రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తాం

‘అమరావతి ఏపీ రాజధానిగా ఉంటుంది. దీన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం దీనిపై తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా అమరావతి నిర్మాణం నిలిచింది.

Updated : 05 Jun 2024 07:58 IST

ఐదేళ్లుగా వైకాపా గాలికొదిలేసింది..
పోలవరం ప్రాజెక్టునూ కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుంది
భాజపా రాష్ట్ర ఎన్నికల సహఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్‌సింగ్‌
ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద గెలుపు సంబరాలు

విజయవాడలో భాజపా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కేక్‌ కోసి విజయోత్సవాలు నిర్వహిస్తున్న భాజపా రాష్ట్ర ఎన్నికల సహఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్‌సింగ్, నాయకులు వేటుకూరి సూర్యనారాయణరాజు, పాతూరి నాగభూషణం, మధుకర్‌జీ, బిట్రా శివన్నారాయణ, దినకర్, సాదినేని యామినీశర్మ తదితరులు

ఈనాడు, అమరావతి: ‘అమరావతి ఏపీ రాజధానిగా ఉంటుంది. దీన్ని అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం దీనిపై తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా అమరావతి నిర్మాణం నిలిచింది. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం విషయంలోనూ పురోగతి లేదు. త్వరలో ఏర్పడబోయే కూటమి ప్రభుత్వం దీనినీ పూర్తి చేస్తుంది’ అని భాజపా రాష్ట్ర ఎన్నికల సహఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్‌సింగ్‌ చెప్పారు. మంగళవారం ఆయన విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో కూటమి విజయోత్సవ సంబరాల్లో పాల్గొన్నాక మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. ఎన్డీయేపై అమితమైన విశ్వాసాన్ని ఉంచినందుకు ఏపీ ప్రజలను కృతజ్ఞతలు. ఇది కూటమి ఘనవిజయంగా భావిస్తున్నాం. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీయే డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలు ఏర్పాటవుతాయి. కేంద్రంలో భాజపా విడుదల చేసిన జాతీయ మ్యానిఫెస్టోను, రాష్ట్రంలో తెదేపా-జనసేన ప్రకటించిన ఎన్నికల హామీల అమలుపై దృష్టి సారిస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక, ఆర్థిక పథకాలను అందిస్తూ అభివృద్ధిని చేసి చూపిస్తాం. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేలా ఎన్డీయే కూటమి సుపరిపాలన ఆందిస్తుంది. నిరుపేదల అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. రైతులు, విద్యార్థులు, మహిళలు, పేదలు, తదితర అన్ని వర్గాల ఉన్నతికి కృషి చేస్తాం’ అని సిద్ధార్థనాథ్‌ సింగ్‌ వివరించారు.  

మిన్నంటిన సంబరాలు

కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే కూటమి గెలిచిన సందర్భంగా నగరంలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. కార్యాలయం ఎదుట కార్యకర్తలు పెద్దఎత్తున టపాసులు కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. భారత్‌ మాతాకీ జై.. వందేమాతరం.. కూటమి ఐక్యత వర్థిల్లాలి.. అంటూ నినదించారు. తెదేపా, జనసేన కార్యకర్తలూ ఈ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం నేతలతో కలసి సిద్ధార్థనాథ్‌సింగ్‌ కేక్‌ కోశారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు, ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్, రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీశర్మ, మీడియా ఇన్‌ఛార్జి పాతూరి నాగభూషణం, పార్టీ ప్రధాన కార్యదర్శి బిట్రా శివన్నారాయణ, రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షుడు షేక్‌బాజీ, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని