జగన్‌ దుష్టపాలన వల్లే చంద్రబాబు గెలుపు: నారాయణ

ఏపీలో జగన్‌ ఐదేళ్ల దుష్టపాలన వల్లే చంద్రబాబు గెలిచారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా సహా ఆ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన డిమాండ్లను సాధించాలని చంద్రబాబుకు సూచించారు.

Published : 06 Jun 2024 04:37 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీలో జగన్‌ ఐదేళ్ల దుష్టపాలన వల్లే చంద్రబాబు గెలిచారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా సహా ఆ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన డిమాండ్లను సాధించాలని చంద్రబాబుకు సూచించారు. ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణతో కలిసి బుధవారమిక్కడ మఖ్ధూంభవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల్లో వామపక్షాల బలం పెరిగిందనీ..సీపీఐకి ఐదుగురు ఎంపీలు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య ఎనిమిదికి చేరిందని, సీపీఎంకూ ఒక ఎంపీ పెరిగారని ఆయన పేర్కొన్నారు. ఎన్డీయే కూటమి 400 సీట్లు సాధిస్తుందంటూ గొప్పలకు పోయిన భాజపాకు చంద్రబాబునాయుడు, నీతీశ్‌ మద్దతు లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో భారాస ఓట్లు భాజపాకు పడ్డాయన్నారు. ‘పార్టీ ఫిరాయింపుల్ని రేవంత్‌రెడ్డి కూడా కొనసాగిస్తున్నారు. భారాస ఎమ్మెల్యేకు కాంగ్రెస్‌ నుంచి ఎంపీ టికెట్‌ ఎలా కేటాయిస్తారు? అందుకే దానం నాగేందర్‌ను ప్రజలు ఓడించారు. కేసీఆర్‌ చేసిన తప్పులను కాంగ్రెస్‌ చేయొద్దు. కక్షసాధింపు చర్యలకు పాల్పడవద్దు. రేవంత్‌ ప్రభుత్వం చిహ్నాల వివాదాలతో సమయం వృథా  చేసుకోవద్దు’ అని నారాయణ సూచించారు. 

కేస్‌ స్టడీగా జగన్‌ నియంత పాలన

ఒక రాష్ట్రాన్ని ఎలా పరిపాలించకూడదో చెప్పడానికి ఏపీ మాజీ సీఎం జగన్‌ పరిపాలన కేస్‌ స్టడీగా పనికొస్తుందని కె.రామకృష్ణ అన్నారు. చంద్రబాబునాయుడికి సువర్ణ అవకాశం వచ్చిందని, ఆయన ఏపీ ప్రయోజనాల కోసం పాటుపడాలని సూచించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని