పాతికేళ్లకే పార్లమెంటుకు..

లోక్‌సభ ఎన్నికల్లో పలు రాష్ట్రాలకు చెందిన యువ కెరటాలు సత్తా చాటారు. సీనియర్‌ నేతలపై విజయం సాధించి పాతికేళ్ల ప్రాయంలోనే ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రజల తరఫున గళం వినిపించేందుకు సిద్ధమయ్యారు.

Published : 06 Jun 2024 04:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ ఎన్నికల్లో పలు రాష్ట్రాలకు చెందిన యువ కెరటాలు సత్తా చాటారు. సీనియర్‌ నేతలపై విజయం సాధించి పాతికేళ్ల ప్రాయంలోనే ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రజల తరఫున గళం వినిపించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుత పార్లమెంటులో అతి పిన్న ఎంపీలుగా ఘనత దక్కించుకున్న వీరి నేపథ్యాన్ని పరిశీలిస్తే..


కాంగ్రెస్‌ను సునాయాసంగా ఓడించి.. 

శాంభవి చౌధరి.. బిహార్‌లోని సమస్తీపుర్‌ నియోజకవర్గం నుంచి లోక్‌ జనశక్తి పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. అటు కాంగ్రెస్‌ కూడా.. జేడీయూ మంత్రి మహేశ్వర్‌ హజారీ కుమారుడు సన్నీ హజారీని పోటీలో పెట్టింది. అయితే.. ఎన్నికల్లో శాంభవి తన ప్రత్యర్థిని సునాయాసంగా ఓడించారు. విజయాన్ని సొంతం చేసుకున్న ఆమె 25 ఏళ్ల వయసుకే ఎంపీగా ఎన్నికైన వారి జాబితాలో చేరారు. బిహార్‌ మంత్రిగా ఉన్న అశోక్‌ చౌధరి కుమార్తె శాంభవి. ఎన్నికల ప్రచారం సమయంలో ప్రధాని మోదీ.. శాంభవిపై ప్రశంసలు కురిపించారు.


సత్తా చాటిన కానిస్టేబుల్‌ భార్య.. 

రాజస్థాన్‌లోని భరత్‌పుర్‌ నుంచి సంజనా జాతవ్‌ను కాంగ్రెస్‌ బరిలో నిలిపింది. 51,983 ఓట్ల మెజారిటీతో భాజపా అభ్యర్థి రామ్‌స్వరూప్‌ కోలీపై ఆమె విజయం సాధించారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సంజన.. భాజపా అభ్యర్థి రమేశ్‌ ఖేడీ చేతిలో కేవలం 409 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయినా వెనక్కి తగ్గని ఆమె.. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటారు. సంజనా భర్త పోలీసు కానిస్టేబుల్‌ కావడం గమనార్హం.


స్వతంత్ర అభ్యర్థుల హవా

  • సార్వత్రిక ఎన్నికల్లో పలువురు స్వతంత్ర అభ్యర్థులు సత్తా చాటారు. ఆరు స్థానాల్లో ప్రధాన పార్టీ అభ్యర్థులను వెనక్కినెట్టి విజయకేతనం ఎగురవేశారు. 
  • జమ్మూ కశ్మీర్‌లో నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నాయకుడు ఒమర్‌ అబ్దుల్లాపై స్వతంత్ర అభ్యర్థి అబ్దుల్‌ రషీద్‌ 1,86,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 
  • మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హంతకుల్లో ఒకరైన బియాంత్‌ సింగ్‌ కుమారుడు సరబ్జీత్‌ సింగ్‌ ఖల్సా పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.
  • పంజాబ్‌లోని ఖదూర్‌ సాహిబ్‌ లోక్‌సభ స్థానం నుంచి వేర్పాటువాది అమృతపాల్‌ సింగ్‌ గెలిచారు. ఆయన ప్రస్తుతం అసోంలోని దిబ్రూగఢ్‌ జైలులో ఉన్నారు. 
  • మహారాష్ట్రలోని సాంగ్లీలో శివసేన (యూబీటీ) అభ్యర్థిపై ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన విశాల్‌ ప్రకాశ్‌ బాపు పాటిల్‌ గెలుపొందారు. 
  • లద్దాఖ్‌ నుంచి పోటీ చేసిన మహ్మద్‌ హనీఫా జాన్, దమన్‌ డయ్యూ నుంచి పటేల్‌ ఉమేష్‌ భాయ్‌ బాబూ భాయ్‌ విజయం సాధించారు.

స్వల్ప మెజారిటీలు

  • కేరళలోని అత్తింగళ్‌ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి అదూర్‌ ప్రకాశ్‌ తన సమీప ప్రత్యర్థిపై 684 ఓట్లతో నెగ్గారు. ఈ ఎన్నికల్లో ప్రకాశ్‌కు 3,28,051 ఓట్లు రాగా.. 3,27,367 ఓట్లతో సీపీఎం అభ్యర్థి వి.జాయ్‌ రెండో స్థానంలో నిలిచారు. ఇక్కడ నోటాకు 9,791 ఓట్లు పోలయ్యాయి.
  • ఒడిశాలోని జయపురలో భాజపా అభ్యర్థి రబీంద్ర నారాయణ్‌ బెహరా (5,34,239 ఓట్లు).. తన సమీప బిజు జనతాదళ్‌ అభ్యర్థి శర్మిష్ఠా సేథిపై (5,32,652) 1587 ఓట్లతో విజయం సాధించారు. నోటాకు 6,788 ఓట్లు పడ్డాయి.
  • రాజస్థాన్‌లోని జైపుర్‌ రూరల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి అనిల్‌ చోప్రా (6,16,262).. భాజపా అభ్యర్థి రాజేంద్ర సింగ్‌ (6,17,877 ఓట్లు) చేతిలో 1615 ఓట్లతో ఓడిపోయారు.
  • ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ స్థానంలో భాజపా అభ్యర్థి భోజ్‌రాజ్‌ నాగ్‌ (5,97,624) తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి బీరేశ్‌ ఠాకుర్‌పై (5,95,740) 1884 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ నోటాకు ఏకంగా 18,669 ఓట్లు పడ్డాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని