ఒడిశాలో భాజపా పాగా

సార్వత్రిక ఎన్నికల్లో ఒడిశాలో భాజపా పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యత సాధించింది. 21 లోక్‌సభ స్థానాలకుగాను భాజపా 20 స్థానాలు గెల్చుకోగా.. కాంగ్రెస్‌ ఒక స్థానాన్ని సాధించింది.

Updated : 05 Jun 2024 07:27 IST

భువనేశ్వర్, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో ఒడిశాలో భాజపా పార్లమెంటు, అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యత సాధించింది. 21 లోక్‌సభ స్థానాలకుగాను భాజపా 20 స్థానాలు గెల్చుకోగా.. కాంగ్రెస్‌ ఒక స్థానాన్ని సాధించింది. బిజూ జనతాదళ్‌ (బిజద) ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. 147 అసెంబ్లీ స్థానాలకుగాను 78 చోట్ల భాజపా విజయం సాధించింది. 51 చోట్ల బిజద గెలిచింది. కాంగ్రెస్‌ 14 స్థానాలు సాధించింది. ఇతరులు నాలుగు చోట్ల గెలిచారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి శాసనసభలో 74 స్థానాలు అవసరం కాగా, భాజపా ఆ సంఖ్యను దాటేసింది. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ గంజాం జిల్లాలోని హింజిలితోపాటు బొలంగీర్‌ జిల్లాలోని కంటాభంజిలోనూ పోటీ చేశారు. హింజిలిలో సుమారు 4 వేల ఓట్లతో గెలిచారు. కంటాబంజిలో ఓటమి పాలయ్యారు. మంత్రివర్గ సహచరులు ఆశోక్‌చంద్ర పండా, టుకుని సాహు, ప్రదీప్‌ అమత్, బిక్రమ్‌కేసరి అరుక్, రీతా సాహు తదితరులు ఓటమి పాలయ్యారు. శాసనసభకు భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి దిలీప్‌రే పరాజయం పాలయ్యారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బిజదకు 113, భాజపాకు 23, కాంగ్రెస్‌కు 9 సీట్లు దక్కాయి.  ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సంబల్‌పూర్‌లో విజయం సాధించారు. భాజపా తరఫున పోటీచేసిన కేంద్ర మాజీ మంత్రి జోయల్‌ ఓరం, ప్రతాప్‌చంద్ర షడంగి, అపరాజిత షడంగి, సంబిత్‌ పాత్ర, భర్తృహరి మెహతాబ్‌ తదితరులు గెలిచారు. కాంగ్రెస్‌ సిటింగ్‌ ఎంపీ సప్తగిరి ఉలక మళ్లీ విజయం సాధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని