రూ.18 వేల కోట్లు కుమ్మరించినా.. తుక్కుతుక్కు!

రూ.10 కోట్లు.. రూ. 100 కోట్లు కాదు.. ఏకంగా రూ.18 వేల కోట్లపై మాటే. ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రధాన పార్టీ చేసిన ఖర్చు ఇది.

Published : 05 Jun 2024 06:43 IST

ఓటుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల పంపిణీ
అయినా తలొగ్గని ఓటర్లు
ప్రజాకంటక పాలనపై కన్నెర్ర
కూటమికి తిరుగులేని విజయం 

ఈనాడు, అమరావతి: రూ.10 కోట్లు.. రూ. 100 కోట్లు కాదు.. ఏకంగా రూ.18 వేల కోట్లపై మాటే. ఎన్నికల్లో రాష్ట్రంలోని ప్రధాన పార్టీ చేసిన ఖర్చు ఇది. గత సార్వత్రిక ఎన్నికల్లో ముందెన్నడూ చూడనంత ధన ప్రవాహం ఇది. గతంలో ఏ పార్టీ పంపిణీ చేయనంత సొమ్ము ఇది. ఇంత కుమ్మరించినా.. కూటమి సృష్టించిన సునామీలో ఆ పార్టీ తుక్కుతుక్కు అయింది. గత ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యం సాధించిన వారంతా.. ఈ దఫా చిత్తుచిత్తుగా ఓడిపోయారు. మొత్తానికి ఆ పార్టీ.. రెక్కలు విరిగి, కొన ఊపిరితో నేలకొరిగింది. రాష్ట్రంలో జరిగిన ఈ దఫా సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీ ఒక్కో ఓటుకు రూ.4 వేల నుంచి రూ.5 వేలు పంపిణీ చేసింది. అయినా ఓటర్లు.. డబ్బు ముఖ్యం కాదని తేల్చేశారు. ప్రజాకంటక పాలనను తుదముట్టించడమే తమ లక్ష్యమని నిరూపించారు. మరోసారి అవకాశం కల్పిస్తే రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారిపోతుందన్న చైతన్యంతో ఓటుకు పోటెత్తి కూటమికి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టారు.

ఏడాది ముందు నుంచే..

ఎన్నికలకు ఏడాది ముందు నుంచే ప్రధాన పార్టీ డబ్బు వెదజల్లడం ప్రారంభించింది. అందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుంది. వీటి ద్వారా వార్డు స్థాయి నుంచి సమాచారం సేకరించి.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. ఎన్నికల సమయం సమీపిస్తున్న కొద్దీ విజృంభించడం ప్రారంభించింది. మండలాలు, గ్రామాల వారీగా నాయకులు, కార్యకర్తల కొనుగోళ్లకు తెరతీసింది. మొత్తానికి.. ఒక్కో నియోజకవర్గానికి సగటున రూ.70 కోట్లు పైగా ఖర్చు చేసిందని అంచనా. చంద్రబాబు, పవన్‌కల్యాణ్, నారా లోకేశ్‌ తదితర ముఖ్యనేతలు పోటీ చేసే నియోజకవర్గాల్లో ఆ ప్రధాన పార్టీ నేతలు ఇంకా భారీగానే ఖర్చు పెట్టారు. వారిని ఓడించాలని, కొన్నిచోట్ల వారి ఆధిక్యాన్ని తగ్గించాలని ఓటుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల చొప్పున కూడా ఇచ్చారు.

విచ్చలవిడిగా తాయిలాలు

ఓట్ల కొనుగోలుకు రాష్ట్రంలోని ప్రధాన పార్టీ నేతలు నగదుకు తోడు.. ఎన్నికలకు ముందే తాయిలాలను కూడా విచ్చలవిడిగా పంపిణీ చేశారు. వాలంటీర్లకు మొబైల్‌ ఫోన్లు, బహుమతులు ఇచ్చారు. ఓటర్లకు గోడ గడియారాలు, చీరలు అందించారు. మద్యం పంపిణీకి అయితే అడ్డూఅదుపూ లేకుండా పోయింది. తిరుపతి జిల్లాలోని గోదాముల్లో భారీ ఎత్తున తాయిలాలు పట్టుబడ్డాయి. ఇలా ఒకటేమిటి.. గెలుపే లక్ష్యంగా అందుబాటులో ఉన్న అన్ని వనరులనూ వినియోగించుకున్నారు. ‘అడ్డగోలుగా నగదు, తాయిలాలు పంపిణీ చేశారు. అయినా.. బొక్కబోర్లా పడ్డారు’ అని సామాన్య జనం చెప్పుకొంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని