చిత్తూరు జిల్లాలో దూసుకెళ్లిన సైకిల్‌

‘వై నాట్‌ 175’, ‘వై నాట్‌ కుప్పం’ అంటూ బీరాలు పలికిన వైకాపాకు చిత్తూరు జిల్లా ఓటర్లు కర్రు కాల్చి వాతపెట్టారు. చిత్తూరు జిల్లా మా కంచుకోట అని విర్రవీగినందుకు గూబ గుయ్యిమనిపించారు.

Published : 05 Jun 2024 06:51 IST

‘వై నాట్‌ కుప్పం’ అని ప్రగల్భాలు పలికి బొక్కబోర్లా పడ్డ వైకాపా  
పుంగనూరులో చావుతప్పి కన్ను లొట్టపోయిన పెద్దిరెడ్డి  

ఈనాడు, చిత్తూరు: ‘వై నాట్‌ 175’, ‘వై నాట్‌ కుప్పం’ అంటూ బీరాలు పలికిన వైకాపాకు చిత్తూరు జిల్లా ఓటర్లు కర్రు కాల్చి వాతపెట్టారు. చిత్తూరు జిల్లా మా కంచుకోట అని విర్రవీగినందుకు గూబ గుయ్యిమనిపించారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు.. ఎనిమిదోసారి కుప్పం నుంచి ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించారు. ప్రత్యర్థులపై అసభ్యపదజాలంతో విరుచుకుపడే మంత్రి రోజాను నగరి ఓటర్లు ఇంటికి పంపించారు. ఇక్కడ తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్‌ విజయం సాధించారు. ఎస్సీ రిజర్వుడు స్థానాలైన పూతలపట్టు, గంగాధరనెల్లూరు నియోజకవర్గాలు వైకాపాకు కంచుకోటలు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఇప్పటి వరకూ ఒక్కసారి తెదేపా ఇక్కడ గెలుపొందలేదు. ఈ నియోజకవర్గాల్లో తెదేపా అభ్యర్థులు మురళీమోహన్, థామస్‌లు ప్రజా వ్యతిరేకతను ఓటుగా మార్చుకోవడంలో సఫలీకృతులై అఖండ విజయం సాధించారు. మూడు దశాబ్దాలుగా కొరుకుడుపడని గంగాధరనెల్లూరులో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మిపై తెదేపా అభ్యర్థి వీఎం థామస్‌ 26 వేలకు పైగా ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. మరో రిజర్వుడు స్థానం చిత్తూరులోనూ తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్‌ విజయం సాధించారు. భానుప్రకాష్, థామస్, జగన్మోహన్, మురళీమోహన్‌ తొలిసారి చట్టసభల్లోకి అడుగుపెట్టనున్నారు. పలమనేరులో తెదేపా అభ్యర్థి ఎన్‌.అమరనాథరెడ్డి గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. చావు తప్పి కన్నులొట్టపోయిందన్న చందంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక్కరే ఓటమి తప్పించుకున్నారు. 

చంద్రబాబు కోట.. కుప్పం

రాజకీయాల్లోకి వచ్చిన మొదటిసారి చంద్రగిరిలో పోటీ చేశారు చంద్రబాబు. ఆపై కుప్పానికి వచ్చారు. అప్పట్నుంచి చంద్రబాబుకు కుప్పం పెట్టని కోటగా మారింది. ఇక్కడ ఆయన్ను ఓడించాలని జగన్‌ మొదలుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వరకు అందరూ ప్రయత్నించారు. కుప్పంలో దౌర్జన్యాలు, అరాచకాలకు పాల్పడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తెదేపాను ఇబ్బందులు పెట్టారు. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసి, అధికార దుర్వినియోగానికి పాల్పడి 25 సీట్లలో 19 గెలుచుకున్నారు. అనంతరం జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంలో ‘మీ అధినేత చంద్రబాబు ముఖం ఒక్కసారి చూడాలని ఉంది’ అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో జగన్‌ వ్యంగ్యంగా అన్నారు. కుప్పం నుంచి భరత్‌ను గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తానని పలు సభల్లో జగన్‌ చెప్పినా, ఎన్నికల్లో భరత్‌ విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లినా ఓటర్లు చంద్రబాబుపై మరోమారు ప్రేమ చాటుకున్నారు. 48,006 మెజారిటీతో గెలిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు