కొత్త సభలో తారల తళుకులు

సినీ ప్రముఖులు, భారత రాజకీయాలకు దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నర్గీస్, సునీల్‌దత్, రాజేశ్‌ఖన్నా, వినోద్‌ఖన్నా, అమితాబ్‌బచన్‌.. ఇలా పలువురు తారల రాజకీయ ప్రస్థానం తెలిసిందే.

Published : 06 Jun 2024 05:50 IST

హిమాచల్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికైన 4వ మహిళగా కంగన

సినీ ప్రముఖులు, భారత రాజకీయాలకు దశాబ్దాలుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నర్గీస్, సునీల్‌దత్, రాజేశ్‌ఖన్నా, వినోద్‌ఖన్నా, అమితాబ్‌బచన్‌.. ఇలా పలువురు తారల రాజకీయ ప్రస్థానం తెలిసిందే. దక్షిణాదిలోనూ ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత వంటి స్టార్‌ నటులు ముఖ్యమంత్రులుగా సేవలందించారు. ప్రస్తుత కాలానికి వస్తే కమల్‌హాసన్, పవన్‌ కల్యాణ్, ప్రకాష్‌రాజ్, పరేష్‌రావల్, గోవిందా వంటి పలువురు అగ్రనటులు రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నారు. 

దిల్లీ: కొత్తగా కొలువుదీరనున్న 18వ లోక్‌సభ పలువురు సినీతారలతో కళకళలాడనుంది. కొత్త, పాత సభ్యులైన దాదాపు పదిమంది సినీరంగ ప్రముఖులు ఎంపీలుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రముఖ హిందీ సినీనటి కంగనా రనౌత్, టీవీ రామాయణం స్టార్‌ అరుణ్‌ గోవిల్‌ వంటి సభ్యులు తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మరో బాలీవుడ్‌ ప్రముఖురాలైన హేమామాలిని, భోజ్‌పురి నటుడు మనోజ్‌ తివారి లాంటి స్టార్‌ రాజకీయవేత్తలు మూడోసారి సభకు రానున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌ గతంలో పలుమార్లు సంచలన వ్యాఖ్యలతో వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. తాజా ఎన్నికల్లో విజయం సాధించగానే తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయడం గురించి ఆమె మాట్లాడారు. ఎంపీగా సభలో కంగనా తీరు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి ఇప్పటిదాకా ముగ్గురే మహిళలు లోక్‌సభకు ఎన్నికకాగా, కంగనా నాలుగో మహిళ కావడం గమనార్హం. మిగతా ముగ్గురూ పూర్వ రాజకుటుంబాల స్త్రీలు కాగా, సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఎంపీగా ఎన్నికై కంగనా చరిత్ర సృష్టించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఎస్పీ అభ్యర్థితో పోటాపోటీగా తలపడి 10,585 ఓట్ల ఆధిక్యతతో భాజపా సభ్యుడు అరుణ్‌ గోవిల్‌ గట్టెక్కారు. అత్యంత జనాదరణ పొందిన టీవీ సీరియల్‌ రామాయణంలో అరుణ్‌ రాముడి పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 

యూపీలోని మథుర నుంచి హేమామాలిని వరుసగా మూడోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. భోజ్‌పురి సినిమా స్టార్‌గా పేరొందిన మనోజ్‌ తివారీకి సైతం పార్లమెంటు సభ్యుడిగా ఇది మూడో విజయం. తాజా ఎన్నికల్లో ఈశాన్య దిల్లీ స్థానం నుంచి యువజన కాంగ్రెస్‌ నాయకుడైన కన్హయ్య కుమార్‌ను ఈయన ఓడించారు. మరో ప్రఖ్యాత భోజ్‌పురి నటుడు రవికిషన్‌ సైతం యూపీలోని గోరఖ్‌పుర్‌ స్థానం నుంచి తిరిగి రెండోసారి ఎన్నికయ్యారు. ఈయన పలు  బాలీవుడ్, తెలుగు చిత్రాల్లోనూ నటించారు. కేరళలోని త్రిశ్శూర్‌ నుంచి పార్లమెంటుకు ఎన్నికైన ప్రముఖ మలయాళీ నటుడు సురేష్‌ గోపి ఆ రాష్ట్రంలో తొలిసారిగా భాజపా ఖాతా తెరవడంలో తన వంతు పాత్ర పోషించారు. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు శత్రుఘ్న సిన్హా పశ్చిమబెంగాల్‌లోని ఆసన్‌సోల్‌ నుంచి టీఎంసీ అభ్యర్థిగా గెలిచారు. బెంగాలీ నటి, మూడుసార్లు ఎంపీగా గెలిచిన శతాబ్దిరాయ్‌ సైతం బీర్‌భూమ్‌ నుంచి టీఎంసీ అభ్యర్థిగా భాజపాపై ఘనవిజయం సాధించారు. బెంగాలీతోపాటు పలు తెలుగు చిత్రాల్లోనూ నటించి హుగలీ నుంచి టీఎంసీ అభ్యర్థిగా విజయం సాధించిన రచనా బెనర్జీ తొలిసారిగా పార్లమెంటులో అడుగు పెట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని