మళ్లీ ఫీనిక్స్‌ పక్షిలా పుంజుకుంటాం: కేటీఆర్‌

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. రానున్న రోజుల్లో మరింతగా కష్టపడి మళ్లీ ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని, ఫీనిక్స్‌ పక్షిలాగా తిరిగి పుంజుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Published : 05 Jun 2024 05:08 IST

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. రానున్న రోజుల్లో మరింతగా కష్టపడి మళ్లీ ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని, ఫీనిక్స్‌ పక్షిలాగా తిరిగి పుంజుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై మంగళవారం కేటీఆర్‌ ఒక ప్రకటనలో స్పందించారు. ‘23 ఏళ్ల పార్టీ సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో రకాల ఎత్తుపల్లాలను చూశాం. అద్భుతమైన విజయాలతో పాటు అనేక ఎదురుదెబ్బలు తిన్న అనుభవం పార్టీకి ఉంది. అయినా పుంజుకున్న సందర్భాలెన్నో ఉన్నాయి. భారాస పార్టీగా మాకు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటాన్ని మించిన గౌరవం, విజయం మరేదీ లేదు. ఒక ప్రాంతీయ పార్టీగా రెండుసార్లు అద్భుతమైన మెజారిటీతో 2014లో 63 సీట్లు, 2018లో 88 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ప్రస్తుత శాసనసభలోనూ మూడో వంతు సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా భారాస కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు నిరాశ కలిగించినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం నాయకులు, కార్యకర్తలు ఎంతో శ్రమించారు. వారందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతలు. ఎప్పటిలాగే ప్రజాసమస్యలపై పోరాడుతూనే ఉంటాం. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వానికి వారి బాధ్యతను గుర్తు చేస్తూనే ఉంటాం’’ అని కేటీఆర్‌ తెలిపారు.

ప్రజాతీర్పును గౌరవిస్తాం: హరీశ్‌రావు 

లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తామని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. ‘రాజకీయాల్లో గెలుపోటములు సహజం. భారాస పార్టీ చరిత్రలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడింది. ఎంపీ ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందాల్సిన పని లేదు. లక్షల మంది కార్యకర్తల ఆశీస్సులు, అభిమానంతో తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో నిరంతరం శ్రమిస్తాం’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని