ఇండియా కూటమి నైతిక విజయంగా భావిస్తున్నా: నారాయణ

దేశవ్యాప్తంగా 400 సీట్లు వస్తాయని గొప్పలు చెప్పిన భాజపాకు ప్రజలు గట్టి గుణపాఠం నేర్పించారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మంగళవారం ఒ ప్రకటనలో పేర్కొన్నారు.

Published : 05 Jun 2024 06:36 IST

తెదేపా, జనసేనలకు అభినందనలు తెలిపిన సీపీఐ నేత

నగరి, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా 400 సీట్లు వస్తాయని గొప్పలు చెప్పిన భాజపాకు ప్రజలు గట్టి గుణపాఠం నేర్పించారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మంగళవారం ఒ ప్రకటనలో పేర్కొన్నారు. ఒకవేళ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు చేసినా, ఇష్టానుసారంగా వ్యవహరించేందుకు వీలులేకుండా చూసేందుకు అవసరమైన స్థాయిలో సీట్లను ఇండియా కూటమి సాధించిందన్నారు. ఒక రకంగా ఇది ఇండియా కూటమి నైతిక విజయంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీలో వైకాపా ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన తీర్పు గుణపాఠం వంటిదన్నారు. గతంలో వైకాపాకు 151 సీట్లు అందించిన రాష్ట్ర ప్రజలకు మేలు కన్నా, కక్ష సాధింపు రాజకీయాలపై దృష్టి సారించి, రాజకీయ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. గెలుపొందిన తెదేపాకు అభినందనలు తెలుపుతూ, ఈ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన పవన్‌కల్యాణ్‌కు అభినందనలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో పరిస్థితిపై ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ తమిళనాడు తరహాలో అన్ని కూటమి పార్టీలను కలుపుకొని తగు వ్యూహ రచనతో ముందుకు వెళ్లాలని సూచించారు. సొంత నిర్ణయాల కన్నా కూటమి పార్టీల అభిప్రాయాలను సేకరించి వారితో కలిసి పోటీ చేసి ఉంటే మరికొన్ని విజయాలు సాధించి ఉండేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని