ఏడు స్థానాల్లో విజయాలతో.. పంజాబ్‌లో మళ్లీ కాంగ్రెస్‌ జోరు

పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో ఏకంగా ఏడింటిని గెలుచుకోవడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో తిరిగి పుంజుకొంది.

Published : 05 Jun 2024 07:14 IST

ఆప్‌కు 3.. ఖాతా తెరవని భాజపా
జైలు నుంచి గెలిచిన ఇండిపెండెంట్‌ అమృత్‌పాల్‌ సింగ్‌దే అత్యధిక మెజార్టీ

చండీగఢ్‌: పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో ఏకంగా ఏడింటిని గెలుచుకోవడం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో తిరిగి పుంజుకొంది. పాలకపక్షమైన ఆమ్‌ఆద్మీ పార్టీ మూడు స్థానాలతో తృప్తిపడగా, సుఖ్బీర్‌సింగ్‌ బాదల్‌ సారథ్యంలోని శిరోమణి అకాలీదళ్‌ కేవలం ఒక్క స్థానానికి పరిమితమైంది. భాజపా ఖాతాయే తెరవలేకపోయింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. జైలు నుంచి నామినేషను వేసిన సిక్కు అతివాద నేత అమృత్‌పాల్‌ సింగ్‌ ఇండిపెండెంటుగా ఆశ్చర్యకరమైన విజయాన్ని నమోదుచేయడం విశేషం. ఖడూర్‌ సాహిబ్‌ స్థానం నుంచి గెలుపొందిన ఈయన రాష్ట్రంలోనే అత్యధికంగా 1.97 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం గమనార్హం. ఫరీద్‌కోట్‌ నుంచి గెలిచిన మరో స్వతంత్ర అభ్యర్థి సరబ్‌జీత్‌ సింగ్‌ ఖల్సా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హంతకుల్లో ఒకరి కుమారుడు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్‌ పార్టీ తాజా విజయాలతో ఉపశమనం పొందింది. రాష్ట్రం నుంచి గెలిచిన కాంగ్రెస్‌ ప్రముఖుల్లో మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ సింగ్‌ ఛన్నీ తదితరులు ఉన్నారు. భాజపాకు సంప్రదాయ స్థానాలుగా కొనసాగుతున్న గురుదాస్‌పుర్, హోశియార్‌పుర్‌లను సైతం కమలదళం తిరిగి నిలబెట్టుకోలేకపోయింది. 2019లో కేవలం ఒక్క లోక్‌సభ స్థానం గెలుచుకున్న ఆమ్‌ఆద్మీ పార్టీ తాజా ఫలితాల్లో మూడుచోట్ల విజయం సాధించి, ఆరు స్థానాల్లో ద్వితీయస్థానం దక్కించుకోవడం ద్వారా కొంత మెరుగైన ప్రదర్శన చూపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని