ఖమ్మంలో కాంగ్రెస్‌ రికార్డు విజయం

ఖమ్మం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. ఈ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీని కైవసం చేసుకుంది.

Published : 05 Jun 2024 06:41 IST

విజయ సంకేతం చూపుతున్న రామసహాయం రఘురాంరెడ్డి

ఈటీవీ, ఖమ్మం: ఖమ్మం లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. ఈ నియోజకవర్గ చరిత్రలోనే అత్యధిక మెజార్టీని కైవసం చేసుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద విజయం నమోదు చేసింది. పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి తన సమీప ప్రత్యర్థి, భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 4,67,847 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇంతవరకూ 2019లో నామా నాగేశ్వరరావు(భారాస) సాధించిన 1,68,062 ఓట్ల మెజార్టీ అత్యధికంగా ఉండగా.. ఆ రికార్డును రఘురాంరెడ్డి చెరిపేశారు. లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు శాసనసభ సెగ్మెంట్లలోనూ ఆయన ఆధిక్యం పొందారు. ఐదు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడు నియోజకవర్గాల్లో మిత్రపక్షం సీపీఐతో కలిపి కాంగ్రెస్‌ 2.60 లక్షల ఓట్ల ఆధిక్యం లభించగా.. లోక్‌సభ ఎన్నికల్లో మరో 2.07 లక్షల ఓట్లు తన ఖాతాలో వేసుకుంది. సిటింగ్‌ స్థానాన్ని భారాస నిలుపుకోలేకపోయింది. గులాబీ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు 2,99,082 ఓట్లు సాధించారు. గతంతో పోలిస్తే భాజపా ఓట్లను గణనీయంగా పెంచుకుంది.  ఆ పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావుకు 1,18,636 ఓట్లు పోలయ్యాయి. భారాస, భాజపా అభ్యర్థులకు కలిపి 4,17,718 ఓట్లు రాగా.. వీటి కంటే కాంగ్రెస్‌ అభ్యర్థికి పోలైన ఓట్లు ఎక్కువగా ఉండటం విశేషం. ఇరవై ఏళ్ల తర్వాత ఖమ్మం లోక్‌సభ స్థానంపై కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ జెండా ఎగురవేసింది. 2004 నుంచి 2009 వరకు ఇక్కడి నుంచి రేణుకా చౌదరి కాంగ్రెస్‌ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని