రాయలసీమలో.. 7 స్థానాలతో సరి!

ఎన్నికల్లో 175 స్థానాలూ తమవేనంటూ బీరాలు పలికిన వైకాపాకు ఫలితాలు చూశాక గొంతు మూగబోయింది. ఎనిమిది జిల్లాల్లో ఆ పార్టీ బోణీ కూడా కొట్టలేదు.

Published : 05 Jun 2024 06:46 IST

సీఎం జగన్‌ సొంత జిల్లాలో ఏడుచోట్ల వైకాపా ఓటమి
మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డినీ గెలిపించుకోలేని దుస్థితి
ఉమ్మడి ప్రకాశం, విశాఖలో రెండేసి చోట్ల గెలుపు
8 జిల్లాల్లో బోణీ కొట్టని వైకాపా

ఈనాడు, అమరావతి: ఎన్నికల్లో 175 స్థానాలూ తమవేనంటూ బీరాలు పలికిన వైకాపాకు ఫలితాలు చూశాక గొంతు మూగబోయింది. ఎనిమిది జిల్లాల్లో ఆ పార్టీ బోణీ కూడా కొట్టలేదు. మిగిలిన 5 జిల్లాల్లో కలిపి 11 స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితికి దిగజారింది. వైకాపాకు బలం అధికంగా ఉండే రాయలసీమలోనూ ఆ పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. కూటమి బలం భారీగా పెరిగింది. 52 అసెంబ్లీ స్థానాలకు గాను 45 చోట్ల తెదేపా, మిత్రపక్షాల అభ్యర్థులు విజయం సాధించగా.. వైకాపా ఏడుచోట్లే గెలిచింది. సీఎం జగన్‌ సొంత జిల్లా ఉమ్మడి కడపలో 10 అసెంబ్లీ స్థానాలుంటే.. వాటిలో మూడే వైకాపాకు దక్కాయి. సీఎం జగన్‌ సొంత స్థానం పులివెందులతో పాటు బద్వేలు, రాజంపేట స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. సీఎం మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి 25వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఉమ్మడి కడప జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 2, చిత్తూరు జిల్లాలోనూ 2 స్థానాలకే వైకాపా పరిమితమైంది. 14 అసెంబ్లీ స్థానాలున్న అనంతపురం జిల్లాలో ఒక్క స్థానమూ గెలవలేదు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ పాడేరు, అరకు అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. 

  • 2014 ఎన్నికల్లోనూ వైకాపా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఒక్క చోట కూడా విజయం సాధించలేదు. 
  • 2019లో తెదేపా ఉమ్మడి విజయనగరం, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లో బోణీ కొట్టలేకపోయింది. 
  •  ఈ ఎన్నికల్లో వైకాపా.. ఏకంగా 8 జిల్లాల్లో ఒక్క స్థానమూ దక్కించుకోలేక బోర్లాపడింది. 

ఈ ప్రాంతాల్లో.. వైకాపాకు మిగిలింది గుండు సున్నాయే

  • ఉత్తరాంధ్రలోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 34 స్థానాలకు వైకాపా 2 చోట్లే గెలుపొందింది.
  • ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 34 స్థానాల్లో.. ఒక్కటీ గెలవలేకపోయింది. వైకాపాకు ఓటర్లు సున్నా చుట్టేశారు. 
  • ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ వైకాపాకు మిగిలింది గుండుసున్నాయే.
  • ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 22 స్థానాలుంటే.. అందులో ప్రకాశం జిల్లాలో రెండుచోట్ల బయటపడింది. మిగిలిన 20 స్థానాల్లోనూ ఓటర్లు కొట్టిపడేశారు. 

వైకాపా ఖాతా తెరవని జిల్లాలు 

శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, అనంతపురం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని