అరాచక పాలనకు ఓ నమూనా

హిట్లర్‌ను తలదన్నెలా నియంతృత్వం. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో అడుగడుగునా అరాచకం. ప్రశ్నించే గొంతుకపై ఉక్కుపాదం.

Published : 05 Jun 2024 06:55 IST

అడుగడుగునా నియంతృత్వమే..
పెట్టుబడులు లేవు..ఉపాధి ఊసే లేదు
గంజాయికి చిరునామాగా రాష్ట్రం
అభివృద్ధిని గాలికొదిలేశారు
అప్పులపైనే ఆధారపడ్డారు
సంక్షేమం పేరుతో బురిడీ
ఇళ్ల స్థలాల పేరుతోనూ  దోచేసిన వైకాపా నేతలు

ఈనాడు, అమరావతి: హిట్లర్‌ను తలదన్నెలా నియంతృత్వం. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో అడుగడుగునా అరాచకం. ప్రశ్నించే గొంతుకపై ఉక్కుపాదం. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న పోస్టు పెట్టినా..షేర్‌ చేసినా వేటాడటం. ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడేందుకూ భయపడే పరిస్థితులు. మొత్తంగా రాష్ట్రంలో గత ఐదేళ్లు సాగింది చీకటి రాజ్యమే. కక్షసాధింపు..విధ్వంస పాలనే. పెట్టుబడులు లేవు. కొత్త పరిశ్రమల ఏర్పాటు లేదు. ఉన్న వాటినీ తరిమేయడమే. బూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి జాడ ఇసుమంతైనా కానరాదు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా రహదారులపై గతుకులు కూడా పూడ్చలేని దైన్యం. ఇక యువతకు ఉద్యోగ-ఉపాధి కల్పించాలనే ఆలోచనే లేదు. ఉద్యోగాన్వేషణలో వారు ఇతర రాష్ట్రాలకు తరలివెళుతున్నా లెక్కలేనితనమే. రూ.10 వేల కోట్లు ఖర్చు చేసి నిర్మాణం ఊపందుకునే దశలో ఉన్న రాజధాని అమరావతి పీకను నిర్దాక్షిణ్యంగా నులిమేశారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారు. పోలవరాన్ని పూర్తి చేయకుండా కాడిపడేశారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పేరుతో ప్రజల ఆస్తులపై కన్నేయడం..ఇలా ఒకటి, రెండు కాదు..వైకాపా ఘోర పరాజయానికి సవాలక్ష కారణాలున్నాయి. ఇంతటి దారుణమైన ఓటమికి జగనే బాధ్యుడు. గత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ప్రజలు వైకాపాను గెలిపించి ఆయనను పీఠంపై కూర్చోబెడితే ఆయన ఏనాడూ ప్రజాపాలనపై దృష్టిపెట్టలేదు. అహంభావాన్ని తలకెక్కించుకుని రాచరిక పాలన నడిపారు. పరిపాలన ఎలా చేయకూడదో..యావత్తు దేశమే కాదు..ప్రపంచం మొత్తం తెలుసుకునేలా వైకాపా ఐదేళ్ల పాలన సాగింది.

అప్పులకు పర్యాయపదంగా ఆంధ్రప్రదేశ్‌

విభజన కష్టాలను దాటుతూ అప్పుడప్పుడే కుదుటపడుతున్న రాష్ట్రాన్ని వైకాపా పాలన తీవ్రంగా దెబ్బతీసింది. ఆదాయాన్ని సృష్టించే మార్గాలను ఒడిసిపట్టుకోకుండా అప్పులపైనే నెట్టుకొచ్చింది. మంగళవారం వస్తే చాలు..రిజర్వ్‌ బ్యాంకు వద్ద రుణం కోసం క్యూకట్టే పరిస్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారు. తెచ్చిన రుణంతో సంపద సృష్టించే పనుల్ని చేపట్టలేదు. కార్పొరేషన్‌ల పేరుతోనూ ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేశారు.  రూ.లక్షల కోట్ల రుణాలతో ఆంధ్రప్రదేశ్‌ను అథ:పాతాళానికి నెట్టడం ప్రజల్ని తీవ్రంగా ఆలోచింపజేసింది. 

అడుగుకో గుంత...గజానికో గొయ్యి..

రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అత్యంత దారుణమైన స్థితికి చేరింది. అడుగుకో గుంత..గజానికో గొయ్యి అన్నట్లుగా మారి ప్రయాణికుల ప్రాణాలు హరిస్తున్నా...పూడ్చే ప్రయత్నం చేయకుండా దాన్ని కూడా ప్రతిపక్షాలపై నెట్టే ప్రయత్నమే చేశారు. అదిగో ఇదిగో చేసేస్తున్నామంటూ ఐదేళ్లూ గడిపేశారు. వైకాపా నేతలకు, అస్మదీయ గుత్తేదారు కంపెనీలకు రూ.వేల కోట్ల మేర బిల్లులు చెల్లించారేగానీ..రహదారులను బాగు చేయాలనే ఆలోచన ఏమాత్రం చేయలేదు. 

ఇసుక ధరను ప్రియం చేసి పేదల డొక్క మాడ్చారు....

ఉచితంగా అందే ఇసుకను పేద, మధ్య తరగతి వర్గాలకు అందకుండా చేశారు. ధరను అమాంతం పెంచి భవన నిర్మాణ రంగాన్ని కుదేలు చేశారు. ఉపాధి లేక కార్మిక కటుంబాల డొక్క మాడిపోతున్నా పట్టించుకోలేదు. ఇసుకపై ఆధారపడిన 52 వర్గాలు ఐదేళ్ల పాలనలో అల్లాడిపోయాయి. పైగా వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు అదే ఇసుకను ఇష్టానుసారం బొక్కుతున్నా కళ్లప్పగించి చూశారు.

అన్నదాతలకు వేదనే మిగిల్చారు....

రైతులకు సకాలంలో ధాన్యం బిల్లులు చెల్లించకుండా వేధించారు. వాటిని ఇవ్వాలని అడిగితే అన్నదాతలను అవహేళన చేస్తూ మాట్లాడారు. పంట నష్టపోతే కనీసం పరిహారం కూడా అందకుండా చేశారు. వారికి అందే రాయితీ పథకాలను తీసేశారు. సాగునీటి ప్రాజెక్టులూ పూర్తి చేసింది లేదు. వర్షాలు సకాలంలో పడక..పంటలకు నీరందక అన్నదాతలు పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. రైతుల దయనీయ పరిస్థితి కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నా..చక్కదిద్దే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. కేంద్ర ప్రభుత్వంతో కలిపి ఇస్తున్న రైతు భరోసా ఆర్థిక సాయమే అన్నింటికీ విరుగుడు అనేలా వ్యవహరించారు. 

ఫీజులు చెల్లించలేక తల్లిదండ్రులు అప్పులపాలు..

విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్‌మెంటు జమ చేస్తామని చెప్పి..సకాలంలో విడుదల చేయకుండా పిల్లల చదువును ఇబ్బందులకు గురిచేశారు. అప్పులు చేసి ఫీజులు కట్టే పరిస్థితికి పేదల్ని నెట్టారు. వేల మంది కోర్సు పూర్తి చేసినా సర్టిఫికెట్లు తెచ్చుకోలేని దుస్థితి వెళ్లారు. ఫీజులు కట్టలేక పరీక్షలు కూడా రాయలేని విద్యార్థులు ఎందరో ఉన్నారు. 

రూ.10 ఇచ్చి....రూ.100 లాగేసుకునే ఎత్తుగడ

మధ్యపాన నిషేధం చేస్తానని అధికారంలోకి వచ్చి బూటకపు విధానాన్ని అమలు చేశారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోలేదు. ఉపాధి కరవై.. ధరల పెరుగుదలను భరించలేక జనాలు కష్ట పడుతున్నా..వారి వైపు కనీసం తొంగి చూసింది లేదు. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని ఓట్ల లెక్కలేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. అప్పుడప్పుడు పథకాలకు బటన్‌ నొక్కుడు పేరుతో బయటకు వచ్చినా పరదాల మాటున రావడమే. ఎన్నికలు దగ్గర పడిన తర్వాత అక్కడక్కడ వినతులు ప్రజల నుంచి తీసుకుంటున్నట్లు నాటకాన్ని రక్తికట్టించినా...అది ఐప్యాక్‌ ముందస్తు వ్యూహమే. ఇదే కాదు సంక్షేమ పథకాల మాటున ఒక చేత్తో రూ.10 ఇచ్చి మరో చేత్తో రూ.100లను ప్రజల జేబులో నుంచి లాగేసుకునే విధానాన్ని యథేచ్ఛగా అమలు చేశారు. ఆస్తి పన్ను, చెత్త పన్ను, ట్రూ అప్‌ ఛార్జీల పేరుతో విద్యుత్తు బిల్లుల భారం..ఇలా కొత్త తరహా భారాలన్నీ మోపి ప్రజల్ని హింసించారు. ఇది చాలదన్నట్లు ఎక్కడాలేని నిబంధనలు తెచ్చి సంక్షేమ పథకాలను దక్కకుండా చేశారు. 

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమాన్ని కాల రాశారు..

వైకాపాకు వెన్నెముకగా నిలిచిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల సంక్షేమాన్ని పూర్తిగా కాలరాశారు. ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ’ అంటూనే వారిని మరింత అట్టడుగుకు చేర్చే వ్యూహాన్ని అమలు చేశారు. వారి కోసం దశాబ్దాలుగా అమలవుతున్న పథకాలను సైతం రద్దు చేసి తీరని ద్రోహం చేశారు. పేదరికాన్ని జయించేందుకు ఉపయోగపడే రాయితీ రుణాలను తీసేసి ఉపాధి అవకాశాలే లేకుండా చేశారు. ఇతర వర్గాలతో సమానంగా ఎదిగేందుకు రాజ్యాంగం కల్పించిన చట్టం ద్వారా అందే ఉపప్రణాళిక నిధుల్ని....ఇతర ‘అవసరాలకు’ యథేచ్ఛగా మళ్లించారు. ఉన్నత విద్య దక్కకుండా చేశారు. అందరికీ వర్తించే పథకాలను వారికీ ఇస్తూ అదే గొప్పగా ప్రచారం చేశారు. చరిత్రలో ఎన్నడూ చేయని సంక్షేమం ఇప్పుడే జరుగుతున్నట్టు కలరింగ్‌ ఇచ్చారు. ఈ దురాగతాలను పంటి కింద బిగువుగా పట్టుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు...ఓటు రూపంలో కర్రు కాల్చి వాతపెట్టారు. 

సామాజిక భద్రత పింఛన్లలోనూ ద్రోహమే..

సామాజిక భద్రత పింఛన్లపై ఏ ప్రభుత్వమైనా మానవతా దృక్పథంతో చూస్తుంది. కానీ వైకాపా ప్రభుత్వం అత్యంత కర్కశంగా వ్యవహరించింది. ఎక్కడ లేని నిబంధనలు తెచ్చి లక్షల పింఛన్లను తొలగించింది. ఇళ్ల స్థలాల పేరుతో భారీ కుంభకోణాన్ని నడిపారు. ఆ స్థలాలను లబ్ధిదారులు ఉంటున్న ప్రాంతానికి దూరంగా, ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో కేటాయించారు. ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున (పట్టణాల్లో రూ.30 వేలు మాత్రమే ఇచ్చారు) ఒక్క రూపాయి ఇవ్వకుండానే కట్టుకోమని ఒత్తిడి చేసి పేదలను అప్పులపాలు చేశారు. 

ఉద్యోగులకు మోసమే..

ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని అధికారంలోకి వచ్చి మాట తప్పారు. పీఆర్సీ పేరుతో రివర్స్‌ పీఆర్సీ అమలు చేసి...ఇచ్చేదే గొప్ప అన్నట్లుగా వ్యవహరించారు. బకాయిల్ని చెల్లించలేదు. ఉపాధ్యాయులపై కక్షసాధింపు ధోరణితో ముందుకుసాగారు. అంగన్‌వాడీలపై ఉక్కుపాదం మోపారు. వారిపై ఎస్మాను ప్రయోగించి ఉద్యోగాల నుంచి తొలగిస్తామనే స్థాయికి వెళ్లారు. ఆశాలను ఇబ్బందిపెట్టారు. యానిమేటర్లను తొలగించేందుకు విఫలయత్నం చేశారు. కాంట్రాక్ట్, పొరుగు సేవల సిబ్బందికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.

పెచ్చరిల్లిన వైకాపా నేతల అరాచకం

వైకాపా నేతల అవినీతి, అరాచకం, దౌర్జన్యం, రౌడీయిజం ఎక్కడికక్కడ వికృత రూపం దాల్చినా అడ్డుకట్ట అనేదే లేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై దాడులు పెచ్చరిల్లాయి. దళితుడిని చంపి డోర్‌ డెలవరీ చేసినా..పోలీస్‌స్టేషన్‌లోనే శిరోముండనం జరిగినా చర్యలే లేవు. మాస్క్‌ అడిగారని దళిత డాక్టర్‌ను, మాస్క్‌ పెట్టుకోలేదని మరో దళిత యువకుడిని పొట్టన పెట్టుకున్నారు. వైకాపా నేతల వేధింపులు భరించలేక అబ్దుల్‌ సలాం తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోలేదు. అమర్నాథ్‌గౌడ్‌ అనే పదోతరగతి విద్యార్థిని పెట్రోలు పోసి తగలబెట్టినా ఉలుకూపలుకూ లేదు. కనీసం ఇందుకు ఇలా జరిగాయనే సమీక్ష కూడా చేయలేదు. ఇలాంటి అనేక అకృత్యాల్లో వైకాపా నేతలే నిందితులు. ప్రజలు భయం గుప్పిట్లో బతకాల్సిన పరిస్థితి తెచ్చారు. 

గంజాయికి అడ్డుకట్టే లేదు.....

రాష్ట్రంలో గంజాయి యువతను నిర్వీర్యం చేస్తున్నా..అడ్డుకట్టకు ప్రయత్నించలేదు. చివరికి గ్రామ, గ్రామాన బడ్డీ కొట్లలో కూడా అమ్మకాలు జరిగే పరిస్థితి వచ్చింది. ఏ రోజూ దీనికి విరుగుడు మార్గం ఏంటనే దానిపై చర్చ జరగలేదు.

కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేనితనమే...

రాష్ట్రంలో గత ఐదేళ్లుగా చట్టం, రాజ్యాంగం అమలు అనేదే లేదు. న్యాయమన్నది కనుచూపుమేర కనిపించలేదు. అడుగడుగునా ఉల్లంఘనలే. కోర్టు ఉత్తర్వులంటే లెక్కేలేదు. వాటిని చిత్తుకాగితంలాగానే భావించారు. దేశంలోనే అత్యధికంగా కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలు ఏపీ హైకోర్టులో నమోదయ్యాయి. ఈ విషయంలో రాష్ట్రం రెండో స్థానంలో(15,311) నిలిచిందంటే వైకాపా ప్రభుత్వ పాలన ఎంత దిగజారిపోయిందో ఇట్టే తెలిసిపోతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధిక్కరణ కేసుల్లో ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారులకు జైలు శిక్షలు, జరిమానాలు సాధారణమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని