నాడు శపథం.. నేడు విజయపథం

తన సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అంబటి రాంబాబు మాట్లాడటం, దానికి కొందరు వైకాపా సభ్యులు వంతపాడటం, సభా నాయకుడిగా వారించాల్సిన సీఎం జగన్‌ వెకిలి నవ్వులతో వారిని ప్రోత్సహించడంతో చంద్రబాబు ఆరోజు తీవ్ర మనస్తాపం చెందారు.

Updated : 05 Jun 2024 08:39 IST

అసెంబ్లీలో నాడు చంద్రబాబుకు తీవ్ర అవమానం
భీషణ ప్రతిజ్ఞ నెరవేర్చుకొని.. సగర్వంగా సభలోకి!


ఇన్నేళ్లూ పరువు కోసం బతికాను. అలాంటిది ఈ రోజు సభలో నా భార్య ప్రస్తావన తెచ్చి అసభ్య వ్యాఖ్యలు చేశారు. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. ఇలాంటి సభలో నేనుండను. మళ్లీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగుపెడతాను. లేకపోతే నాకు రాజకీయాలే వద్దు. మీ అందరికీ ఓ నమస్కారం.’

2021 నవంబరు 19న శాసనసభలో చంద్రబాబు తీవ్ర అవమానభారంతో చేసిన భీషణ ప్రతిజ్ఞ ఇది. ఆ రోజు నుంచీ ఆయన అసెంబ్లీ సమావేశాలకు వెళ్లలేదు. ప్రజాక్షేత్రంలోనే వైకాపాపై బదులు తీర్చుకుని, ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడుతున్నారు.


ఈనాడు, అమరావతి: తన సతీమణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అంబటి రాంబాబు మాట్లాడటం, దానికి కొందరు వైకాపా సభ్యులు వంతపాడటం, సభా నాయకుడిగా వారించాల్సిన సీఎం జగన్‌ వెకిలి నవ్వులతో వారిని ప్రోత్సహించడంతో చంద్రబాబు ఆరోజు తీవ్ర మనస్తాపం చెందారు. ‘నేను ఎమ్మెల్యేగా ఎనిమిదోసారి సభలో అడుగుపెట్టాను. 1978 నుంచి రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ మహానాయకులతో కలసి పనిచేశాను. విపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఎప్పుడూ ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. రెండున్నరేళ్లుగా వ్యక్తిగతంగా, పార్టీపరంగా అవమానించినా ఎదుర్కొన్నాం. కానీ ఈరోజు నా కుటుంబం, భార్య ప్రస్తావన తెచ్చి, దానిపై నాకు మాట్లాడే అవకాశమివ్వకుండా మైక్‌ కట్‌ చేశాక.. ఈ సభలో నేనుండను’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి మళ్లీ ముఖ్యమంత్రయ్యాకే అసెంబ్లీకి వస్తానంటూ సభ నుంచి బయటకు వచ్చేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశానికి విషణ్ణ వదనంతో వచ్చిన బాబు.. పొంగుకొస్తున్న దుఃఖాన్ని అదిమి పెట్టుకుంటూ, గద్గదస్వరంతో మాట్లాడారు. ఓ దశలో దుఃఖాన్ని నియంత్రించుకోలేక వెక్కివెక్కి ఏడ్చారు. అంతకుముందు శాసనసభ ఆవరణలోని తన ఛాంబర్‌లోనూ ఆయన విలపించారు. ‘నా రాజకీయ జీవితంలో ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు కూడా ఇంత బాధపడలేదు. ఎన్నో సంక్షోభాల్ని హ్యాండిల్‌ చేశాను. కానీ నా భార్య వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. రాజకీయాలతో సంబంధంలేని నా భార్యను అవమానిస్తూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేలు నీచంగా మాట్లాడిన ఆ సభ, ఇక ఎంతమాత్రమూ గౌరవ సభ కాదు. అలాంటి కౌరవ సభకు వెళ్లబోన’ని ప్రతినబూనారు. చంద్రబాబు ఉద్వేగాన్ని చూసిన సహచర ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులూ చలించిపోయారు.

ఉండవల్లిలోని నివాసంలో మనవడితో కేక్‌ కోయిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు. చిత్రంలో వసుంధర, బ్రాహ్మణి, లోకేశ్, భువనేశ్వరి, లోకేశ్వరి


గతంలోనూ ఉమ్మడి ఏపీ, తమిళనాడుల్లో ఇవే దారుణాలు 

గతంలో ఎన్టీఆర్, జయలలిత, ఎంజీ రామచంద్రన్‌ కూడా అసెంబ్లీలో అవమానాలు ఎదుర్కొని మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతామని శపథం చేశారు. చెప్పినట్టుగానే ముఖ్యమంత్రులయ్యాకే అసెంబ్లీ గడప తొక్కారు. 1993 ఆగస్టులో నాటి జమ్మలమడుగు తెదేపా ఎమ్మెల్యే శివారెడ్డిని ప్రత్యర్థులు హత్యచేశారు. దానిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ప్రతిపక్ష నేతగా ఎన్టీఆర్‌ శాసనసభలో డిమాండ్‌ చేశారు. నాటి సీఎం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి నిరాకరించడంతో ఎన్టీఆర్‌ మినహా మిగతా ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియం వద్ద నిరసన తెలిపారు. సీట్లోంచి ఎన్టీఆర్‌ కదలకపోయినా, ఆయనతో సహా తెదేపా ఎమ్మెల్యేలందరినీ సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు. ఆగ్రహించిన ఎన్టీఆర్‌.. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నంతకాలం సభలో అడుగు పెట్టనని ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయారు. 1994 ఎన్నికల్లో మళ్లీ గెలిచి ముఖ్యమంత్రిగా సభలో ప్రవేశించారు.

  • 1989 మార్చి 25న తమిళనాడు శాసనసభలో అధికార డీఎంకే సభ్యులు ప్రతిపక్ష నేత జయలలిత చీర లాగారు. అవమానానికి గురైన జయలలిత.. సీఎంగానే సభలో అడుగుపెడతానని ప్రతిజ్ఞ చేసి బయటకు వెళ్లారు. 1991లో గెలిచాక సీఎంగా సభలో అడుగుపెట్టారు.
  • 1972లో అసెంబ్లీలో డీఎంకే సభ్యులు తనను తీవ్రంగా అవమానించడంతో ఎంజీ రామచంద్రన్‌ సభకు రానని ప్రతిజ్ఞ చేసి వెళ్లిపోయారు. ‘అసెంబ్లీ మరణించింది’ అని ఆనాడు వ్యాఖ్యానించారు. 1977లో మళ్లీ సీఎంగా సభలో అడుగు పెట్టారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని