బోల్తాపడ్డ మాయావతి ఏనుగు.. యూపీలో పది నుంచి శూన్యానికి..

అయిదేళ్ల కిందటి లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి 19 శాతం ఓట్లతో పది స్థానాలు గెలుపొంది మంచి పనితీరు కనబరచిన బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) తాజా ఫలితాల్లో చతికిలపడింది.

Published : 05 Jun 2024 06:27 IST

లఖ్‌నవూ: అయిదేళ్ల కిందటి లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి 19 శాతం ఓట్లతో పది స్థానాలు గెలుపొంది మంచి పనితీరు కనబరచిన బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) తాజా ఫలితాల్లో చతికిలపడింది. మాయావతి సారథ్యంలో రాష్ట్రంలో దళితుల గొంతుకకు ప్రతినిధిగా గుర్తింపు పొందిన పార్టీ ఉనికికి ఇది గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. తాజా ఎన్నికల్లో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా నిలిచిన సమాజ్‌వాదీ, మెరుగైన ఫలితాలు కనబరచిన కాంగ్రెస్‌ల కూటమి ముంద]ు మాయావతి చరిష్మా వెలవెలబోయింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లోనూ ‘సున్నా’ ప్రభావం చూపిన బీఎస్పీ.. 2019లో పొత్తు కారణంగా కోలుకొని పోటీచేసిన 38 స్థానాల్లో పదింట విజయం సాధించింది. ఈసారి మాయావతి ఏ కూటమిలో చేరకుండా ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించడమే కాకుండా, బీఎస్పీ ఎంపీల్లో కొందరు ఆమెకు దూరమయ్యారు. గతంలో పలు అంశాల్లో భాజపాకు ఆమె మద్దతుగా నిలిచిన కారణంగా బీఎస్పీ అంటే కమలదళానికి ‘బి’ టీం అని ప్రచారం చేయడంలోనూ మాయావతి రాజకీయ ప్రత్యర్థులు విజయం సాధించారు. దేశంలోకెల్లా అత్యధికంగా 80 ఎంపీ స్థానాలున్న ఉత్తర్‌ప్రదేశ్‌లో బీఎస్పీకి కీలక ఓటుబ్యాంకు అయిన దళితుల ఓట్లు 20 శాతం ఉన్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో మాయావతి ప్రభావం తగ్గించేందుకు భాజపా దళిత నాయకురాలైన సీనియర్‌ మంత్రి బేబీరాణి మౌర్యను ప్రోత్సహించగా, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ సైతం భీమ్‌ ఆర్మీ చీఫ్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌కు పరోక్ష మద్దతుగా నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని