ఎన్డీయే కూటమికి 55.28% ఓట్లు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి 55.28 శాతం ఓట్లు సాధించగా.. వైకాపా 39.37 శాతానికే పరిమితమైంది.

Published : 06 Jun 2024 05:38 IST

వైకాపాకు 39.37 శాతం
15.91 శాతం మేర వ్యత్యాసం
వైకాపా కంటే కూటమికి 53,72,166 ఓట్లు అధికం
సొంతంగా 45.60 శాతం ఓట్లు సాధించిన తెదేపా
వైకాపా కంటే 6.23 శాతం అధికం
జనసేనకు 6.85 శాతం, భాజపాకు 2.83 శాతం ఓట్లు
ఓట్ల శాతం కొద్దిగా పెరిగినా.. ఎక్కువ స్థానాలు దక్కించుకున్న జనసేన, భాజపా
గతం కంటే 10.58 శాతం ఓట్లు, 140 స్థానాలు కోల్పోయిన వైకాపా

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి 55.28 శాతం ఓట్లు సాధించగా.. వైకాపా 39.37 శాతానికే పరిమితమైంది. ఎన్డీయే కూటమి, వైకాపా మధ్య ఓట్ల వ్యత్యాసం 15.91 శాతముంది. విడివిడిగా చూస్తే తెదేపా 45.60 శాతం, జనసేన 6.85 శాతం, భాజపా 2.83 శాతం ఓట్లు సాధించాయి. తెదేపా, వైకాపా మధ్య ఓట్ల తేడా 6.23 శాతంగా ఉంది. కూటమిలోని మూడు పార్టీలు కలిపి 1,86,56,300 ఓట్లు దక్కించుకోగా.. వైకాపా 1,32,84,134 ఓట్లు సాధించింది. వైకాపా కంటే కూటమి 53,72,166 ఓట్లు అధికంగా సాధించింది. 

గత ఎన్నికల కంటే తెదేపాకు 6.43 శాతం ఓట్లు, 112 సీట్లు అధికం

 • తెదేపా గత ఎన్నికల్లో 39.17 శాతం ఓట్లు దక్కించుకోగా... ఈసారి 45.60 శాతం ఓట్లు సాధించింది. 
 • గత సారి కంటే 6.43 శాతం ఓట్లు, 112 సీట్లు అధికంగా దక్కించుకుంది. 
 • 2019లో 175 స్థానాల్లో పోటీ చేసి 23 స్థానాలకే పరిమితమైన తెదేపా.. ఈసారి 144 స్థానాల్లోనే బరిలో దిగి 135 స్థానాలు సాధించింది. పోటీ చేసిన వాటిల్లో కేవలం 9 మినహా మిగతావన్నీ గెలిచింది. 

జనసేనకు 1.25 శాతం ఓట్లు పెరిగాయ్‌.. 20 సీట్లు అదనంగా దక్కాయ్‌

 • జనసేన గత ఎన్నికల్లో 5.60 శాతం ఓట్లు దక్కించుకోగా.. ఈసారి 6.85 శాతం ఓట్లు సాధించింది. 
 • గత సారి కంటే 1.25 శాతం ఓట్లే అధికంగా సాధించినప్పటికీ... సీట్ల పరంగా చూస్తే 20 స్థానాలు అదనంగా దక్కించుకోగలిగింది. 
 • 2019లో 132 స్థానాల్లో పోటీ చేసి ఒకే ఒక్క సీటుకు పరిమితం కాగా.. ఈసారి 21 స్థానాల్లోనే పోటీ చేసి 100 శాతం స్ట్రైక్‌ రేట్‌తో అన్ని స్థానాల్లోనూ విజయం దక్కించుకుంది. 

భాజపా ఓట్ల శాతం 1.99 మేర పెరుగుదల.. 8 స్థానాల్లో విజయం

 • భాజపా గత ఎన్నికల్లో 0.84 శాతం ఓట్లు సాధించగా... ఈసారి 2.83 శాతం ఓట్లు దక్కించుకుంది. 
 • 2019 కంటే భాజపాకు 1.99 శాతం మేర ఓట్లు అధికంగా లభించాయి.
 • 2019లో 173 స్థానాల్లో పోటీ చేసిన భాజపా ఒక్క సీటూ దక్కించుకోలేదు. ఈసారి మాత్రం 10 స్థానాల్లో పోటీచేసి 8 స్థానాలు సాధించింది.
 • 2014లో పొత్తుల్లో భాగంగా 4 సీట్లే సాధించిన భాజపా.. ఈసారి మాత్రం అంతకంటే రెట్టింపు స్థానాలు దక్కించుకోగలిగింది.

10.58 శాతం ఓట్లు, 140 స్థానాలు కోల్పోయిన వైకాపా

 • 2019లో 49.95 శాతం ఓట్లు సాధించిన వైకాపా.. ఈసారి ఏకంగా 10.58 శాతం ఓట్లు కోల్పోయి 39.37 శాతానికి పరిమితమైంది.
 • గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన వైకాపా.. ఈసారి ఏకంగా 140 స్థానాలు కోల్పోయి 11 సీట్లకే పరిమితమైంది. 
 • 2014లో 44.86 శాతం ఓట్లు వైకాపాకు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఈసారి ఆ పార్టీ ఓట్ల శాతం 5.49 శాతం మేర తగ్గింది. 
 • 2014లో వైకాపాకు 67 స్థానాలు లభించాయి. అప్పటితో పోలిస్తే ఈసారి 56 స్థానాలను కోల్పోయింది. 

2014 కంటే ఎన్డీయే కూటమికి 8.49 శాతం ఓట్లు అధికం

 • 2014లో తెదేపా, భాజపా, జనసేన పొత్తు పెట్టుకున్నాయి. ఆ ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు. ఎన్డీయే కూటమికి 46.79 శాతం ఓట్లు వచ్చాయి. అప్పటితో పోలిస్తే ఈసారి ఎన్డీయే కూటమి 8.49 శాతం మేర అధికంగా ఓట్లు సాధించింది.
 • 2019లో తెదేపా, భాజపా, జనసేన విడివిడిగా పోటీ చేశాయి. అప్పట్లో తెదేపా 39.17 శాతం, జనసేన 5.60 శాతం, భాజపా 0.84 శాతం ఓట్లు సాధించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని