అమాత్యులు అంతా తామై..

పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ రాష్ట్రంలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు తీవ్రంగా శ్రమించారు.

Published : 05 Jun 2024 06:53 IST

చెమటోడ్చిన కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జులు
పక్కా ప్రణాళికతో మంత్రులు, ఎమ్మెల్యేలకు ముందుగా బాధ్యతలు

ఖమ్మంలో విజయానంతరం ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి బయటకు వస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి
రామసహాయం రఘురాంరెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ రాష్ట్రంలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు తీవ్రంగా శ్రమించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్‌ పార్టీ అత్యధికంగా 8 లోక్‌సభ నియోజకవర్గాల్లో నెగ్గింది. 2014 ఎన్నికల్లో 2; 2019లో మూడు సీట్లు గెలిచింది. ఈసారి ఎక్కువ చోట్ల గెలవాలనే వ్యూహంతో ముందుగానే ముఖ్యనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలను మొత్తం 17 నియోజకవర్గాలకు ఎన్నికల ఇన్‌ఛార్జులుగా అధిష్ఠానం నియమించింది. మంత్రులకు కీలక స్థానాల బాధ్యతలను అప్పగించింది. మంత్రులు గట్టిగా కృషిచేసిన చోట్ల కాంగ్రెస్‌కు భారీగా ఓట్లు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు సమన్వయకర్తలను సైతం విడిగా నియమించింది. వీరిపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఇన్‌ఛార్జులుగా ఉన్న మంత్రులు, ఇతర నేతలు మండుటెండలను సైతం లెక్కచేయకుండా మండలాలవారీగా పార్టీ శ్రేణులను సమన్వయపరిచి ముందుకు నడిపించారు. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్‌ స్థానాల్లో 2 నుంచి 5.59 లక్షల దాకా మెజార్టీలు రావడానికి అక్కడి నియోజకవర్గాల ఇన్‌ఛార్జులే కీలకంగా పనిచేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

శ్రేణులను ఏకతాటిపై నడిపించి

  • ఖమ్మం స్థానానికి నామినేషన్ల చివరిరోజు వరకూ అభ్యర్థిని ప్రకటించలేదు. అయినా అక్కడ ఇన్‌ఛార్జిగా ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ విజయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అహర్నిశలు కృషిచేశారు. 
  • నల్గొండలో సీనియర్‌ నేత, మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్‌కు పార్టీ టికెట్‌ ఇచ్చారు. ఇక్కడ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జిగా ఉన్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి నల్గొండలో పార్టీని ఏకతాటిపై నడిపించి రికార్డుస్థాయి మెజార్టీ సాధించేందుకు కృషిచేశారు. పోలింగ్‌ ముగిసిన వెంటనే ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ నల్గొండలో రాష్ట్రంలోకెల్లా అత్యధిక మెజార్టీ వస్తుందనే ధీమా సైతం వ్యక్తం చేశారు. 
  • మహబూబాబాద్‌ స్థానానికి ఇన్‌ఛార్జిగా ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ గెలుపునకు శ్రమించడంతో భారీ మెజార్టీ సాధించింది. పూర్తిగా గిరిజన ప్రాంతాలున్న ఇక్కడ పార్టీ ప్రచారాన్ని పెద్దయెత్తున నిర్వహించి వ్యూహాత్మకంగా విజయం కోసం పనిచేశారు. 
  • పెద్దపల్లి ఇన్‌ఛార్జిగా ఉన్న మంత్రి డి.శ్రీధర్‌బాబుతోపాటు అక్కడి ఎమ్మెల్యేలు పార్టీని గెలిపించేందుకు తీవ్రంగా కృషిచేశారు. అభ్యర్థి వంశీకృష్ణకు రాజకీయ అనుభవం లేకపోవడంతో విజయానికి అంతా తామై పాటుపడ్డారు. 
  • పార్టీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లురవి అభ్యర్థిగా ఉన్న నాగర్‌కర్నూల్‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు ఇన్‌ఛార్జిగా పనిచేశారు. భాజపా నుంచి గట్టి పోటీ ఎదురైనా క్షేత్రస్థాయిలో వ్యూహాత్మక ప్రచారం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 
  • కరీంనగర్‌కు అభ్యర్థిని ప్రకటించడంలో ఆలస్యం జరిగింది. అప్పటికే అక్కడ భాజపా, భారాస అభ్యర్థులు సుడిగాలి ప్రచారం చేశారు. అయినా ముమ్మరంగా ప్రచారం చేసి 3.59 లక్షలకు పైగా ఓట్లు సాధించి రెండోస్థానంలో నిలిచామని ఆ స్థానానికి ఇన్‌ఛార్జిగా ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ వర్గీయులు చెప్పారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు