంలో గెలిచారు. కోరుట్ల సెగ్మెంట్‌లో ఓడిపోయిన ధర్మపురి అర్వింద్‌ నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో విజయం సాధించారు. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలైన రఘునందన్‌రావు మెదక్‌ లోక్‌సభ స్థానంలో గెలుపొందారు. హుజూరాబాద్‌లో ఓడిపోయిన ఈటల రాజేందర్‌.. మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో జయకేతనం ఎగురవేశారు.


మళ్లీ ఓటమే...

నిజామాబాద్‌ గ్రామీణం నుంచి భారాస ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయిన బాజిరెడ్డి గోవర్ధన్,  జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంటులో ఓటమి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలు.. నిజామాబాద్‌ ఎంపీగా పోటీ చేసినా మళ్లీ పరాజయమే ఎదురైంది. పటాన్‌చెరులో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నీలం మధు.. మెదక్‌ ఎంపీ అభ్యర్థిగానూ ఓటమి పాలయ్యారు. భారాస అభ్యర్థిగా హుజూర్‌నగర్‌లో ఓడిపోయిన సైదిరెడ్డికి నల్గొండ భాజపా ఎంపీ అభ్యర్థిగానూ ఓటమి తప్పలేదు. వర్ధన్నపేట భారాస అభ్యర్థిగా ఓడిపోయిన అరూరి రమేశ్‌కు భాజపా ఎంపీ అభ్యర్థిగా వరంగల్‌లోనూ విజయం దక్కలేదు.


433 మందికి నోటా కంటే తక్కువ ఓట్లు 

లోక్‌సభ ఎన్నికల్లో  17 నియోజకవర్గాల పరిధిలో నోటాకు 1,04,244 ఓట్లు పోలయ్యాయి. ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 525 మంది బరిలో నిలిచారు. ఇందులో 433 మందికి నోటా కంటే తక్కువగా ఓట్లు వచ్చాయి. సికింద్రాబాద్‌ స్థానంలో 45 మంది పోటీ చేయగా.. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు మినహా మిగిలిన 42 మందికి నోటాకు వచ్చిన 5,166 ఓట్ల కంటే తక్కువే పోలయ్యాయి. 


వారణాసిలో నాలుగో స్థానంలో యుగతులసి పార్టీ అధ్యక్షుడు శివకుమార్‌

యుగతులసి పార్టీ అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి 5,750 ఓట్లు సాధించారు. ప్రధాని మోదీపై పోటీచేసి ఆయన నాలుగో స్థానంలో నిలిచారు. మొత్తం ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. గోరక్ష నినాదంతో శివకుమార్‌ పోటీ చేశారు. 


జగన్‌ మేనమామపై మంచిర్యాల అల్లుడి విజయం

 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కమలాపురం తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించిన పుత్తా కృష్ణచైతన్య రెడ్డి మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి చిన్న అల్లుడు. వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మేనమామ, రవీంద్రనాథ్‌రెడ్డిపై కృష్ణచైతన్య రెడ్డి గెలుపొందారు.

న్యూస్‌టుడే, మంచిర్యాల అర్బన్‌


అధికారికంగా పెద్దపల్లిదే తొలి ఫలితం

రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల ఓట్ల లెక్కింపు ముగిసింది. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన లెక్కింపు సాయంత్రం అయిదున్నర గంటలకే పూర్తయినా..  ఫలితాల అధికారికప్రకటన కొంత ఆలస్యంగా వెలువడింది. మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు పూర్తయింది. అధికారికంగా మాత్రం తొలుత పెద్దపల్లి స్థానం ఫలితం సాయంత్రం అయిదు గంటల ప్రాంతంలో వెలువడింది.


ఫలితాలపై ఎవరేమన్నారంటే..

మోదీ తన విశ్వసనీయతను కోల్పోయారు. తక్షణం ఆయన రాజీనామా చేయాలి. ఈ ఎన్నికల్లో  భారత్‌ నెగ్గింది. భాజపా ఓడింది. ఇప్పుడు వారు టీడీపీ, నీతీశ్‌లను ప్రార్థిస్తున్నారు. నాకు తెలిసినంతవరకు వారు భాజపా మాట వినరు.

పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ


మేం ఎన్డీయేలో ఉన్నాం. ఎన్డీయేలోనే ఉంటాం. ఇది మా తుది నిర్ణయం. 

జేడీ (యూ) నేత కేసీ త్యాగి


ఈ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తానని ప్రగల్భాలు పలికిన నరేంద్ర మోదీ ప్రతిష్ఠకు ఇది ఎదురుదెబ్బ.                    

సీపీఎం


నీతీశ్‌ కుమార్, చంద్రబాబునాయుడుతో మాకు గతంలో పొత్తు ఉంది. ప్రతీకార రాజకీయాలు వారికి నచ్చవు. కేంద్ర ప్రభుత్వ మార్పిడిలో వీరిద్దరు కీలక పాత్ర పోషిస్తారని మేం భావిస్తున్నాం.

ఆర్జేడీ అధికార ప్రతినిధి మనోజ్‌ కుమార్‌


‘‘వరుసగా మూడోసారి ఎన్డీయే కూటమిని గెలిపించడం ద్వారా ప్రజలు మోదీని మాత్రమే విశ్వసిస్తారని ఈ ఎన్నికలు నిరూపించాయి’’ 

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా


‘‘ఈ దేశ పాలనలో మోదీ, అమిత్‌షాల జోక్యం ఉండకూడదని ఈ ఎన్నికలు తెలిపాయి. రాజ్యాంగంపై దాడి చేయడాన్ని, గత పదేళ్లుగా ప్రభుత్వం నడుపుతున్న తీరును హర్షించబోమని స్పష్టం చేశాయి’’

రాహుల్‌ గాంధీ


‘‘మోదీకి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పిది. రాజకీయంగా, నైతికంగా ఇది ఆయనకు ఓటమి’’ 

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే


చంద్రబాబు ప్రభుత్వం.. ఏపీ ప్రజల అదృష్టం

తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ

ఏపీలో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి రానుండడం అక్కడి ప్రజల అదృష్టమని తెలంగాణ రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు. ‘‘చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించిన రోజే వైసీపీ ఓటమి ఖాయమైంది. కక్ష సాధింపు చర్యలతోనే జగన్‌ ఓడిపోయారు’’ అని సురేఖ పేర్కొన్నారు.


కూటమికి తెలంగాణ మంత్రి తుమ్మల శుభాకాంక్షలు

చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో ఘన విజయం సాధించిన తెలుగుదేశం కూటమికి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. కూటమిని భారీ మెజారిటీతో గెలిపించిన ఏపీ ప్రజలను ఆయన అభినందించారు.


రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఓటేశారు: బాబ్జి

రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఓట్లు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించారని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జి అన్నారు. జనసేన కార్యాలయంలో మంగళవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రాజకీయ మార్పు కోరుతూ.. కూటమికి పార్టీ అధ్యక్షులు జయప్రకాష్‌ నారాయణ మద్దతు ఇచ్చారన్నారు.  


ఇది ప్రజాస్వామ్య విజయం 

-భాజపా నేత సాదినేని యామినీశర్మ

‘రాక్షస, నిరంకుశ, అరాచక, అవినీతి పాలనకు ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. ఇది ప్రజల, ప్రజాస్వామ్య విజయం. మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడిన వైకాపాను ముక్కలుగా చించారు. ఆ పార్టీకి ప్రజలు రాజకీయంగా సమాధి కట్టారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవనకళ్యాణ్‌లపై ప్రజలు నమ్మకం ఉంచారు. రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీయే కూటమి కలిసి పని చేస్తుంది.’


గతితప్పిన పాలనను గాడిలో పెట్టాలి

- హైకోర్టు ఉద్యోగులు సంఘం అధ్యక్షుడు అక్కెన వేణుగోపాల్‌

‘కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం గతితప్పిన రాష్ట్రపాలనను గాడిలోపెట్టాలి. ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన నూతన పీఆర్‌సీని అమలుచేయాలి. ఈలోగా తగినంత ఐఆర్, బకాయిలను సత్వరమే విడుదల చేయాలి. ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటూ వారి సంక్షేమానికి పెద్దపీట వేయాలి.’


మోదీ, చంద్రబాబులకు అభినందనలు తెలిపిన వెంకయ్యనాయుడు

ఈనాడు, దిల్లీ: ఎన్డీయే కూటమి విజయం సాధించి కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ, తెదేపా అధినేత చంద్రబాబుకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. మంగళవారం ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన ఇరువురికీ ఫోన్‌ చేసి మాట్లాడారు. ఫలితాల సరళి గురించి చర్చించి అభినందనలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని