మూడు ముక్కలాటకు.. చావుదెబ్బ?

రాజధానిగా అమరావతికి మద్దతిస్తున్నామంటూ నమ్మబలికి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో డ్రామాలాడిన జగన్‌ను మూడు ప్రాంతాల ఓటర్లు చావుదెబ్బ కొట్టారు.

Published : 05 Jun 2024 06:44 IST

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక్కటీ గెలవని దుస్థితి
విశాఖ, కర్నూలు జిల్లాల్లోనూ తిరస్కరించిన ఓటర్లు 
అక్కడ అసాధారణ మెజార్టీతో కూటమి అభ్యర్థుల విజయం
విశాఖలో శ్రీభరత్‌కు 5.04లక్షలు, గుంటూరులో పెమ్మసానికి 3.45లక్షల ఆధిక్యం

ఈనాడు, అమరావతి: రాజధానిగా అమరావతికి మద్దతిస్తున్నామంటూ నమ్మబలికి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల పేరుతో డ్రామాలాడిన జగన్‌ను మూడు ప్రాంతాల ఓటర్లు చావుదెబ్బ కొట్టారు. రాజధానికి భూములిచ్చిన రైతుల్ని వెంటాడి వేధించడమే కాకుండా.. న్యాయం అడిగిన మహిళలపై క్రూర చేష్టలతో, అసభ్యంగా తూలనాడి, మానసికంగా శారీరకంగా హింసించినందుకు ఫలితం ఏమిటో తెలియజెప్పారు. అమరావతి ప్రాంతంలోని ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 33 అసెంబ్లీ స్థానాల్లో ఒక్కచోటా విజయం సాధించలేకపోయారు. విశాఖకు వచ్చేస్తున్నానంటూ మూడుముక్కలాట ఆడిన ఆయనకు.. మీ అవసరం లేదని అక్కడి ఓటర్లు తేల్చిచెప్పారు. కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన ఉమ్మడి విశాఖపట్నం, న్యాయరాజధానిగా ప్రకటించిన కర్నూలులోనూ జగన్‌ ప్రజల విశ్వసనీయత కోల్పోయారు. 151 స్థానాల్లో వైకాపా అభ్యర్థుల్ని గెలిపించి అధికారం అప్పగిస్తే.. దక్కినవాటితో సంతృప్తి పడకుండా దగాకోరు రాజకీయం చేశారు. తమకు ఎదురే లేదన్నట్లు అహంకారంతో వ్యవహరించారు. అందుకే.. ఈ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు. విశాఖపట్నంలో లోక్‌సభ అభ్యర్థి శ్రీభరత్‌ 5.04 లక్షల భారీ మెజారిటీతో వైకాపాను మట్టికరిపించారు. అనకాపల్లి లోక్‌సభ స్థానంలో భాజపా అభ్యర్థి సీఎం రమేశ్‌ 2.90 లక్షల భారీ మెజార్టీతో విజయం సాధించారు. రాజధాని ప్రాంతంలోని గుంటూరు లోక్‌సభ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్‌ 3.45 లక్షల ఆధిక్యంతో గెలుపొందగా.. విజయవాడ నుంచి కేశినేని శివనాథ్‌(చిన్ని) 2.82 లక్షలు, నరసరావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు 1.60 లక్షల మెజార్టీతో గెలుపొందారు. కర్నూలు తెదేపా తరఫున లోక్‌సభకు పోటీచేసి గెలిచిన బస్తిపాటి నాగరాజు 1.11 లక్షల ఆధిక్యం సాధించారు.

రాజధాని రైతుల్ని వేధించి.. మహిళల్ని హింసించి..

ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మొత్తం 33 అసెంబ్లీ స్థానాలకు గాను.. గత ఎన్నికల్లో 30 అసెంబ్లీ స్థానాలు వైకాపాకు దక్కాయి. ఎన్నికల్లో గెలిచాక గుంటూరు పశ్చిమ నుంచి మద్దాళి గిరిధర్, గన్నవరం నుంచి వల్లభనేని వంశీమోహన్‌ వైకాపాలో చేరారు. విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన కేశినేని నాని 2024 ఎన్నికల ముందు వైకాపా తీర్థం పుచ్చుకుని ఆ పార్టీ తరఫున బరిలో నిలిచారు. కానీ, అధికారంలోకి వచ్చాక రాజధాని ప్రాంతంలో సాగుతున్న అభివృద్ధి పనుల్ని జగన్‌ నిలిపేయించారు. శాసనరాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయరాజధానిగా కర్నూలును ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని కోరుతూ నిరసనలకు దిగిన రాజధాని ప్రాంత రైతులపై ప్రభుత్వం పోలీసు బలగాల్ని ప్రయోగించి కుళ్లబొడిపించింది. ఇళ్లపై దాడులు చేయించి, అక్రమ కేసులు బనాయించి జైళ్లలో పెట్టింది. న్యాయం కోరుతున్న మహిళలపై లాఠీఛార్జి చేయించి.. వారిని అమానుషంగా హింసించింది. ఆందోళన చేస్తున్న రైతులు, ఇతర వర్గాల వారిని వాహనాల్లో ఎక్కించి ఎక్కడెక్కడో పోలీస్‌స్టేషన్లకు తరలించింది. ఎస్సీ, ఎస్టీ రైతులపైనే ఎస్సీ కేసులు పెట్టించారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల రైతులు, సాధారణ ప్రజలు ఎక్కడికక్కడే ఆందోళనలు చేయగా.. అధికారబలంతో ప్రభుత్వం వారిపై విరుచుకుపడింది. ఇవన్నీ రెండు జిల్లాల ప్రజల్లో తీవ్ర అసహనానికి కారణమయ్యాయి. ఐదేళ్లపాటు ప్రజలు వీటన్నింటినీ మౌనంగా భరించిన ప్రజలు.. రెండు జిల్లాల పరిధిలో వైకాపా ఉనికి లేకుండా తీర్పు ఇచ్చారు. 29 చోట్ల తెలుగుదేశం, రెండు చోట్ల జనసేన, రెండు చోట్ల భాజపా అభ్యర్థులు గెలుపొందారు.


విశాఖ, కర్నూలులోనూ ఘోర పరాజయమే

కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన విశాఖపట్నంలోనూ.. వైకాపా అలజడులు సృష్టించింది. భారీ ఎత్తున భూముల కబ్జా చేసింది. ప్రభుత్వస్థలాలు తనఖా పెట్టింది. లులు వంటి సంస్థలను, ఐటీ పరిశ్రమల్ని తరిమేసింది. రుషికొండకు గుండుకొట్టి ప్యాలెస్‌లు నిర్మించారు. ఎన్నికల్లో గెలిచాక.. అక్కడే ప్రమాణస్వీకారం చేస్తామని జగన్‌ చెప్పిన మాటలనూ అక్కడి ప్రజలు నమ్మలేదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గత ఎన్నికల్లో 11 చోట్ల విజయం సాధించింది. ఈ దఫా రెండు స్థానాలతో సరిపెట్టారు. ఎనిమిది చోట్ల తెదేపా, నాలుగు చోట్ల జనసేన, ఒక స్థానంలో భాజపా అభ్యర్థులు గెలుపొందారు.

న్యాయరాజధానిగా ప్రకటించిన కర్నూలుకూ వైకాపా ప్రభుత్వం చేసిందేమీ లేదు. భవనాలు నిర్మించి.. కొన్ని సంస్థలనే అక్కడకు తరలించారు. రెండు రోజుల కిందట కూడా ఏపీఈఆర్సీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత ఎన్నికల్లో మొత్తం స్థానాల్ని దక్కించుకున్న వైకాపా.. ఈ దఫా కర్నూలుకు దూరంగా ఉన్న రెండు నియోజకవర్గాల్లోనే గెలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని