అంబరాన్నంటిన సంబరాలు

ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవడంతో మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి.

Updated : 05 Jun 2024 05:27 IST

విజయోత్సవ ర్యాలీలో మంగళగిరి తెదేపా కేంద్ర కార్యాలయం వద్ద భావోద్వేగానికి గురైన మహిళ 

ఈనాడు డిజిటల్, అమరావతి: ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అద్భుత విజయాన్ని సొంతం చేసుకోవడంతో మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. మంగళవారం లెక్కింపు మొదలైనప్పటి నుంచే పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. మిఠాయిలు పంచుకొని, బాణసంచా కాల్చారు. లెక్కింపు ప్రక్రియను వీక్షించేందుకు వీలుగా కార్యాలయంలో పెద్ద ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేశారు. ఎన్డీయే అభ్యర్థులు ఆధిక్యంలో వచ్చిన ప్రతిసారి కార్యకర్తలు కేరింతలు కొడుతూ సందడి చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు సాయంత్రం కార్యాలయానికి చేరుకున్నారు. ఆ సమయంలో కార్యకర్తలు సీఎం, సీఎం అంటూ నినాదాలు హోరెత్తించారు. మహిళలు, వృద్ధులు, యువకులు సైతం పెద్దయెత్తున తరలివచ్చి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించారు.  అంతకుముందు తెదేపా కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

వెలవెలబోయిన వైకాపా కార్యాలయం

వైకాపా ఘోర పరాజయం చవిచూడటంతో తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వెలవెలబోయింది. ఉదయం పలువురు నాయకులు వచ్చినా.. లెక్కింపు ప్రక్రియ చూసి ఓటమి ఖాయమని గ్రహించి వెనుదిరిగారు. సాయంత్రానికి కార్యాలయానికి తాళాలు వేసి సిబ్బంది కూడా వెళ్లిపోయారు. మరోవైపు సీఎం క్యాంపు కార్యాలయం వద్ద కూడా నిర్మానుష్య వాతావరణం నెలకొంది. 


జనసేన కార్యాలయానికి చంద్రబాబు

మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి ఆ పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, పవన్‌ అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. పిఠాపురంలో జనసేన అధినేత విజయం సాధించినట్లు ప్రకటించగానే హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పవన్‌కు ఆయన సతీమణి తిలకం దిద్ది హారతి ఇచ్చారు. అక్కడ నుంచి భార్య, కుమారుడు, మేనల్లుడితో కలిసి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి పవన్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. సాయంత్రం 7.30 గంటలకు తెదేపా అధినేత చంద్రబాబు జనసేన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పవన్‌ దంపతులు, కుమారుడు పుష్పగుచ్ఛం అందజేసి, సత్కరించారు. తరువాత ఇరువురు నేతలు ఎన్డీయే కూటమి విజయంపై చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని