ఓట్ల శాతం పెంచుకున్న జనసేన

తెదేపా, భాజపాలతో పొత్తు పెట్టుకున్న జనసేన.. తాను పోటీచేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించి సంచలనం సృష్టించింది. దాంతోపాటు తన ఓటింగ్‌ను 6.85%కు పెంచుకుంది.

Updated : 06 Jun 2024 05:32 IST

6.85 శాతం ఓట్లతో 21 స్థానాలు
రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ గెలుపు
పార్టీకి మొత్తం 23,17,747 ఓట్లు

ఈనాడు, అమరావతి: తెదేపా, భాజపాలతో పొత్తు పెట్టుకున్న జనసేన.. తాను పోటీచేసిన 21 స్థానాల్లోనూ విజయం సాధించి సంచలనం సృష్టించింది. దాంతోపాటు తన ఓటింగ్‌ను 6.85%కు పెంచుకుంది. 2019 శాసనసభ ఎన్నికల్లో జనసేన 5.35% ఓట్లే తెచ్చుకుంది. ఆ ఎన్నికల్లో కొన్ని చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకుని గరిష్ఠంగా 138 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ప్రస్తుత ఎన్నికల్లో పొత్తులో భాగంగా 21 స్థానాల్లోనే బరిలో నిలిచింది. మొత్తం 23,17,747 ఓట్లు సాధించింది. రాష్ట్రంలో పోలైన మొత్తం ఈవీఎం, పోస్టల్‌ బ్యాలట్‌లు కలిపి 3,38,55,999 ఉన్నాయి. వాటిలో జనసేన సాధించింది 6.85%. పోటీచేసిన రెండు లోక్‌సభ స్థానాల్లోనూ జనసేన గెలిచింది. ఈ ఎన్నికల్లో పవన్‌కల్యాణ్‌ మొదటి నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వననే వ్యూహంతో ఉన్నారు. అది ఈ స్థాయి గెలుపులో కీలకపాత్ర పోషించింది. 2019లో ప్రధానపార్టీల తోడు లేకుండా ఒంటరిగా బరిలో దిగిన అనుభవం, అంతకుముందు 2009లో ప్రజారాజ్యం గెలుపు, సాధించిన ఓట్లు ఆ తర్వాత పరిణామాల అనుభవం పవన్‌కల్యాణ్‌కు ప్రస్తుత ఎన్నికల్లో ఉపయుక్తంగా నిలిచాయి. ఒంటరిగా బరిలోకి దిగాలంటూ కొందరు పెద్దలు సామాజిక మాధ్యమాల ద్వారాను, నేరుగా ఒత్తిడి చేసినా పవన్‌ ఎక్కడా తొణకలేదు, బెణకలేదు. తనకంటూ స్పష్టమైన వ్యూహాలు ఉన్నాయని చెబుతూ వచ్చారు. 

2024 ఎన్నికల్లో జనసేన బలంగా శాసనసభలో అడుగుపెడుతుందని, అందుకు ఏం చేయాలో చేస్తానని చెప్పారు. మరోసారి తాను ఒంటరిగా పోటీచేసి రిస్క్‌ తీసుకోదలుచుకోలేదని కూడా అనేక వేదికలపై పేర్కొన్నారు. అదే సమయంలో రాష్ట్ర అవసరాల నేపథ్యంలో ఒంటరి పోటీ శ్రేయస్కరం కాదని, సమాజానికి వైకాపా చాలా ప్రమాదకరం అన్న నినాదం కూడా పవన్‌కల్యాణ్‌ ఇచ్చారు. చాలా ముందునుంచే ఆయన పొత్తులపై దృష్టితో అడుగులు వేస్తూ వచ్చారు. భాజపాను, తెదేపాను కలపడంలో పవన్‌కల్యాణ్‌ కీలకపాత్ర పోషించారు.   

గట్టిపోటీ ఒక్క చోటే..

జనసేన 21 స్థానాల్లో పోటీచేస్తే ఒక్క పోలవరం నియోజకవర్గంలోనే గట్టి పోటీ కనిపించింది. ఇక్కడ జనసేన అభ్యర్థి 7,395 ఓట్ల ఆధిక్యంతోనే గెలుపొందారు. లెక్కింపులో ఈ ఫలితంపై చివరి వరకు ఉత్కంఠ కొనసాగింది. ఆ తర్వాత రైల్వేకోడూరు, పాలకొండ నియోజకవర్గాల్లోనే తక్కువ మెజారిటీలు సాధించినట్లయింది. రైల్వేకోడూరులో 11,101 ఓట్లు, పాలకొండలో 13,291 ఓట్ల ఆధిక్యం వచ్చింది. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ 30వేలకు మించి ఓట్ల ఆధిక్యాన్ని జనసేన అభ్యర్థులు సాధించారు. ఎనిమిది నియోజకవర్గాల్లో 50 వేల ఓట్లను మించి ఆధిక్యతతో గెలిచారు.


కలిసొచ్చిన పొత్తు

పొత్తు మూడు పార్టీలకూ కలిసొచ్చింది. ఓట్ల బదిలీ బాగా జరిగిందని ఫలితాలు నిరూపిస్తున్నాయి. గ్రామీణ స్థాయి నుంచి మూడు పార్టీల సమన్వయం కోసం మొదటి నుంచి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, పార్టీ పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ బాగా కృషిచేశారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వ అరాచకాలతో ఆ ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే కాంక్షతో ప్రజలు కూడా ఈ పొత్తును సాదరంగా స్వాగతించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని