నల్గొండ గడ్డ.. కాంగ్రెస్‌ అడ్డా

బలమైన నాయకత్వం..క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం, రెండు లోక్‌సభ స్థానాల పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను పన్నెండింటిలో పార్టీ ఎమ్మెల్యేలే ఉండటం..వెరసి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్‌సభ సిటింగ్‌ స్థానాలను అధికార కాంగ్రెస్‌ నిలబెట్టుకుంది.

Published : 05 Jun 2024 06:40 IST

ఉమ్మడి జిల్లాలో పట్టు నిలుపుకొన్న అధికార పార్టీ
ఉత్తమ్, కోమటిరెడ్డి సోదరుల అండ
నల్గొండ, భువనగిరి సిటింగ్‌ స్థానాలు కైవసం
గణనీయంగా తగ్గిన భారాస ఓట్లు

నల్గొండ ఎంపీగా గెలుపొందినట్లు రఘువీర్‌కు గుర్తింపు పత్రాన్ని అందిస్తున్న ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ దాసరి హరిచందన.
చిత్రంలో ఎమ్మెల్యేలు బాలు నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యే జైవీర్‌ రెడ్డి

ఈనాడు, నల్గొండ: బలమైన నాయకత్వం..క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం, రెండు లోక్‌సభ స్థానాల పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను పన్నెండింటిలో పార్టీ ఎమ్మెల్యేలే ఉండటం..వెరసి ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్‌సభ సిటింగ్‌ స్థానాలను అధికార కాంగ్రెస్‌ నిలబెట్టుకుంది. నల్గొండలో ఉత్తమ్, కోమటిరెడ్డితోపాటు సీనియర్‌ నేత జానారెడ్డి ప్రచారాన్ని ముందుండి నడిపించగా.. భువనగిరిలో రాజగోపాల్‌రెడ్డి అంతా తానై స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో పార్టీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. నలుగురు నేతలు నియోజకవర్గాల వారీగా సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయడంతోపాటు సమీక్షలు నిర్వహించి క్షేత్రస్థాయి ప్రచారాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఇతర పార్టీల నుంచి కీలక నేతలను చేర్చుకుంటూనే.. ఎప్పటికప్పుడు కార్యకర్తలను గెలుపు వైపు కార్యోన్ముఖులను చేశారు. ఫలితంగా నల్గొండలో 60.5 శాతం ఓట్లు సాధించడం ద్వారా 5.59 లక్షల మెజారిటీతో కుందూరు రఘువీర్‌ గెలుపొందగా..భువనగిరిలో 2.22 లక్షలకు పైగా మెజార్టీతో చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విజయం సాధించారు. 2009 నుంచి నల్గొండలో వరుసగా నాలుగోసారి కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధించగా, 2008లో ఏర్పాటైన భువనగిరిలో కాంగ్రెస్‌ మూడోసారి గెలుపొందడం ద్వారా నల్గొండ గడ్డ కాంగ్రెస్‌కు అడ్డా అని మరోసారి నిరూపితమైంది. గతంలో నల్గొండ, భువనగిరి స్థానాల నుంచి ప్రస్తుత మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.


నాయకుల సమన్వయం.. జానారెడ్డి చాతుర్యం

ఎన్నికలకు ముందే నల్గొండ స్థానానికి మంత్రి ఉత్తమ్, భువనగిరికి మంత్రి వెంకట్‌రెడ్డిలను ఏఐసీసీ ఇన్‌ఛార్జులుగా నియమించింది. అనంతరం భువనగిరికి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి సమన్వయ బాధ్యతలు అప్పగించింది. బలమైన నాయకులున్నా..అంతర్గత విభేదాలతో రచ్చకెక్కే ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలను ఈ ఎన్నికల్లో సమన్వయం చేసే బాధ్యతలను సీనియర్‌ నేత జానారెడ్డి భుజాన వేసుకున్నారు. రెండింటిలోనూ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ నోటిఫికేషన్‌ వెలువడిన నాటి నుంచే ముమ్మర ప్రచారం నిర్వహించింది. భువనగిరి పరిధిలో సీఎం రేవంత్‌రెడ్డి రోడ్‌షోతోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇవన్నీ సత్ఫలితాలనిచ్చాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ లోక్‌ సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు కలిపి కాంగ్రెస్‌కు 7,66,069 ఓట్లు రాగా, ప్రస్తుతం రఘువీర్‌కు 7,84,337 ఓట్లు వచ్చాయి. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో సూర్యాపేట మినహా అన్ని అసెంబ్లీ స్థానాల్లో భారాస అభ్యర్థులు ఓట్ల పరంగా రెండో స్థానం దక్కించుకోగా, భాజపా అభ్యర్థులు డిపాజిట్‌లు కోల్పోయారు. ప్రస్తుతం భారాస ఓట్లు గణనీయంగా తగ్గిపోగా, భాజపా ఇప్పుడు రెండో స్థానంలోకి రావడం గమనార్హం.


కలిసి పనిచేశాం.. రికార్డు మెజార్టీ సాధించాం
మంత్రి కోమటిరెడ్డి, సీఎల్‌పీ మాజీ నేత జానారెడ్డి

నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్‌టుడే: కలిసి పనిచేసి కాంగ్రెస్‌ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎల్‌పీ మాజీ నేత జానారెడ్డి అన్నారు. నల్గొండ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి రఘువీర్‌ను 5,59,905 ఓట్ల మెజార్టీతో, భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని 2,22,170 ఓట్ల మెజార్టీతో గెలిపించిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. నల్గొండలోని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద వారిరువురూ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యేలందరూ సమష్టిగా పనిచేసి అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించారన్నారు. దేశవ్యాప్తంగా అత్యధిక మెజార్టీ సాధించిన అతి తక్కువ మందిలో రఘువీర్‌ ఉండటం నల్గొండకే గర్వకారణమన్నారు. కాంగ్రెస్‌తో కలిసి వచ్చిన పార్టీల సహకారమూ అభ్యర్థులకు కలిసివచ్చిందన్నారు. అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని పునరుద్ఘాటించారు. రఘువీర్‌ మాట్లాడుతూ.. తన విజయం కాంగ్రెస్‌ శ్రేణులందరి విజయంగా అభివర్ణించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని