హింసాత్మక శక్తులపై ఓటుతో వేటు

గత అయిదేళ్లుగా కన్నూమిన్ను కానరాకుండా పేట్రేగిపోయిన అరాచక శక్తులపై జనం ఓటుతో వేటేశారు. ఇలాంటి దాడులు, అరాచక సంస్కృతిని సహించేది లేదంటూ స్పష్టమైన తీర్పునిచ్చారు.

Published : 05 Jun 2024 06:52 IST

ఈనాడు-అమరావతి: గత అయిదేళ్లుగా కన్నూమిన్ను కానరాకుండా పేట్రేగిపోయిన అరాచక శక్తులపై జనం ఓటుతో వేటేశారు. ఇలాంటి దాడులు, అరాచక సంస్కృతిని సహించేది లేదంటూ స్పష్టమైన తీర్పునిచ్చారు. వారి దాష్టీకాలు, అక్రమాలను భరించలేక ప్రజలు విసిగిపోయుంటే.. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్‌ వారిని ప్రజలకు పరిచయం చేస్తూ.. వీరంతా సౌమ్యులు, మంచివాళ్లు అంటూ పేర్కొనటం అది జనాల్లో పుండు మీద కారం చల్లినట్లయ్యింది. అక్కడా... ఇక్కడా అని తేడా లేకుండా వైకాపా తరఫున పోటీలో ఉన్న అరాచక శక్తులందర్నీ ఓడించారు. 

పిన్నెల్లి నుంచి జోగి వరకు...

దాడులు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, అక్రమ కేసులతో అనుక్షణం ప్రజల్ని హింసించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఘోర పరాభవం ఎదురైంది. పదుల సంఖ్యలో వాహనాలు, మారణాయుధాలతో తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిపైకి దండెత్తి, వీధి రౌడీలా మారిన జోగి రమేష్‌కు గట్టిగా బుద్ధిచెప్పారు. ఆయనను పెడన నుంచి పెనమలూరుకు బదిలీ చేసి పోటీ చేయించినా సరే ప్రజలు తిరస్కరించారు. నోటి దురుసు.. చేతి వాటంతో పేట్రేగిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్‌నూ ఇలాగే శిక్షించారు. తెదేపా కేంద్ర కార్యాలయంపైకి అరాచక మూకను పంపించి విధ్వంసం సృష్టించి, తెదేపా నేతలపై దాడులు చేయించిన దేవినేని అవినాష్‌కు విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజలు గట్టి గుణపాఠమే చెప్పారు. తాడిపత్రి, ధర్మవరం నియోజకవర్గాలను అరాచకాలు, దోపిడీలకు అడ్డాలుగా మార్చేసి, ప్రతిపక్ష నేతలపై దాడులకు తెగబడిన బాబాయ్, అబ్బాయ్‌ కేతిరెడ్డి పెద్దారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిలకు పరాభవం ఎదురైంది. పల్నాడును రావణకాష్ఠంగా మార్చేసి దాడులను ప్రొత్సహించిన కాసు మహేశ్‌రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను ప్రజలు తిరస్కరించారు. పత్రికా సంస్థలపైకి అసాంఘిక శక్తుల్ని పంపించి దాడులు చేయించిన పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిని ప్రజలు ఇంటికి పంపించేశారు. శ్రీకాకుళంలాంటి ప్రశాంతమైన జిల్లాలో దాడులు, అక్రమ కేసులు సంస్కృతిని పరిచయం చేసిన దువ్వాడ శ్రీనివాస్, సీదిరి అప్పలరాజు, తమ్మినేని సీతారామ్‌ను భారీ తేడాతోనే ఓడించారు. విజయనగరం జిల్లాలో అక్రమాలు, అరాచకాలకు కేరాఫ్‌గా నిలిచిన బొత్స కుటుంబం చిరునామాను ఓటర్లు ఈ ఎన్నికల్లో పూర్తిగా గల్లంతు చేశారు. అమరావతి రైతుల పాదయాత్రపై రాజమహేంద్రవరంలో దాడులు చేయించిన మార్గాని భరత్‌రామ్‌ను అత్యధిక తేడాతో ఓడించారు. అరాచకాలకు, అక్రమాలకు కేరాఫ్‌గా నిలిచిన గ్రంధి శ్రీనివాస్, ప్రసాదరాజు నర్సాపురంలో ఓడిపోయారు. రౌడీయిజంతో అరాచక శక్తిలా వ్యవహరించిన దాడిశెట్టి రాజాకు ఓటుతో ముకుతాడు వేశారు. నెల్లూరు జిల్లాలో అరాచకంగా వ్యవహరించిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి, రామ్‌రెడ్డి ప్రతాప్‌కుమార్‌లను సర్వేపల్లి, కావలిలో ప్రజలు ఓడించారు. 

అతి తక్కువ అధిక్యతతో బయటపడిన అవినాష్‌రెడ్డి

కడప లోక్‌సభ స్థానం ఒకప్పుడు వైకాపా కంచుకోట. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థికి లక్షల్లో మెజార్టీ వచ్చేది. అలాంటిది వివేకానందరెడ్డి హత్య కేసులో కుట్రదారైన అవినాష్‌రెడ్డి చావు తప్పి కన్నులొట్టబోయినట్లుగా అతి తక్కువ ఆధిక్యతతో బయటపడ్డారు. పుంగనూరు తన ప్రత్యేక సామ్రాజ్యమన్నట్లు  విర్ర వీగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తక్కువ మెజారిటీతో గట్టెక్కారు. ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధించి, అక్రమాల్లో మునిగితేలిన నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు, ఆయన సోదరుడు మొండితోక అరుణ్‌కుమార్‌ అరాచకాలు సహించలేక ప్రజలు వారిని ఓడించారు. 


పేట్రేగిపోయిన వారసులకు గుణపాఠం!

రాచకంతో పాటు దేశంలో ఎక్కడలేని విధంగా ఓటర్ల జాబితాలో అక్రమాలకు తెరలేపి.. అడ్డదారుల్లో ఎన్నికల్లో గెలిచేందుకు యత్నించిన చంద్రగిరి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డిని ఓడించారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక సహా, అక్కడ జరిగిన ప్రతి ఎన్నికలోనూ అక్రమాలకు పాల్పడి దేశమే నివ్వెరపోయేలా చేసిన భూమన అభినయ్‌రెడ్డికీ గుణపాఠం చెప్పారు. మచిలీపట్నంలో అరాచక శక్తిగా మారిన పేర్ని కిట్టూను ఓడించారు. ఆయా స్థానాల్లో ఇటీవల వరకూ వారి తండ్రులు ఎమ్మెల్యేలుగా ఉండటంతో.. ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారు పెట్రేగిపోయారు. ఆ ఫలితాన్ని ఈ ఎన్నికల్లో చూశారు. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు,  కృష్ణదాస్, తమ్మినేని సీతారామ్‌ల తనయుల అరాచకాలు వారి తండ్రుల ఓటమికి ఓ కారణమయ్యాయి. ఉరవకొండలో నియోజకవర్గంలో విశ్వేశ్వరెడ్డి కుమారుడు రాజ్యాంగేతర శక్తిగా మారడంతో ఆయన ఓటమి పాలయ్యారు. కైకలూరు, పత్తికొండ, రాజమహేంద్రవరం రూరల్, మండపేటల్లో దూలం నాగేశ్వరరావు, కంగాటి శ్రీదేవి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తోట త్రిమూర్తులు తదితరుల కుమారులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పేట్రేగిపోవటం వారి ఓటమికి ఒక కారణమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని