సంక్షిప్తవార్తలు(12)

టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఈ నెల 11న ఎన్నుకొని.. ఆ తీర్మానాన్ని గవర్నర్‌కు పంపనున్నట్లు తెదేపా సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు.

Updated : 07 Jun 2024 06:53 IST

11న టీడీఎల్పీ.. 12న ప్రమాణ స్వీకారం
తెదేపా సీనియర్‌నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి

ఈనాడు డిజిటల్, అమరావతి: టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఈ నెల 11న ఎన్నుకొని.. ఆ తీర్మానాన్ని గవర్నర్‌కు పంపనున్నట్లు తెదేపా సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించారు. చంద్రబాబును కలిసిన అనంతరం ఉండవల్లి నివాసం బయట ఆయన విలేకరులతో మాట్లాడారు. మోదీ, ఒడిశా సీఎంల ప్రమాణస్వీకార కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు. ఇంత ఘోరమైన ఓటమి చవిచూశాక కూడా వైకాపా నేతల తీరు మారలేదని మండిపడ్డారు.

  • ఎన్డీయే ఇంత భారీ విజయం సాధించడానికి ప్రజల్లో ఉన్న కసే కారణమని విశాఖ ఎంపీగా ఎన్నికైన భరత్‌ తెలిపారు. చంద్రబాబుతో సమావేశం కావడం ఆనందంగా ఉందని గుంటూరు ఎంపీగా ఎన్నికైన పెమ్మసాని చంద్రశేఖర్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అనేక సమస్యల పరిష్కారానికి కేంద్రం అండగా నిలవనుందని విజయనగరం ఎంపీగా ఎన్నికైన కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు.

రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలి

చంద్రబాబుకు తెలంగాణ సీఎం ఫోన్‌
అభినందనలు తెలిపిన రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీలో ఘన విజయం సాధించిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను సహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకునేందుకు సహకరించాలని రేవంత్‌ కోరారు. గురువారం మధ్యాహ్నం మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ఫలితాలపై సమీక్ష జరిగింది. ఇదే సమావేశం నుంచి రేవంత్‌రెడ్డి చంద్రబాబుకు ఫోన్‌ చేసి మాట్లాడారు.


దిల్లీకి తెదేపా అధినేత

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి దిల్లీ బయల్దేరి వెళ్లారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం నుంచి వాహనశ్రేణిలో విమానాశ్రయం చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఎన్డీయే ఎంపీలు పెమ్మసాని చంద్రశేఖర్‌ (గుంటూరు), పుట్టా మహేశ్‌యాదవ్‌ (ఏలూరు), వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి (నెల్లూరు), కేశినేని చిన్ని (విజయవాడ), మాగుంట శ్రీనివాసులురెడ్డి (ఒంగోలు), భరత్‌ (విశాఖపట్నం), దగ్గుమళ్ల ప్రసాదరావు (చిత్తూరు), అప్పలనాయుడు (విజయనగరం)తో పాటు ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి (నూజివీడు), సత్యకుమార్‌ (ధర్మవరం), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు)తో కలిసి హస్తినకు బయల్దేరి వెళ్లారు.


చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి  ప్రధాని నరేంద్ర మోదీ

ఎన్డీయే పక్షాల సీఎంలూ హాజరు

ఈనాడు, అమరావతి: చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ సహా ఎన్డీయే పక్షాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్‌ గురువారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చి, ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్ల గురించి చర్చించారు.


అవకాశాలను సద్వినియోగం చేసుకోండి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విజయవాడ(అలంకార్‌ కూడలి), న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీయే కూటమి నేతలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అభినందనలు తెలిపారు. ఈ మేరకు గురువారం తెదేపా అధినేత నారా చంద్రబాబుకు లేఖ రాశారు. కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. ‘కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులోనూ మీరు కీలక భూమిక పోషించనున్నారు. భాజపాకు పూర్తిస్థాయి మెజారిటీ లేనందున.. తెదేపా, జేడీయూలపై ఆధారపడి  ఆ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్రానికి వచ్చిన మంచి అవకాశం ఇది.  గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం ఏపీని అన్ని విధాలుగా అన్యాయం చేసింది. ప్రత్యేక హోదా హామీని తుంగలో తొక్కింది. విభజన హామీలను అమలు చేయలేదు. ఇప్పుడు ఎన్డీయేలో కీలకంగా వ్యవహరించే అవకాశం మీకు వచ్చినందున.. విశాఖ ఉక్కును రక్షించాలి. ప్రత్యేక హోదా తీసుకురావాలి. విభజన హామీలను అమలు చేసేలా చూడాలి’ అని రామకృష్ణ ఆ లేఖలో కోరారు.


ఆ అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదు 

తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు

ఈనాడు డిజిటల్, అమరావతి: వైకాపాతో అంటకాగి, నిబంధనలకు తిలోదకాలిచ్చిన కొందరు అవినీతి అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు హెచ్చరించారు. డిప్యుటేషన్‌పై వచ్చి, ఇప్పుడు పారిపోవాలని చూస్తున్న కొందరు ఉన్నతాధికారుల ప్రయత్నాలకు కళ్లెం వేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే 1,800 మంది టీచర్ల అక్రమ బదిలీల్ని అడ్డుకున్నట్లు తెలిపారు. మంగళగిరిలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వ కార్యాలయాల్లో కీలక దస్త్రాలు ధ్వంసం చేయాలని చూస్తున్నారు. 300 మంది స్టాఫ్‌నర్సుల పోస్టింగుల్లోనూ అవినీతి జరిగినట్టు తెలిసింది. వెంటనే వాటికి అడ్డుకట్టపడింది’’ అనిఅశోక్‌బాబు తెలిపారు.


ఓడినా.. వైఖరి మార్చుకోని జగన్‌ 

భాజపా నేత సత్యకుమార్‌ 

ఈనాడు, అమరావతి: ఘోరంగా ఓడిపోయిన జగన్‌ తన వైఖరి మార్చుకోకుండా ప్రజలపై నిందలు వేయడం దారుణమని ధర్మవరం నుంచి భాజపా ఎమ్మెల్యేగా గెలిచిన సత్యకుమార్‌ మండిపడ్డారు. పరాజయంతో తాడేపల్లికి మాత్రమే పరిమితమైన జగన్‌.. సంక్షేమ పథకాలు ఇచ్చాను కదా అని ప్రజలను నిందించడం తగదని విమర్శించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సత్యకుమార్‌ గురువారం విలేకర్లతో మాట్లాడారు. ‘జగన్‌రెడ్డి.. అన్ని వర్గాలను మోసం చేశారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి అరాచక పాలన సాగించారు. ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు దిగడమే కాకుండా అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. 2024 ఎన్నికలు వైకాపాకు చెంపపెట్టులాంటివి’ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఏర్పాటులో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తీసుకున్న నిర్ణయం గొప్పదని వ్యాఖ్యానించారు.


డీకే అరుణ విజయానికి రేవంత్‌ సహకారం
భారాస నేతలు దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఆరోపణ

ఈనాడు, హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో భాజపా అభ్యర్థి డీకే అరుణ విజయానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సహకరించారని భారాస నేతలు జి.దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ ఓట్లను రేవంతే భాజపాకు బదిలీ చేయించారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో కాంగ్రెస్‌ పార్టీ 30 వేలకు పైగా మెజారిటీ తెచ్చుకుందని, ఈ ఎన్నికల్లో అది 22వేలకు తగ్గిపోయిందని, కాంగ్రెస్‌ పార్టీ ఓట్లను రేవంతే భాజపాకు బదిలీ చేయించారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో గురువారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘సిద్దిపేటలో హరీశ్‌రావు భాజపాకు ఓట్లు బదిలీ చేయించారని సీఎం రేవంత్‌ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. వాస్తవానికి ఓట్లు బదిలీ చేసింది సీఎం, మంత్రులు, విప్‌లే. భారాసను విమర్శించడం మాని.. ఎందుకు 8 సీట్లను కోల్పోయామో కాంగ్రెస్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలి. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు’’ అని పేర్కొన్నారు. 


కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన మహారాష్ట్ర స్వతంత్ర ఎంపీ

దిల్లీలో గురువారం మల్లికార్జున ఖర్గేకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న విశాల్‌ పాటిల్‌

దిల్లీ: మహారాష్ట్రలోని సాంగ్లీ నుంచి స్వతంత్ర సభ్యునిగా లోక్‌సభకు ఎన్నికైన విశాల్‌ పాటిల్‌ గురువారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి పార్టీకి తన మద్దతు ప్రకటించారు. పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలతోనూ ఆయన భేటీ అయ్యారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసంత్‌దాదా పాటిల్‌కు ఆయన మనవడు.


రేపు సీడబ్ల్యూసీ భేటీ

దిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలను విశ్లేషించడానికి ‘కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ’ (సీడబ్ల్యూసీ) శనివారం సమావేశం కాబోతోంది. పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహిస్తారు. 2019 ఎన్నికల్లో 52 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్‌ ఈసారి 99 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో పదేళ్ల విరామం తర్వాత కాంగ్రెస్‌కు లోక్‌సభలో ప్రతిపక్ష హోదా లభించబోతోంది.


సిరిసిల్ల అర్బన్‌ బ్యాంకు ఎన్నికల్లో భారాస మద్దతుదారుల పైచేయి

ఈనాడు డిజిటల్, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అర్బన్‌ బ్యాంకు ఎన్నికల్లో భారాస మద్దతుదారులు అత్యధికంగా 9 డైరెక్టర్‌ స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్, భాజపా మద్దతుదారులు, స్వతంత్ర అభ్యర్థి ఒక్కో డైరెక్టర్‌ స్థానంలో విజయం సాధించారు. పార్టీలకతీతంగా జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 12 డైరెక్టర్‌ స్థానాలకు 61 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. సిరిసిల్లలో గురువారం నిర్వహించిన ఎన్నికల్లో 6,177 మంది ఓటర్లకు గాను 4,760 (77%) మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు గెలుపొందిన అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేసి.. అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక నిర్వహిస్తామని ఎన్నికల అధికారి రామకృష్ణ తెలిపారు. కాగా, డైరెక్టర్లుగా గెలిచిన భారాస మద్దతుదారులు ఎమ్మెల్యే కేటీఆర్‌ను కలిసేందుకు హైదరాబాద్‌కు తరలివెళ్లారు.


ప్రజాసమస్యలపై దృష్టి సారించాలి: ప్రభాకర్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పాలన, ప్రజా సమస్యలపై సీఎం  రేవంత్‌రెడ్డి దృష్టిసారించాలని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌.వి.ఎస్‌.ఎస్‌.ప్రభాకర్‌ సూచించారు. రైతులు కల్తీ విత్తనాలతో, కరెంటు కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కారించాలని డిమాండ్‌ చేశారు. గురువారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభాకర్‌ మాట్లాడారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని