రిజర్వుడ్‌లో కాంగ్రెస్‌దే హవా

రాష్ట్రంలోని ఐదు లోక్‌సభ రిజర్వుడ్‌ స్థానాల్లో నాలుగింటిని కాంగ్రెస్‌ కైవసం చేసుకొని మరోమారు తన హవా కొనసాగించింది.

Published : 05 Jun 2024 06:53 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఐదు లోక్‌సభ రిజర్వుడ్‌ స్థానాల్లో నాలుగింటిని కాంగ్రెస్‌ కైవసం చేసుకొని మరోమారు తన హవా కొనసాగించింది. ఆదిలాబాద్‌లో భాజపా గెలుపొందగా... మిగిలిన నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లిలలో కాంగ్రెస్‌ విజయ దుందుభి మోగించింది. గత శాసనసభ ఎన్నికల్లో 31 రిజర్వుడ్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ ఏకంగా 23 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. అందులో 14 ఎస్సీ, 9 ఎస్టీ స్థానాలున్నాయి. తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఉన్న మూడు ఎస్సీ స్థానాలను కాంగ్రెస్‌ సొంతం చేసుకుంది. రెండు ఎస్టీ స్థానాల్లో మహబూబాబాద్‌ను కూడా ఆ పార్టీ వశం చేసుకుంది. నాగర్‌కర్నూల్‌లో సీనియర్‌ నేత మల్లు రవి, పెద్దపల్లిలో గడ్డం వంశీకృష్ణ, వరంగల్‌లో కడియం కావ్య భారీ ఆధిక్యంతో గెలిచారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ కుమారుడైన వంశీకృష్ణ, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య తొలిసారిగా పోటీ చేసి ఎంపీలు కాబోతున్నారు. మహబూబాబాద్‌లో సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ విజయం సాధించారు. కాంగ్రెస్‌ ఈసారి రాష్ట్రంలో ఎనిమిది స్థానాల్లో గెలుపొందగా...అందులో నాలుగు స్థానాలు రిజర్వుడ్‌వే కావడం గమనార్హం. ఆదిలాబాద్‌ నుంచి భాజపా అభ్యర్థి గోడం నగేష్‌ విజయ కేతనం ఎగురవేశారు. ఆయన 2014లో అప్పటి తెరాస తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచారు. మల్లు రవి, నగేష్‌ తప్ప మిగిలిన ముగ్గురూ భారీ మెజారిటీలు  సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని