తెదేపా సిటింగ్‌ల జయకేతనం

తెదేపా సిటింగ్‌ ఎమ్మెల్యేల్లో ఈసారి 17 మంది పోటీ చేయగా.. వారంతా విజయం సాధించారు. 2019లో వైకాపా గాలిలో కూడా.. తెదేపా 23 స్థానాల్లో గెలుపొందింది.

Published : 05 Jun 2024 05:21 IST

ఈనాడు-అమరావతి : తెదేపా సిటింగ్‌ ఎమ్మెల్యేల్లో ఈసారి 17 మంది పోటీ చేయగా.. వారంతా విజయం సాధించారు. 2019లో వైకాపా గాలిలో కూడా.. తెదేపా 23 స్థానాల్లో గెలుపొందింది. ఈ దఫా వారిలో 17 మంది పోటీచేసి విజయాన్ని సొంతం చేసుకున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు (కుప్పం), రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (టెక్కలి), బెందాళం అశోక్‌ (ఇచ్ఛాపురం), వెలగపూడి రామకృష్ణబాబు (విశాఖపట్నం తూర్పు), గంటా శ్రీనివాసరావు (భీమిలి), గణబాబు (విశాఖ పశ్చిమ), నిమ్మకాయల చినరాజప్ప (పెద్దాపురం), వి.జోగేశ్వరరావు (మండపేట), గోరంట్ల బుచ్చెయ్య చౌదరి (రాజమండ్రి గ్రామీణ), నిమ్మల రామానాయుడు (పాలకొల్లు), గద్దె రామ్మోహనరావు (విజయవాడ తూర్పు), అనగాని సత్యప్రసాద్‌ (వేమూరు), ఏలూరి సాంబశివరావు (పర్చూరు), గొట్టిపాటి రవికుమార్‌ (అద్దంకి), డోలా బాల వీరాంజనేయస్వామి (కొండపి), నందమూరి బాలకృష్ణ (హిందూపురం), పయ్యావుల కేశవ్‌ (ఉరవకొండ) జయకేతనం ఎగరవేశారు. రాజమహేంద్రవరం అర్బన్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని స్థానంలో, ఆమె భర్త ఆదిరెడ్డి వాసి బరిలో నిలిచి విజయం సాధించారు. ఉండి సిటింగ్‌ ఎమ్మెల్యే మంతెన రామరాజు స్థానంలో రఘురామకృష్ణంరాజుకు టికెట్‌ ఇవ్వడంతో, రామరాజు రెబల్‌గా పోటీచేసి ఓటమిపాలయ్యారు. 

వైకాపా పంచనచేరి పరాజయం..

గత ఎన్నికల్లో తెదేపా తరపున గెలిచిన వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్‌కుమార్, కరణం బలరామకృష్ణమూర్తి, మద్దాల గిరిధరరావు వైకాపా పంచన చేశారు. వీరిలో వల్లభనేని వంశీ (గన్నవరం), వాసుపల్లి గణేష్‌కుమార్‌ (విశాఖపట్నం దక్షిణ) వైకాపా తరపున పోటీచేసి ఓటమిపాలయ్యారు. కరణం బలరామ్‌.. తన స్థానంలో కుమారుడు కరణం  వెంకటేశ్‌ను చీరాల నుంచి వైకాపా తరపున బరిలో నిలపగా, ఓటమి తప్పలేదు. మద్దాల గిరిధరరావు (గుంటూరు పశ్చిమ)కు వైకాపా ఈసారి టికెట్‌ ఇవ్వలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని