భారాస బలహీనతే భాజపాకు బలమైందా?

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. లోక్‌సభ ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు ఆశించినప్పటికీ రాకపోవడానికి భారాస బలహీనపడి భాజపా ప్రయోజనం పొందడమే కారణంగా భావిస్తోంది.

Published : 05 Jun 2024 07:00 IST

గట్టిగా కృషి చేసినా రెండంకెల విజయం దక్కకపోవడంపై కాంగ్రెస్‌లో చర్చ
3, 4 స్థానాలపై ప్రభావం చూపిందని అంచనా

కుమార్తె విజయానికి సంబరపడుతూ.. కడియం కావ్యను ఆప్యాయంగా ముద్దాడుతున్న
ఆమె తండ్రి శ్రీహరి. చిత్రంలో మంత్రి కొండా సురేఖ

ఈనాడు, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌.. లోక్‌సభ ఎన్నికల్లో మరింత మెరుగైన ఫలితాలు ఆశించినప్పటికీ రాకపోవడానికి భారాస బలహీనపడి భాజపా ప్రయోజనం పొందడమే కారణంగా భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 64 స్థానాల్లో గెలవడంతోపాటు తొమ్మిది లోక్‌సభ స్థానాల్లో  ఆధిక్యం సాధించిన కాంగ్రెస్‌ వెంటనే వచ్చిన లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పని చేసింది. పది నుంచి 12 స్థానాల్లో విజయం సాధించవచ్చని భావించింది. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రూ.పది లక్షల వరకు ఆరోగ్యబీమా, గృహనిర్మాణానికి శ్రీకారం చుట్టడంతోపాటు పలు నియోజకవర్గాల్లో భారాసకు చెందిన నాయకులు చేరడంతో అన్ని చోట్లా గట్టిపోటీ ఇవ్వొచ్చని భావించింది. పార్టీలో ఉన్న బలమైన అభ్యర్థులందరూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవడంతో, కొన్ని నియోజకవర్గాలకు ఇతర పార్టీల నుంచి తీసుకొని పోటీ చేయించింది. భారాస నుంచి చేర్చుకొని.. సికింద్రాబాద్‌లో ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను, చేవెళ్లలో ఆ పార్టీ సిటింగ్‌ ఎంపీగా ఉన్న రంజిత్‌రెడ్డిని బరిలో నిలిపింది. అలాగే భారాస నుంచే వచ్చిన వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ పట్నం సునీతను మల్కాజిగిరిలో, కడియం కావ్యను వరంగల్‌లో పోటీకి దింపింది. ఆదిలాబాద్‌లో ఉపాధ్యాయురాలు, హక్కుల కార్యకర్త అయిన ఆత్రం సుగుణను బరిలోకి దింపి ప్రయోగం చేసింది.  రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికలో తీవ్ర జాప్యం చేసింది. మూడింటికి నామినేషన్‌ చివరిరోజు అభ్యర్థులను ప్రకటించింది. అయినప్పటికీ ప్రచారాన్ని దీటుగా చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నీ తానై రోజుకు రెండు మూడు నియోజకవర్గాల్లో బహిరంగసభలు, రోడ్‌షోలలో పాల్గొన్నారు.  ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే తాగునీటి సమస్య, ధాన్యం కొనుగోలు తదితర అంశాలు ముందుకు వచ్చాయి. ఎన్నికల్లో గెలిస్తే రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి వెంటనే చేయలేదని విపక్షాలు ఆరోపించడం, అది చర్చనీయాంశంగా మారడంతో ఆగస్టు 15లోగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ప్రతి సభలోనూ ఈ అంశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. అయితే అనేక నియోజకవర్గాల్లో భారాస ఓటు బ్యాంకు గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉందని అంతర్గత సర్వేల్లో తేలడంతో కేంద్రీకరణ మరింత ఎక్కువగా పెంచారు. కాంగ్రెస్‌ అంతర్గత సర్వేల్లో చేవెళ్ల, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌ లాంటి చోట్ల భారాసకు 15 నుంచి 20 శాతం మధ్యే ఓట్లు వచ్చే పరిస్థితులు కనపడటంతో వాటిపై మరింతగా దృష్టి కేంద్రీకరించినా లాభం లేకపోయింది. భారాస ఓటు బ్యాంకు గణనీయంగా భాజపా వైపు మళ్లడంతోనే మరో మూడు నాలుగు సీట్లు గెలిచే అవకాశం కోల్పోయినట్లు కాంగ్రెస్‌లో చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల కంటే ఒకటిన్నర శాతం ఓట్లు కాంగ్రెస్‌కు పెరిగాయి. అయినా లోక్‌సభ సీట్ల సంఖ్య పెరగలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో 13.9 శాతం ఓట్లు పొందిన భాజపాకు ఈ లోక్‌సభ ఎన్నికల్లో 35.08 శాతం ఓట్లు వచ్చాయి. ఇలా అదనంగా వచ్చిన  ఓట్లు భారాసవేనని కాంగ్రెస్‌ భావిస్తోంది. 


కరీంనగర్‌లో కాంగ్రెస్‌కు తగ్గిన ఓట్లు 

కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పుడు కరీంనగర్‌ లోక్‌సభ స్థానంలో అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల కంటే సుమారు రెండు లక్షల ఓట్లు తగ్గాయి. దీనికి కారణం సిటింగ్‌ ఎమ్మెల్యేలున్న కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ కంటే భాజపాకు ఎక్కువ ఓట్లు రావడమే. మహబూబ్‌నగర్‌ పరిధిలో కూడా రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇదే పరిస్థితి. ఆదిలాబాద్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక స్థానంలో గెలిచి మిగిలిన సెగ్మెంట్లలో మూడో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌.. ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చింది. మంత్రి సీతక్క అక్కడే మకాం వేసి తీవ్రంగా కృషి చేశారు. రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డిలు ప్రచారం చేశారు. దీంతో ఇక్కడ ఓట్లు గణనీయంగా పెరిగాయి. అయితే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిన చోట భాజపాకు మెజార్టీ రాగా, భారాస ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు ఆధిక్యం వచ్చింది.


మంత్రుల కృషి ఫలితం..

నల్గొండ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మూడు లక్షల ఓట్ల ఆధిక్యం రాగా, ఇప్పుడు ఏకంగా ఐదున్నర లక్షల ఓట్లకు పైగా మెజార్టీ వచ్చింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ స్థానానికి ఇన్‌ఛార్జిగా ఉన్నారు. ఈయన సొంత నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో కూడా భారీ మెజార్టీ లభించింది. అలాగే ఖమ్మంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు సెగ్మెంట్లలో కలిపి 2.66 లక్షల ఓట్ల మెజార్టీ వస్తే ఇప్పుడు 4.62 లక్షల ఓట్ల ఆధిక్యం వచ్చింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన వియ్యంకుడు రఘురాంరెడ్డికి పట్టుబట్టి టికెట్‌ ఇప్పించుకోవడంతో పాటు ఈ నియోజకవర్గం ఇన్‌ఛార్జిగా  భారీ ఆధిక్యం వచ్చేలా పని చేశారు. ఈ స్థానం పరిధిలోనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల అసెంబ్లీ స్థానాలు కూడా ఉండటం, వారు కూడా విస్తృతంగా ప్రచారం చేయడం కలిసి వచ్చింది. మహబూబాబాద్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో లాగానే భారీ మెజార్టీ వచ్చింది. తుమ్మల నాగేశ్వరరావు ఇన్‌ఛార్జిగా నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరించారు. వరంగల్, భువనగిరి, పెద్దపల్లిలలో కూడా కాంగ్రెస్‌ అభ్యర్థులకు మంచి మెజార్టీలు వచ్చాయి. గతంలో తక్కువ వచ్చిన చోట ఇప్పుడు ఓట్లు భారీగా పెరిగినా, అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీలు వచ్చిన చోట మరింత ఎక్కువ ఆధిక్యాలు లభించినా, భాజపా ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న చోట భారాస బలహీనపడి అధికశాతం ఓట్లు కమలానికి వెళ్లడం వల్ల మూడు నాలుగు స్థానాలపై ప్రభావం చూపిందని కాంగ్రెస్‌ అంచనా వేస్తోంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని