జగన్‌ ఇలాకాలో కూటమి ధమాకా

Published : 05 Jun 2024 06:57 IST

వైకాపాను కడిగేసిన వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలు
13 స్థానాలకుగాను నాలుగింటిలోనే వైకాపా విజయం

ఈనాడు, కడప: వైకాపా కంచుకోటను కూటమి బద్దలు కొట్టింది. వైఎస్సార్‌ జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఐదింటిలో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కూటమి తరఫున తెదేపా నుంచి కడపలో రెడ్డెప్పగారి మాధవి తన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి అంజాద్‌బాషాపై గెలిచారు. వైకాపా ప్రభుత్వంలో అంజాద్‌బాషా ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక్కడ 20 ఏళ్ల అనంతరం తొలిసారి తెదేపా జెండా ఎగురవేసింది. అందులోనూ తొలి మహిళా అభ్యర్థి గెలవడం విశేషం. కమలాపురంలో జగన్‌ మేనమామ రవీంద్రనాథ్‌రెడ్డి (వైకాపా)ని పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి (తెదేపా) చిత్తుగా ఓడించారు. మైదుకూరులో వైకాపా అభ్యర్థి ఎస్‌.రఘురామిరెడ్డిపై పుట్టా సుధాకర్‌ యాదవ్‌ (తెదేపా) గెలుపొందారు. ప్రొద్దుటూరు నుంచి రెండుసార్లు విజయం సాధించిన వైకాపా అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిని వరదరాజులరెడ్డి ఓడించారు. జమ్మలమడుగులో భాజపా నుంచి ఆదినారాయణరెడ్డి తన సమీప ప్రత్యర్థి, వైకాపా అభ్యర్థి సుధీర్‌రెడ్డిపై గెలుపొందారు. వైకాపా నుంచి పులివెందులలో ఆ పార్టీ అధినేత జగన్‌.. తెదేపా అభ్యర్థి బీటెక్‌ రవిపై, బద్వేలు నుంచి డాక్టర్‌ దాసరి సుధ.. భాజపా అభ్యర్థి బొజ్జ రోశన్నపై గెలుపొందారు. బద్వేలులో చివరి క్షణం వరకు అభ్యర్థిని ప్రకటించకపోవడం, ఇతర కారణాల వల్ల ఓటమి ఎదురైంది.

అన్నమయ్య జిల్లాలో నాలుగింటిలో కూటమి గెలుపు

అన్నమయ్య జిల్లాలో ఆరు ఆసెంబ్లీ స్థానాల్లో నాలుగింటిలో కూటమి గెలిచింది. పీలేరు నుంచి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, మదనపల్లెలో షాజహాన్‌బాషా,    రాయచోటిలో మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, రైల్వేకోడూరులో అరవ శ్రీధర్‌ (జనసేన) ఘన విజయం సాధించారు. వైకాపా తరఫున రాజంపేట నుంచి ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, తంబళ్లపల్లెలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి గెలుపొందారు. రాజంపేటలో తెదేపా అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం పార్టీ బలాన్ని సొంతం చేసుకోలేకపోయారు. తంబళ్లపల్లెలో కొత్తగా దిగిన పార్టీ అభ్యర్థి జయచంద్రారెడ్డి (తెదేపా) బల సమీకరణలో కాస్త వెనకబడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని