జవాబుదారీ ప్రభుత్వాన్ని స్థాపిస్తాం

జనసేనకు ఇచ్చిన ఈ చరిత్రాత్మక విజయం తనపై మరింత బాధ్యత పెంచిందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. తాము ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం.. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పేర్కొన్నారు.

Published : 05 Jun 2024 05:23 IST

ఆకాశమంత విజయాన్నిచ్చారు
భవిష్యత్తుకు పునాదులు వేసే సమయమిది
జనసేన గెలుపు 5 కోట్ల ప్రజల ఆకాంక్ష
పోటీ చేసిన స్థానాలన్నింటిలోనూ గెలిచి దేశంలోనే జనసేన రికార్డు
పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉద్ఘాటన

ఈనాడు డిజిటల్, అమరావతి: జనసేనకు ఇచ్చిన ఈ చరిత్రాత్మక విజయం తనపై మరింత బాధ్యత పెంచిందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. తాము ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం.. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే ప్రభుత్వాన్ని స్థాపిస్తామని పేర్కొన్నారు. ఎన్డీయే అఖండ విజయం సాధించిన తర్వాత మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ‘జగన్, వైకాపా నాయకులతో నాకు వ్యక్తిగత శతృత్వం లేదు. వారిని హింసించడం కోసం నాకు ప్రజలు ఈ విజయాన్నివ్వలేదు. ఇది పార్టీ శ్రేణులంతా గుర్తుంచుకోవాలి. 5 కోట్ల ప్రజల భవిష్యత్తుకు పునాదులు వేసే సమయమిది. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి మనం అన్ని విధాలుగా నలుగుతూనే ఉన్నాం. ఇక ఆ రోజులకు ముగింపు పలుకుతాం. భవిష్యత్తు తరాల కోసం పనిచేస్తాం’ అని పునరుద్ఘాటించారు. 

‘తొలిప్రేమ’ తర్వాత ఇదే నా విజయం

‘నా జీవితంలో సినీరంగంలో ‘తొలిప్రేమ’ తర్వాత ఇదే నా విజయం. నాకు గెలుపు అంతగా తెలియదు. నా జీవితం ఎన్నో దెబ్బలు తింటూ, మాటలు పడుతూ గడిచింది. ఈ రోజు మీరు నన్ను గుండెల్లో పెట్టుకుని జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్ని గెలిపించారు. దేశంలో ఇది మరెవ్వరికీ సాధ్యపడలేదు. ఈ విజయం జనసేనది కాదు.. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష. రైతన్నకు అండగా నిలబడతాం. ఆడబిడ్డలకు రక్షణ కల్పిస్తాం’ అని పేర్కొన్నారు. ఐదేళ్ల అరాచక పాలన నుంచి ప్రజలు మార్పు కోరుకున్నారన్నారు. 

అన్ని స్థానాలూ గెలిచినంత బాధ్యత నాపై ఉంది

‘పోటీ చేసింది తక్కువ స్థానాలే అయినా.. రాష్ట్రంలో అన్ని స్థానాలు గెలిస్తే ఎంత బాధ్యత ఉంటుందో అంత బాధ్యత నాపై ఉంది. రాష్ట్రంలో శాంతిభద్రతల్ని పటిష్ఠపరుస్తాం. వ్యవస్థలపై రాజకీయ ప్రమేయం తక్కువ ఉండేలా చేస్తాం. అధికారులకు స్వేచ్ఛ ఇస్తాం. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం కాదు నేను. ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఇచ్చిన సీపీఎస్‌ హామీని తప్పకుండా నెరవేరుస్తా. మెగా డీఎస్సీ విడుదల చేస్తాం. యువత నైపుణ్యాలకు తగిన ఉపాధి కల్పించే బాధ్యత నాది’ అని తెలిపారు. 


ఇల్లు అలకగానే పండగ కాదు

‘డబ్బు, పేరు కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు. ఎవరూ లేని వారికి అండగా ఉండటానికే నేను రాజకీయాల్లోకి వచ్చా. 2019 ఎన్నికల్లో నేను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడినప్పుడు, ఇప్పుడు పార్టీ అన్ని స్థానాలు గెలిచినప్పుడూ నా మానసిక స్థితిలో మార్పు లేదు. అంతే ధైర్యంతో ఉన్నా. ఈ గెలుపు నాకు బాధ్యత ఇచ్చింది. అహంకారం కాదు. గెలవగానే అందరూ అభినందనలు చెబుతున్నారు.. ఇల్లు అలకగానే పండగ కాదు. పనిచేయడంలో చూపిస్తాం. ధర్మో రక్షతి.. రక్షితః అనే సూక్తిని నేను బలంగా నమ్ముతా. పిఠాపురం నియోజకవర్గ ప్రజలు గెలిపించింది నన్ను కాదు.. 5 కోట్ల మంది ఆంధ్రుల్ని గెలిపించారు. అందరికీ కృతజ్ఞతలు. తెదేపా నేత వర్మకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎన్డీయేకు ఆకాశమంత విజయాన్నిచ్చారు. మీ ఇంట్లో ఒకడిగా ఉంటూ పని చేస్తా’ అని పవన్‌ హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని