సంక్షిప్త వార్తలు (17)

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆయన మంత్రిమండలి సభ్యులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం రాష్ట్రపతి భవన్‌లో విందు ఇచ్చారు.

Updated : 06 Jun 2024 08:41 IST

ప్రధాని మోదీ, మంత్రిమండలికి రాష్ట్రపతి విందు 

విందుకు హాజరైన ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ దంపతులు, స్పీకర్‌ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌ షాలను పలకరిస్తున్న రాష్ట్రపతి ముర్ము

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆయన మంత్రిమండలి సభ్యులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం రాష్ట్రపతి భవన్‌లో విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా కూడా హాజరయ్యారు.


ఒకే విమానంలో దిల్లీకి నీతీశ్, తేజస్వి 

పట్నా: బిహార్‌ సీఎం నీతీశ్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్‌ బుధవారం పట్నా నుంచి దిల్లీకి ఒకే విమానంలో వెళ్లడం చర్చనీయాంశమైంది. ఎన్డీయే భేటీలో పాల్గొనేందుకు నీతీశ్, ‘ఇండియా’ సమావేశానికి హాజరయ్యేందుకు తేజస్వి వెళ్లారని.. వారు ఒకే విమానంలో ప్రయాణించాల్సి రావడం యాదృచ్ఛికమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నీతీశ్, తాను పరస్పరం అభివాదం మాత్రమే చేసుకున్నామని తేజస్వి దిల్లీలో చెప్పారు. 


నీతీశ్‌ను కలిసిన చిరాగ్‌ 

నీతీశ్‌ను అభినందిస్తున్న చిరాగ్‌ పాస్వాన్‌

పట్నా: లోక్‌ జనశక్తి పార్టీ (రాంవిలాస్‌) అధినేత చిరాగ్‌ పాస్వాన్‌ బుధవారం పట్నాలో నీతీశ్‌ కుమార్‌తో భేటీ అయ్యారు. చిరాగ్‌ పార్టీ తరఫున రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ఆయన వెంట సమావేశానికి వచ్చారు. అనంతరం చిరాగ్‌ విలేకర్లతో మాట్లాడుతూ.. నీతీశ్‌ ఆశీస్సుల కోసమే ఆయన్ను కలిసినట్లు చెప్పారు. ఎన్డీయేలో సీట్ల పంపిణీలో భాగంగా లోక్‌ జనశక్తి పార్టీ (రాంవిలాస్‌) ఐదు స్థానాల్లో పోటీ చేయగా ఐదింటా గెలిచింది. 


మేం ఏదీ డిమాండ్‌ చేయం: శిందే 

దిల్లీ: మోదీ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు వీలుగా ఎన్డీయేకు తాము పూర్తి మద్దతిస్తామని మహారాష్ట్ర సీఎం, శివసేన (శిందే వర్గం) అధినేత ఏక్‌నాథ్‌ శిందే ప్రకటించారు. కూటమి భేటీలో పాల్గొనేందుకు బుధవారం దిల్లీకి వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్డీయేకు మద్దతిచ్చే విషయంలో మంత్రి పదవుల వంటివేవీ తాము డిమాండ్‌ చేయబోమని స్పష్టం చేశారు.


24 మంది ముస్లింల ఎన్నిక

దిల్లీ: లోక్‌సభకు 24 మంది ముస్లింలు ఎన్నికయ్యారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సంఖ్య రెండు తక్కువ. ఎన్నికైన వారిలో క్రికెటర్‌ యూసుఫ్‌ పఠాన్‌ తదితరులున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 78 మంది పోటీ చేశారు. 


9న సిక్కిం సీఎంగా తమాంగ్‌ ప్రమాణస్వీకారం

గ్యాంగ్‌టక్‌: సిక్కిం ముఖ్యమంత్రిగా తాను రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సిక్కిం క్రాంతికారీ మోర్చా(ఎస్‌కెఎం) అధినేత ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ బుధవారం తెలిపారు. రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్‌లోని పాల్జోర్‌ స్టేడియంలో ఈ నెల 9న కొత్త మంత్రి మండలి ప్రమాణస్వీకరం చేయనున్నట్లు చెప్పారు. సిక్కింలోని ఏకైక లోక్‌సభ స్థానాన్ని, అసెంబ్లీ ఎన్నికల్లో 32 సీట్లకు గాను 31సీట్లను ప్రజలు తమకు ఇచ్చారన్నారు. తమపై విశ్వసం ఉంచి గెలిపించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ క్యాడర్, ప్రజలు హాజరవుతారన్నారు. అలాగే తమ ఎంపీ ఇంద్రాహంగ్‌ సుబ్బా ఎన్డీయే కూటమికి మద్దతు ఇస్తారని పేర్కొన్నారు.


వాళ్లు ఓడారు.. మనం బతికిపోయాం!

ఇన్నాళ్లూ సీఎం హోదాలో జగన్‌ ఎక్కడ పర్యటించినా రహదారులకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను నరికేసేవారు. ఎన్నికల్లో ఓటర్లు జగన్‌ను ఇంటికి సాగనంపారు. దీంతో ఇకపై చెట్లకు హాని తప్పిందనే అర్థం వచ్చేలా పాణ్యంకు చెందిన చిత్రకారుడు ఏకే శ్రీనివాసులు కార్టూన్‌ వేశారు. వైౖకాపా ఓటమిని చెట్లు హర్షిస్తున్నట్లు గీసిన వ్యంగ్య చిత్రం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

న్యూస్‌టుడే, పాణ్యం గ్రామీణం


ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం
రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిల

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు బుధవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడే కొత్త ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులూ పూర్తి చేయాలి. రాజధాని నిర్మాణం జరగాలి. నిరుద్యోగ బిడ్డలకు పెద్దఎత్తున ఉద్యోగాలివ్వాలి. సంక్షేమం, అభివృద్ధి సమానంగా సాగాలి. ప్రత్యేక హోదాకు, విభజన హామీలకు కట్టుబడితేనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు తెదేపా, జనసేన మద్దతివ్వాలి. ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ జనం గొంతుకగా మారిన కాంగ్రెస్‌ ఇక మీదటా అదే పంథా కొనసాగిస్తుంది’ అని షర్మిల పేర్కొన్నారు.


నియంతలకు పట్టిన గతే జగన్‌కు: యనమల

తుని, తుని గ్రామీణం, న్యూస్‌టుడే: ముస్సోలిని, హిట్లర్‌ వంటి నియంతలకు పట్టిన గతే నేడు జగన్‌కు పట్టిందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంటలోని తెదేపా కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ జగన్‌కు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని తన మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవన్నీ గమనించి ఎన్డీయేకు అపూర్వ విజయాన్ని అందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


జగన్‌ దుష్టపాలన వల్లే చంద్రబాబు గెలుపు: నారాయణ

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీలో జగన్‌ ఐదేళ్ల దుష్టపాలన వల్లే చంద్రబాబు గెలిచారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా సహా ఆ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన డిమాండ్లను సాధించాలని చంద్రబాబుకు సూచించారు. ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణతో కలిసి బుధవారమిక్కడ మఖ్ధూంభవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో వామపక్షాల బలం పెరిగిందనీ..సీపీఐకి ఐదుగురు ఎంపీలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య ఎనిమిదికి చేరిందని, సీపీఎంకూ ఒక ఎంపీ పెరిగారని ఆయన పేర్కొన్నారు. ఎన్టీయే కూటమి 400 సీట్లు సాధిస్తుందంటూ గొప్పలకు పోయిన భాజపాకు చంద్రబాబునాయుడు, నీతీశ్‌ మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో భారాస ఓట్లు భాజపాకు పడ్డాయన్నారు.

కేస్‌ స్టడీగా జగన్‌ నియంత పాలన: ఒక రాష్ట్రాన్ని ఎలా పరిపాలించకూడదో చెప్పడానికి ఏపీ మాజీ సీఎం జగన్‌ పరిపాలన కేస్‌ స్టడీగా పనికొస్తుందని కె.రామకృష్ణ అన్నారు. జగన్‌ ఏనాడూ ప్రజాస్వామ్యాన్ని గౌరవించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడికి సువర్ణ అవకాశం వచ్చిందని, ఆయన ఏపీ ప్రయోజనాల కోసం పాటుపడాలని సూచించారు. 


ఓట్ల లెక్కల్లో తేడాలపై హైకోర్టుకు వెళ్తాం: కొత్తపల్లి గీత

ఈనాడు, పాడేరు: అరకు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు సవ్యంగా జరగలేదని.. పోలైన ఓట్లకు లెక్కించిన వాటికి తేడాలున్నాయని ఆ స్థానం కూటమి అభ్యర్థిని కొత్తపల్లి గీత (భాజపా) ఆరోపించారు. దీనిపై హైకోర్టులో పిటిషన్‌ వేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఓ వీడియో విడుదల చేశారు. ‘అరకు పార్లమెంటు పరిధిలో పోలైన ఓట్లను అధికారులు ఒక్కోసారి ఒక్కోలా చూపారు. ఎలక్షన్‌ వెబ్‌సైట్లో 11.37 లక్షలు, 17సీ దరఖాస్తులో 11.45 లక్షలు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి 11.51 లక్షలు ఓట్లు పోలైనట్లుగా పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపులో తేడాలున్నాయని, రీకౌంటింగ్‌ చేయాలని ఫలితాలు ప్రకటించక ముందే ఆర్వోకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ముఖ్యంగా పాడేరు, రంపచోడవరం, అరకులోయ నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థికి పోలైన ఓట్ల వివరాలు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం చూపారు. వాటిపై మాకు అనుమానాలున్నాయి. అందుకే కోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నాం’ అని పేర్కొన్నారు.


ఏపీతో సమస్యలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకుంటాం
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో సమస్యలను స్నేహపూర్వకంగా పరిష్కరించుకుంటామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం వస్తే వెళ్తారా అన్న ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘‘ఏ ప్రభుత్వమైనా కొత్తగా ఏర్పాటవుతున్న సందర్భంగా ఆహ్వానించినప్పుడు ఆ కార్యక్రమానికి హాజరు కావడంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’ అని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీపై కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.


ప్రవాసాంధ్రుల సేవలు వెలకట్టలేనివి
తెదేపా ఎన్నారై విభాగం సమన్వయకర్త జయరాం కోమటి 

ఈనాడు డిజిటల్, అమరావతి: విదేశాల నుంచి వచ్చి ఎన్డీయే కూటమి విజయానికి కృషి చేసిన ప్రవాసాంధ్రులకు తెదేపా ఎన్నారై విభాగం సమన్వయకర్త జయరాం కోమటి కృతజ్ఞతలు తెలిపారు. తెదేపాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని నమ్మి వారు ఎన్డీయేను గెలిపించారన్నారు. వారి సేవలు, సహకారం వెలకట్టలేనివని.. వారి సంక్షేమానికి తెదేపా కట్టుబడి ఉందని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఈ అఖండ విజయంలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు. విదేశాల నుంచి వచ్చి రెండు, మూడు నెలల పాటు సొంతూళ్లలో వారు ఎన్డీయే విజయం కోసం పనిచేశారు. వారు ఆశించిన విధంగా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. చంద్రబాబు ఏపీని దేశంలో అగ్రస్థానంలో నిలుపుతారు. ఆంధ్రుల రాజధాని అమరావతిని పూర్తి చేస్తారు. ఈ అభివృద్ధిలో మీరూ భాగస్వాములుకండి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి. కంపెనీలు స్థాపించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించండి’ అని కోరారు.


ఎన్డీయే గెలుపుతో బ్రిటన్‌లో వేడుకలు


బ్రిటన్‌లో సంబరాలు చేసుకుంటున్న తెదేపా అభిమానులు

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో ఎన్డీయే తిరుగులేని విజయం సాధించడంతో లండన్‌ సహా బ్రిటన్‌లోని పలు నగరాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. తెదేపా అభిమానులు కేక్‌ కోసి సంబరాలు చేసుకున్నారు. బర్మింగ్‌హామ్, రెడింగ్, కోవెంట్రీ, మాంచెస్టర్, అబెర్డీన్, కార్డీఫ్‌ సహా పలు నగరాల్లో తెదేపా ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి.


ఎంపీగా పోటీ చేద్దామంటే  జగన్‌ అపాయింట్‌మెంట్‌ దొరకలేదు
మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర

సాలూరు, న్యూస్‌టుడే: ‘లోక్‌సభకు పోటీ చేసిన తరవాత రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నా. కానీ ఎంపీ టికెట్‌ కేటాయించలేదు. గతేడాది ఆగస్టు నుంచి తాజా ఎన్నికల్లో సీట్లు కేటాయించే వరకు జగన్‌మోహన్‌రెడ్డి అపాయింట్‌మెంట్‌ దొరక్కపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో ఎమ్మెల్యేగా పోటీ చేశా. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. ప్రజాతీర్పును గౌరవిస్తాం’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర పేర్కొన్నారు. బుధవారం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులోని ఆయన స్వగృహంలో వైకాపా నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో సాలూరు ఎమ్మెల్యేగా గెలిచిన సంధ్యారాణికి, ఎన్డీయే కూటమికి అభినందనలు తెలిపారు.


ఇది కార్యకర్తల విజయం: మండవ  

ఈనాడు డిజిటల్, అమరావతి: ఏపీలో ఎన్డీయే సాధించిన గెలుపు.. తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తల విజయంగా ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అభివర్ణించారు. ఈ ఎన్నికలు దేశంలో కొత్త ఆలోచనలకు మలుపుగా నిలిచాయని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘రెండు తెలుగు రాష్ట్రాలు ప్రగతి పథంలో పయనించాలి. అభివృద్ధిలో పోటీ పడాలి’ అని ఆయన ఆకాంక్షించారు.


దళితులకు నమ్మకద్రోహమే వైకాపా పరాజయానికి కారణం
దళిత బహుజన ఫ్రంట్‌ ప్రధాన కార్యదర్శి భాగ్యరావు

 ఈనాడు, అమరావతి: దళితులకు ప్రత్యేకంగా ఏళ్లుగా అమలవుతున్న 27 సంక్షేమ పథకాలను రద్దు చేసి తీరని ద్రోహం చేయడమే వైకాపా ఘోర పరాజయానికి కారణమని దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యరావు పేర్కొన్నారు. స్వయంఉపాధి రాయితీ రుణాలకుగాను రూపాయి కేటాయించకుండా ఎస్సీ కార్పొరేషన్‌ విభజన పేరుతో జగన్‌ నాటకాలాడారని బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. దళితులు, గిరిజనులపై వైకాపా నేతలు ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నా అడ్డుకట్ట వేసేందుకు ఏనాడూ ప్రయత్నించలేదని ఆరోపించారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని