భాజపాకు కేసీఆర్‌ బాసటగా నిలిచారు!

లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును కాంగ్రెస్‌ గౌరవిస్తుందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు.

Published : 05 Jun 2024 05:07 IST

లేనట్లయితే కాంగ్రెస్‌కు 12 స్థానాలు వచ్చేవి
పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌

గాంధీభవన్‌ వద్ద కాంగ్రెస్‌ సంబరాల్లో వీహెచ్, పార్టీ నాయకులు

హైదరాబాద్, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును కాంగ్రెస్‌ గౌరవిస్తుందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. తమ లోక్‌సభ స్థానాల సంఖ్య 3 నుంచి 8కి పెరిగిందని.. కంటోన్మెంట్‌ ఉపఎన్నికలోనూ విజయం సాధించామని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలన పట్ల ప్రజలు నమ్మకంతో ఉన్నారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. కాంగ్రెస్‌కు ఓట్లేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్, ఎంపీ అనిల్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలరావు, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు తదితరులతో కలిసి మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మంగళవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘కవితకు బెయిల్‌ కోసం మాజీ సీఎం కేసీఆర్‌ భాజపాకు బాసటగా నిలిచారు. లేకుంటే కాంగ్రెస్‌కు 12కు పైగా సీట్లు వచ్చేవి. భాజపాను గెలిపించేందుకు కేసీఆర్‌ బలహీనమైన అభ్యర్థులను బరిలో నిలిపారు’’ అని మహేశ్‌కుమార్‌గౌడ్‌ పేర్కొన్నారు. ఏపీ ఫలితాలపై ఆయన స్పందిస్తూ రాచరిక, నియంతృత్వ పాలనను, ఒంటెద్దు పోకడలను ప్రజలు వ్యతిరేకించారన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ శ్రేణులు గాంధీభవన్‌లో బాణసంచా కాల్చి, డప్పు వాయిద్యాలు మోగించి పెద్దఎత్తున సంబరాలు జరుపుకొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని