ఎగ్జిట్‌ పోల్‌లో ‘కేకే’

రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాలపై పలు సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ ద్వారా ఫలితాలు ప్రకటించినా కేకే సర్వేస్‌ అనే సంస్థ మాత్రమే వాస్తవ అంకెలకు చాలా దగ్గరగా నిలిచింది.

Published : 05 Jun 2024 06:50 IST

కూటమికి 161 స్థానాలని అంచనా.. 
164 సీట్లలో విజయ కేతనం
కాస్త దగ్గరగా.. పీపుల్స్‌పల్స్‌ అంచనాలు
ఆరా మస్తాన్‌ లెక్కలు తలకిందులు 

ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఫలితాలపై పలు సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ ద్వారా ఫలితాలు ప్రకటించినా కేకే సర్వేస్‌ అనే సంస్థ మాత్రమే వాస్తవ అంకెలకు చాలా దగ్గరగా నిలిచింది. కూటమి 161 స్థానాల్లో విజయం సాధిస్తుందని కేకే అంచనా వేయగా.. మొత్తం 164 స్థానాల్లో విజయం దక్కింది. 135 స్థానాల్లో కూటమి గెలుస్తుందని పీపుల్స్‌ పల్స్‌ సంస్థ అంచనా వేసింది. జనగళం, రైజ్, చాణక్య స్ట్రాటజీస్‌ సంస్థలు కూడా కూటమి విజయం సాధిస్తుందని చెప్పాయి. ఆరా సర్వే మాత్రం ఎన్డీయే 71 నుంచి 81 స్థానాల్లోనే గెలుస్తుందని అంచనా వేయగా.. అంతకు రెట్టింపు సీట్లు దక్కాయి. అంటే దాదాపుగా ఆ సంస్థ లెక్కలు తలకిందులైనట్లే. 

  • లోక్‌సభ స్థానాల విషయంలో కూటమి 21-23 చోట్ల విజయం సాధిస్తుందని ఇండియా టుడే-యాక్సిస్‌ మై ఇండియా అంచనా వేయగా.. 21 స్థానాల్లో విజయం సాధించింది. టైమ్స్‌నౌ సంస్థ వైకాపాకు ఎంపీ స్థానాలు 14 వస్తాయని అంచనా వేయగా 4 మాత్రమే దక్కాయి. ఏబీపీ-సీఓటర్, ఇండియా టీవీ, న్యూస్‌ 18 మెగా, చాణక్య స్ట్రాటజీస్, రైజ్, టుడేస్‌ చాణక్య సంస్థల సర్వేలూ వాస్తవాలకు కొంతమేరకే దగ్గరగా వచ్చాయి. 13 నుంచి 15 స్థానాల్లో వైకాపా లోక్‌సభ అభ్యర్థులు విజయం సాధిస్తారంటూ ఆరా సంస్థ వేసిన అంచనాలూ తప్పని తేలాయి. 
  • కూటమి 161 స్థానాల్లో విజయం సాధిస్తుందని కేకే సర్వేస్‌ సంస్థ చెబితే.. మరీ ఇంత అడ్డగోలు లెక్కలా? అని కొందరు కొట్టి పడేశారు. తెలుగుదేశం పార్టీకి 133, జనసేనకు 21, భాజపా 7 స్థానాల్లో గెలుస్తుందంటే.. ఆ పార్టీ నేతలే అంతగా నమ్మలేదు. వైకాపాకు 14 స్థానాలు లేదా ఇంకా తక్కువే వస్తాయని చెబితే.. ఆ పార్టీ నేతలు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఓట్ల లెక్కింపు మొదలయ్యాక.. ఆ సంస్థ లెక్కల్లో వాస్తవమేంటో తేలింది. రాజకీయ పండితుల ఊహకు కూడా అందని ఫలితాలను ముందే అంచనా వేసిన కేకే ఎవరంటూ ఎంతోమంది నెట్‌లో వెతుక్కున్నారు.  
  • వైకాపా 2 నుంచి 4 లోక్‌సభ స్థానాల్లో మాత్రమే గెలుస్తుందని యాక్సిస్‌ మై ఇండియా సర్వే చెబితే.. ‘దయతో మాకు రెండు స్థానాలిచ్చారంటూ’ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్డీయే కూటమి 98 నుంచి 120 అసెంబ్లీ స్థానాల్లో గెలుస్తుందని ఆ సంస్థ అధిపతి ప్రదీప్‌గుప్తా చెబితే.. ఇండియాటుడే ఛానెల్‌ విలేకరులే అనుమానించారు. చివరకు ఆ సంస్థ అంచనాలను మించిన విజయాన్ని కూటమి దక్కించుకుంది.  

సఆరా.. ఔరా మస్తాన్‌! 

వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తుందని.. 94 నుంచి 104 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఆరా మస్తాన్‌ ప్రకటించారు. కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పే ఇతర సర్వేలన్నీ కాకి లెక్కలేనని విమర్శించారు. చివరకు తన అంచనాలు తలకిందులు కావడంతో ఆరా మస్తాన్‌ కాస్తా.. వైకాపా మస్తాన్‌గా మిగిలారు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని