హిమాచల్‌లో కాంగ్రెస్‌కు రిక్తహస్తం

హిమాచల్‌ ప్రదేశ్‌లోని మొత్తం నాలుగు పార్లమెంట్‌ స్థానాలనూ భాజపా దక్కించుకుంది. కాంగ్రెస్‌ ఖాతా కూడా తెరవలేదు. హమీర్‌పుర్‌ స్థానం నుంచి కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వరసగా నాలుగోసారి విజయం సాధించడం విశేషం.

Updated : 05 Jun 2024 07:40 IST

నాలుగు స్థానాలూ భాజపా ఖాతాలోకే..
అసెంబ్లీ ఉపఎన్నికల్లో హస్తానికి నాలుగు, కమలదళానికి రెండు సీట్లు 

శిమ్లా: హిమాచల్‌ ప్రదేశ్‌లోని మొత్తం నాలుగు పార్లమెంట్‌ స్థానాలనూ భాజపా దక్కించుకుంది. కాంగ్రెస్‌ ఖాతా కూడా తెరవలేదు. హమీర్‌పుర్‌ స్థానం నుంచి కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వరసగా నాలుగోసారి విజయం సాధించడం విశేషం. ప్రతిపక్షంపై పదునైన విమర్శలతో నిత్యం వార్తల్లో నిలిచిన భాజపా అభ్యర్థి, బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌.. మండి నుంచి గెలవడంతో తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు. కాగా.. 2019 ఎన్నికలతో పోలిస్తే భాజపా ఓట్ల శాతం 69.71 నుంచి 56.44కు తగ్గగా.. కాంగ్రెస్‌ ఓట్ల శాతం 23.53 నుంచి 41.67కు పెరగడం ఆ పార్టీకి ఊరటనిచ్చే అంశం. ఈ రాష్ట్రంలో ‘ఒక ఓటు పీఎంకి, మరో ఓటు సీఎంకి..’ నినాదం మార్మోగింది. దాంతో లోక్‌సభ పోరులో భాజపాకు, రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన కీలకమైన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లబ్ధి జరిగింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో ఎన్నిక అనివార్యమైన ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ నాలుగు, భాజపా రెండు చోట్ల విజయం సాధించాయి. దీంతో 68 స్థానాలున్న ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం 38కి పెరిగింది. మోదీని మూడోసారి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టడం, అభివృద్ధి పనులు, హస్తం నేతలు పాకిస్థాన్‌కు వత్తాసు పలుకుతున్నారని ప్రచారాన్ని హోరెత్తించారు. అందుకు దీటుగా కాంగ్రెస్‌ కూడా అగ్నివీర్, 30 లక్షల ఉద్యోగాలు, రాజ్యాంగం తదితర అంశాలపైనే గళమెత్తింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని