సరైన సమయంలో.. సరైన నిర్ణయం

వైకాపా మునుగుతున్న నావ అని గమనించి కొందరు.. తమ సిటింగ్‌ స్థానాల్లో టికెట్‌ ఇవ్వకుండా అవమానించారని ఇంకొందరు.. జగన్‌ నియంతృత్వ ధోరణిని వ్యతిరేకించి మరికొందరు ఆ పార్టీని వీడి, వేరే పార్టీల్లో చేరారు.

Published : 05 Jun 2024 06:31 IST

వైకాపాలో ఇమడలేక తెదేపా, జనసేనల్లో చేరిక
విజయబావుటా ఎగరేసిన నాయకులు  

ఈనాడు, అమరావతి: వైకాపా మునుగుతున్న నావ అని గమనించి కొందరు.. తమ సిటింగ్‌ స్థానాల్లో టికెట్‌ ఇవ్వకుండా అవమానించారని ఇంకొందరు.. జగన్‌ నియంతృత్వ ధోరణిని వ్యతిరేకించి మరికొందరు ఆ పార్టీని వీడి, వేరే పార్టీల్లో చేరారు. ఆ నిర్ణయమే వారిని ఇప్పుడు విజయతీరాలకు చేర్చింది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని అనిపించేలా చేసింది. వైకాపా నుంచి తెదేపాలో చేరిన మంత్రి, కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం  అనంతపురం జిల్లాలోని గుంతకల్లు నుంచి పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల్లో వైకాపా నుంచి గెలిచిన మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి (నెల్లూరు జిల్లా ఆత్మకూరు), మాజీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (నెల్లూరు గ్రామీణ) ఇప్పుడు తెదేపాలో చేరి, విజయభేరి మోగించారు. ఆనం వైకాపాలో ఎమ్మెల్యే ఉండగానే అక్కడ పార్టీ ఇన్‌ఛార్జిగా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని నియమించారు. ఆయన రాజ్యాంగేతర శక్తిగా నియోజకవర్గంలో అధికారాన్ని చలాయించారు. మరోవైపు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆనం ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి మాట్లాడినా, జిల్లాకు వచ్చినప్పుడు వినతిపత్రాలు సమర్పించినా ఎలాంటి స్పందనా లేకపోయింది. ప్రశ్నించినందుకు ఆయన్ను వేధించారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం, అభివృద్ధి గురించి అడిగారని కోటంరెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ చేయించి ఆయన్ను బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు ప్రయత్నించారు. కోటంరెడ్డి, ఆనం తిరగబడ్డారని వారిపై అనర్హత వేటు వేయించారు.

సిటింగ్‌ స్థానాన్ని కాదని..

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వద్దన్నారని ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గమైన సత్యవేడులో సిటింగ్‌ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు జగన్‌ టికెట్‌ నిరాకరించారు. పొగబెట్టేందుకు మొదట తిరుపతి లోక్‌సభ స్థానానికి మార్చారు. ఆయన ససేమిరా అన్నారు. దీంతో సత్యవేడులో కొత్త అభ్యర్థిని ప్రకటించేశారు. అవమానభారంతో ఆదిమూలం తెదేపాలో చేరి, ఇప్పుడు అదే సత్యవేడులో మళ్లీ గెలిచారు. ఆదిమూలం గెలవలేరనే మారుస్తున్నామని జగన్‌ అంటే.. ఆయన తెదేపాలో చేరి అక్కడే గెలిచి చూపించారు. మాజీ మంత్రి, బీసీ నేత కొలుసు పార్థసారథికి మంత్రి పదవినివ్వకుండా, నియోజకవర్గ అభివృద్ధికి సహకరించకుండా, కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వకుండా జగన్‌ అవమానించారు. ‘పెనమలూరు ప్రజలు నన్ను ఆదరిస్తున్నారు. మా నాయకుడు జగన్‌కే నా మీద ప్రేమ లేదు’ అని పార్థసారథి వాపోయారు. అవమానభారంతో వైకాపాను వీడి తెదేపాలో చేరారు. మైలవరం నియోజకవర్గంలో సామాజిక మాధ్యమాల్లో తనపై సొంత పార్టీ నేతలతోనే దుష్ప్రచారం చేయించడాన్ని ప్రశ్నించిన వసంత వెంకట కృష్ణప్రసాద్‌కూ తర్వాత వేధింపులు తప్పలేదు. దీంతో ఆయనా తెదేపాలో చేరారు. పార్థసారథి నూజివీడులో, మిగిలినవారు సొంత నియోజకవర్గాల్లో ఇప్పుడు తెదేపా తరఫున విజయభేరి మోగించారు. 2019లో వైకాపా తరఫున గన్నవరంలో పోటీ చేసి, తెదేపా అభ్యర్థి వల్లభనేని వంశీ చేతిలో ఓటమి చెందిన యార్లగడ్డ వెంకట్రావు తర్వాత కూడా అదే నియోజకవర్గంలో వైకాపా బాధ్యుడిగా పని చేశారు. ఎమ్మెల్యే వంశీ వైకాపా పంచన చేరడంతో ఈసారి ఆ పార్టీ టికెట్‌ ఆయనకే దక్కింది. ఇన్నాళ్లూ వ్యయప్రయాసలకోర్చి పార్టీని కాపాడుకున్న తనను మోసం చేశారని వెంకట్రావు వైకాపాను వీడి, తెదేపాలో చేరారు. వంశీపై గెలిచి, ప్రతీకారం తీర్చుకున్నారు.

ఎంపీలు కూడా..

వైకాపా నుంచి తెదేపాలో చేరిన ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు (నరసరావుపేట), మాగుంట శ్రీనివాసులురెడ్డి (ఒంగోలు) ఇప్పుడు అవే స్థానాల్లో తెదేపా అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచారు. మరో వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు ఆ పార్టీకి రాజీనామా చేసి తెదేపాలో చేరారు. ఇప్పుడు ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. వైకాపా రాజ్యసభ మాజీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా పార్టీలో తనకు పొగబెడుతున్నారని, తెదేపాలో చేరారు. ఈ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా సైకిల్‌ గుర్తుపై గెలిచారు. 

కూటమిని వీడి..పరాజయం పాలై

మరోవైపు విజయవాడ తెదేపా ఎంపీ కేశినేని నాని ఎన్నికల ముందు వైకాపాలో చేరారు. ఇప్పుడు అదే స్థానం నుంచి వైకాపా తరఫున పోటీ చేసి కూటమి అభ్యర్థి, సొంత తమ్ముడు కేశినేని శివనాథ్‌ చేతిలో పరాజయం పాలయ్యారు.


వైఎస్‌ కుటుంబ సన్నిహితుడైనా..

చిలీపట్నం ఎంపీ బాలశౌరి వైఎస్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. వారింటి మనిషిగా ఉంటారు. అలాంటి నాయకుడికీ వైకాపాలో అవమానాలు తప్పలేదు. ప్రతిపక్ష నేతలను తిట్టాలని చెప్పడమే కాకుండా. ఎప్పుడు కలిసినా ఏం తిట్టడం లేదు, లెక్క చూస్తున్నానని జగన్‌ తనను హెచ్చరించారని బాలశౌరి వాపోయేవారు. తెలంగాణ ముఖ్యమంత్రి దిల్లీలో ఒకసారి అందరు ఎంపీలకు విందునివ్వగా తమ అనుమతి లేకుండా ఆ విందుకు హాజరయ్యారని బాలశౌరిపై జగన్‌ మండిపడ్డారు. మరోవైపు ఆయన సిటింగ్‌ సీటును మరొకరికి ఇచ్చేందుకు జగన్‌ సిద్ధమయ్యారు. అలాంటి పరిస్థితుల్లో వైకాపాలో కొనసాగలేక బయటకొచ్చిన బాలశౌరి జనసేనలో చేరి  మచిలీపట్నం నుంచి మళ్లీ గెలిచారు. చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కూడా సిటింగ్‌ సీటు ఇవ్వకుండా అవమానించడంతో జనసేనలో చేరారు. తిరుపతి నుంచి జనసేన తరఫున భారీ మెజారిటీతో విజయ ఢంకా మోగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని