గుబాళించని గులాబీ

లోక్‌సభ ఎన్నికల్లో భారాస పార్టీ పత్తా లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేసిన భారాస.. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ ప్రభావం చూపలేకపోయింది.

Updated : 05 Jun 2024 08:42 IST

ఒక్క లోక్‌సభ సీటూ దక్కని భారాస
14 చోట్ల మూడో స్థానానికే పరిమితం
రెండు సీట్లలోనే రెండో స్థానం
అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు లోక్‌సభ స్థానాల్లో ఆధిక్యం.. 
ఇప్పుడు ఆ ఏడింటిలోనూ భాజపా విజయం
ఈనాడు - హైదరాబాద్‌

లోక్‌సభ ఎన్నికల్లో భారాస పార్టీ పత్తా లేకుండా పోయింది. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేసిన భారాస.. ఏ ఒక్క నియోజకవర్గంలోనూ ప్రభావం చూపలేకపోయింది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి భారాస ఏ రౌండ్‌లోనూ ఆధిక్యం కనబర్చలేకపోయింది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఒక్క సీటునూ గెలుచుకోలేక చతికిలపడింది. కేవలం ఖమ్మం, మహబూబాబాద్‌లలో మాత్రమే రెండో స్థానం పొందింది. 14 సీట్లలో మూడో స్థానం, హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో నాలుగో స్థానానికి పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం తీవ్ర నైరాశ్యంలో ఉన్న భారాస పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకపోవడం పెద్ద ఎదురుదెబ్బే. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకూ తెలంగాణలో ఒక్క ఎంపీ సీటును కూడా గెలుచుకోకపోవడం ఇదే తొలిసారి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో భారాస ఓటమి పాలైనా.. కనీసం 39 స్థానాలు సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదాలో నిలిచింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి.. స్థానాల పరిధిలో తన ఆధిక్యాన్ని చాటింది. లోక్‌సభ ఎన్నికల్లో ఈ ఏడు స్థానాల్లో కూడా ఉనికిని చాటుకోలేకపోయింది. అవన్నీ భాజపా గెలుచుకొంది. భారాసకు కంచుకోటగా భావించే మెదక్‌ పార్లమెంటు స్థానంలోనైనా గెలుస్తామని ఆశించినా.. అది కూడా భంగపాటే అయింది. ఈ ఎన్నికల్లో జాతీయస్థాయిలో కేసీఆర్‌ పాత్ర ఏమీ ఉండదనే భావనతో పార్టీ శ్రేణులు కూడా భారాస అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోలేదని అర్థమవుతోంది. కాంగ్రెస్, భాజపాలకు తామే బలమైన ప్రత్యామ్నాయమనే విశ్వాసాన్ని పార్టీ శ్రేణుల్లో నింపడంలో భారాస అధిష్ఠానం విఫలమైంది. పార్లమెంటులో ప్రశ్నించే తెలంగాణ గొంతుకను గెలిపించాలని ఆ పార్టీ చేసిన విజ్ఞప్తిని ప్రజలు తిరస్కరించారు.  

ఆదిలోనే నీరుగారిన పోరు 

పార్లమెంటు ఎన్నికల్లో భారాస మొదటి టికెట్‌ను సిటింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డికి ప్రకటించారు. కానీ ఆయన కాంగ్రెస్‌ గూటికి చేరారు. ఆ తర్వాత వరంగల్‌ టికెట్‌ను అరూరి రమేశ్‌కు ఇస్తామంటే ఆయన వద్దని భాజపాలో చేరారు. కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు టికెట్‌ ఇస్తే.. ఆమె వెంటనే కాంగ్రెస్‌లో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ పక్షాన సికింద్రాబాద్‌ లోక్‌సభ అభ్యర్థిగా నిలబడ్డారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా బయటకు వెళ్లిపోతారనే ప్రచారం జోరుగా సాగడం పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేసింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన అభద్రతా భావం కొట్టుమిట్టాడింది. అధిష్ఠానం దీన్ని చక్కదిద్దే ప్రయత్నం చేసినా అప్పటికే ఆలస్యమైంది. కాంగ్రెస్, భాజపాలకు ప్రత్యామ్నాయం భారాసనే అనే విశ్వాసాన్ని.. పార్టీలో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల్లో పెంపొందించలేకపోయారు. దీంతో ఎన్నికల పోరు మొదలుకాకముందే భారాస పోటీలో లేకుండా పోయిందని విశ్లేషకులు చెబుతున్నారు.  

కేసీఆర్‌ బస్సుయాత్ర చేసినా...

భారాసకు ఎంపీ సీట్లు ఇచ్చినా.. రాష్ట్రానికి ప్రత్యేకంగా లబ్ధి చేకూర్చేది ఏమీ లేదనే భావనతో ఓట్లు వేశారని తెలుస్తోంది. దీంతో జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే కాంగ్రెస్, భాజపాల వైపు మొగ్గుచూపారు. అసెంబ్లీ ఎన్నికలైన మూడున్నర నెలలకే పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో.. పార్టీని పునరుత్తేజం చేయడంలో భారాస అధిష్ఠానానికి తగినంత సమయం లభించలేదనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 16 రోజులపాటు కేసీఆర్‌ బస్సు యాత్రతో విస్తృత ప్రచారం చేసినా ఫలితం దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో  మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని స్థానాల్లో భారాస ఎమ్మెల్యేలు గెలిచినా.. పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడి ఓటర్లు ‘కారు’కు బదులు కమలం వైపు మొగ్గు చూపారు.


పూర్తి పరాజయం ఇదే తొలిసారి

భారత రాష్ట్ర సమితి (నాటి తెరాస) పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా పార్లమెంటులో ప్రాతినిధ్యం కోల్పోయింది. 23 ఏళ్ల పార్టీ చరిత్రలో ఇంతటి పరాభవం ఎప్పుడూ చవిచూడలేదు. ఏ ఎన్నికల్లో పోటీ చేసినా సున్నా ఫలితాల వంటి చేదు అనుభవం ఎదురుకాలేదు. ఎంపీటీసీ మొదలు.. ఎంపీ వరకు ఏ ఎన్నికలు జరిగినా ఎంతో కొంత విజయమే దక్కింది తప్ప.. పూర్తి ఓటమి పొందిన చరిత్ర లేదు. లోక్‌సభ ఎన్నికలనే పరిగణనలోకి తీసుకుంటే..

  • 2001లో ఆవిర్భవించిన తెరాస.. 2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జట్టు కట్టి బరిలో దిగింది. ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేసి.. అయిదు చోట్ల విజయం సాధించింది. ఆనాడు కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో గెలిచిన కేసీఆర్‌.. తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అదే స్థానంలో 2006, 2008 ఉప ఎన్నికలు రాగా.. రెండుసార్లూ ఆయన విజయం సాధించారు. 
  • 2009 లోక్‌సభ ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా.. తెరాస తొమ్మిది స్థానాల్లో పోటీ చేసి రెండింట గెలిచింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో 17 లోక్‌సభ స్థానాల్లోనూ పోటీ చేసి 11 చోట్ల నెగ్గింది. ఆనాడు కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో.. మెదక్‌ ఎంపీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలోనూ గులాబీ పార్టీయే గెలిచింది. 
  • 2014లో వరంగల్‌ లోక్‌సభ సభ్యునిగా గెలిచిన కడియం శ్రీహరి రాజీనామా చేయడంతో.. 2015లో జరిగిన ఉప ఎన్నికలోనూ ‘కారు’ జోరు చూపి విజయం సాధించింది. 
  • 2019 లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో పోటీ చేసి 9 చోట్ల గెలిచింది. తాజాగా 17 స్థానాల్లో ఒక్కటీ గెలవలేదు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు