అతివిశ్వాసమే వైకాపాను ముంచింది

‘అంతా మాదే..అంతటా మేమే..రాష్ట్రంలో అన్ని సీట్లలోనూ గెలుస్తున్నాం..కుప్పంలోనూ గెలుపుమాదే..వై నాట్‌ 175..అంటూ వైకాపా అధ్యక్షుడు జగన్‌ నుంచి వైకాపా ముఖ్యనేతలు, కిందిస్థాయి కార్యకర్తల వరకు ప్రగల్భాలు పలికారు.

Updated : 05 Jun 2024 07:16 IST

‘వై నాట్‌ 175.’..‘వైనాట్‌ కుప్పం’ నినాదాలు దెబ్బతీశాయి

ఈనాడు, అమరావతి: ‘అంతా మాదే..అంతటా మేమే..రాష్ట్రంలో అన్ని సీట్లలోనూ గెలుస్తున్నాం..కుప్పంలోనూ గెలుపుమాదే..వై నాట్‌ 175..అంటూ వైకాపా అధ్యక్షుడు జగన్‌ నుంచి వైకాపా ముఖ్యనేతలు, కిందిస్థాయి కార్యకర్తల వరకు ప్రగల్భాలు పలికారు. ఆ అతి విశ్వాసమే వైకాపా పాలిట శాపమైంది. ఆ అహంతోనే తప్పు మీద తప్పు చేస్తూ సరైన వ్యూహాలు రూపొందిచుకోలేకపోయారు. ఇది ఆ పార్టీకి ఘోర పరాజయాన్ని పరిచయం చేసింది. 

పవన్‌పై దూషణలు ఆత్మహత్య సదృశ్యమైంది

కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌పై వ్యక్తిగత దూషణలకు దిగి ఆయన వ్యక్తిత్వ హననానికి దిగారు. తద్వారా 2019లో మాదిరిగానే ఇప్పుడు కూడా బీసీలను ఆకర్షించాలన్న వ్యూహాన్ని అమలు జేశారు. అయితే పవన్‌పై దూషణల డోసు పెరగడంతో కాపు సామాజికవర్గంలో ఆయన పట్ల సానుభూతి పెరగడంతోపాటు వైకాపాను ఓడించాలన్న కసిని పెంచింది. ‘దత్తపుత్రుడు..నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు, భార్యలను మార్చినట్లే నియోజకవర్గాలను మారుస్తారు’ అంటూ స్వయంగా జగనే ప్రచారం చేయడం వారిలో మరింత ఆగ్రహాన్ని కలగజేసింది. దీంతో గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఈ సారి కాపులు ఏకతాటిపైకొచ్చారు. తెదేపాతో జనసేన పొత్తుకూ ఈ వర్గం మద్దతుగా నిలిచింది. సామాజికవర్గ బలం, జనసైనికులు కసిగా పనిచేయడం, తెదేపా ఓట్లు పూర్తిస్థాయిలో బదిలీకావడంతో జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లోనూ ఈ పార్టీ విజయదుందుభి మోగించింది.  

కులాలను విడగొట్టి ఆ కుంపట్లపై చలికాచుకోవాలని చేసిన ప్రయత్నమూ బెడిసి కొట్టింది.  బీసీలు తమ వైపు వచ్చారనున్న వైకాపా అంచనాలు తలకిందులయ్యాయి. 


చంద్రబాబుపై కక్ష.. తెదేపా-జనసేన బంధాన్ని బలోపేతం చేసింది

ధికార దుర్వినియోగానికి పాల్పడుతూ తెదేపాకు చెందిన సీనియర్‌ నాయకులపై కేసులు మోపి వారిని మానసికంగా బలహీనపరిచే వ్యూహాన్ని వైకాపా ఈ ఐదేళ్లలో అమలుజేసింది. అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులను అరెస్టు కూడా చేయించారు. అయ్యన్నపాత్రుడు లాంటి నేతలనూ ఇబ్బంది పెట్టారు. చివరకు తెదేపా అధినేత చంద్రబాబుపై కేసులు నమోదు చేయడంతోపాటు జైలుకు పంపారు. దీనివల్ల తెదేపా  డీలా పడుతుందని అంచనా వేశారు. కానీ, ఆ హఠాత్పరిణామంతో తెదేపా శ్రేణులు తీవ్రంగా ప్రతిస్పందించాయి. మరోవైపు న్యాయం కోసం నారా, నందమూరి కుటుంబాలూ రోడ్డెక్కాయి. ఇది వైకాపాను ఓడించాలన్న కసిని తెదేపా శ్రేణుల్లో పెంచింది. ఇదే సమయంలో చంద్రబాబుకు అండగా నిలిచేందుకు పవన్‌ కల్యాణ్‌ తెదేపాతో కలిసి పనిచేస్తామని రాజమహేంద్రవరం జైలు వద్దే ప్రకటించారు. అప్పటి నుంచే తెదేపా-జనసేన బంధం మరింత బలపడింది. తర్వాత భాజపా కూడా జత కట్టడంతో కూటమి సునామీనే సృష్టించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని