అతిపెద్ద రాష్ట్రంలో చిన్నబోయిన కమలం

హస్తినలో పాలనపగ్గాలు చేజిక్కించుకోవాలంటే ఉత్తర్‌ప్రదేశ్‌లో విజయం సాధించాలనేది నానుడిగా పాతుకుపోయింది.

Updated : 05 Jun 2024 07:04 IST

యూపీలో ఇండియాకు 43, భాజపాకు 33 

లఖ్‌నవూ: హస్తినలో పాలనపగ్గాలు చేజిక్కించుకోవాలంటే ఉత్తర్‌ప్రదేశ్‌లో విజయం సాధించాలనేది నానుడిగా పాతుకుపోయింది. ఈసారి అక్కడ తమ ఆధిక్యతను చాటుకోవడానికి కమలనాథులు వ్యూహం రూపొందించినా చివరకు ఆ కూటమి కంటే ‘ఇండియా’కే యూపీలో ఎక్కువ సీట్లు వచ్చాయి. 80 సీట్లకు గానూ భాజపా నేతృత్వంలోని ఎన్డీయే 37 చోట్ల నెగ్గగా, ఇండియా కూటమి 43 సీట్లు (సమాజ్‌వాదీ 37, కాంగ్రెస్‌ 6) గెలిచింది. అధికార కూటమి తరఫున నెగ్గినవారిలో ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కూడా ఉన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్‌యాదవ్, ఆయన భార్య డింపుల్‌ యాదవ్‌ విజేతలుగా నిలిచారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అమేఠీలో ఓడిపోయారు. పొత్తులో భాగంగా పోటీచేసిన 17 స్థానాల్లో ఆరింటిని గెలుచుకోవడం కాంగ్రెస్‌ పార్టీకి ఊపిరిపోసినట్లయింది.  రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బలు చవిచూసిన సమాజ్‌వాదీ పార్టీకి ఈసారి కాంగ్రెస్‌తో పొత్తు కలిసివచ్చింది.


అయోధ్య జిల్లాలోనూ భాజపా ఓటమి 

యూపీలోని అయోధ్య జిల్లాలో ఫైజాబాద్‌ స్థానంలో భాజపాపై సమాజ్‌వాదీ అభ్యర్థి 54,567 ఓట్ల తేడాతో విజయం సాధించడం ఆసక్తికరంగా మారింది. ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రామాలయం ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉంది. 

  • సుల్తాన్‌పుర్‌లో భాజపా అభ్యర్థి మేనకాగాంధీ ఓడిపోయారు. అక్కడ సమాజ్‌వాదీ అభ్యర్థి రాంభుయాల్‌ నిషాద్‌కు ఆమె కంటే 43,174 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. 
  • ఆజాద్‌ సమాజ్‌పార్టీకి ఒక స్థానం రాగా, బీఎస్పీ ఖాతా తెరవలేకపోయింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని