ఝార్ఖండ్‌లో ఎన్డీయేకు 9

ఝార్ఖండ్‌లో ఎన్డీయే కూటమి మెజార్టీ లోక్‌సభ స్థానాలు గెల్చుకుంది. భాజపా-ఆల్‌ ఝార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఏజేఎస్‌యూ) సంకీర్ణం 9 సీట్లు దక్కించుకోగా.. అధికార జేఎంఎం నేతృతంలోని ‘ఇండియా’ కూటమి ఐదు స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది.

Updated : 05 Jun 2024 07:41 IST

జేఎంఎం-కాంగ్రెస్‌ కూటమికి 5 లోక్‌సభ సీట్లు
అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కల్పనా సోరెన్‌ ఘన విజయం

రాంచీ: ఝార్ఖండ్‌లో ఎన్డీయే కూటమి మెజార్టీ లోక్‌సభ స్థానాలు గెల్చుకుంది. భాజపా-ఆల్‌ ఝార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ (ఏజేఎస్‌యూ) సంకీర్ణం 9 సీట్లు దక్కించుకోగా.. అధికార జేఎంఎం నేతృతంలోని ‘ఇండియా’ కూటమి ఐదు స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఈ కూటమిలోని జేఎంఎంకు మూడు, కాంగ్రెస్‌కు రెండు సీట్లు దక్కాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 14 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఎన్డీయేకు 12 సీట్లు రాగా ఈసారి 3 స్థానాలకు గండిపడింది. దుమ్కాలో భాజపా అభ్యర్థి సీతా సోరెన్‌.. జేఎంఎంకు చెందిన నళిన్‌ సోరెన్‌ చేతిలో 22,527 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. గతంలో జేఎంఎం తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీతా సోరెన్‌.. తాజా ఎన్నికలకు ముందు భాజపాలో చేరారు. మరోవైపు గాండేయ్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పనా సోరెన్‌ 27 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో భాజపా అభ్యర్థి దిలీప్‌ కుమార్‌ వర్మపై గెలుపొందారు. జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్‌ అహ్మద్‌ రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయింది. మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టయిన హేమంత్‌ సోరెన్‌ జైల్లో ఉన్నారు. 

  • గుజరాత్‌లోని ఐదు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భాజపా క్లీన్‌స్వీప్‌ చేసింది. దీంతో రాష్ట్ర శాసనసభలో భాజపా బలం 161కి పెరిగింది. కాంగ్రెస్‌తోపాటు కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసి, భాజపాలో చేరడంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. 
  • తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని విళంకోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని