మళ్లీ మొదటి నుంచి మొదలు పెడదాం

‘మళ్లీ మొదటి నుంచి మొదలు పెడదాం. ప్రతిపక్షంలో ఉండి పోరాడడం మనకేమీ కొత్త కాదు కదా’ అని వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ ఆ పార్టీ తరఫున గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఓడిపోయిన అభ్యర్థులకు చెప్పారు.

Updated : 07 Jun 2024 05:26 IST

తెదేపా దాడులపై న్యాయపరంగా పోరాడదాం
గెలిచిన, ఓడిన వైకాపా అభ్యర్థుల భేటీలో జగన్‌
ఈవీఎంల వ్యవహారాన్ని సీరియస్‌గా పరిశీలించాలన్న పార్టీ నేతలు

ఈనాడు, అమరావతి: ‘మళ్లీ మొదటి నుంచి మొదలు పెడదాం. ప్రతిపక్షంలో ఉండి పోరాడడం మనకేమీ కొత్త కాదు కదా’ అని వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌ ఆ పార్టీ తరఫున గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఓడిపోయిన అభ్యర్థులకు చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత గురువారం తొలిసారి పలువురు పార్టీ నేతలతో జగన్‌ తన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే రాష్ట్రవ్యాప్తంగా తెదేపా దాడులకు దిగిందని నేతలు చెప్పగా, జగన్‌ స్పందిస్తూ ‘పార్టీ శ్రేణులకు అండగా నిలవండి. వారికి భరోసా ఇవ్వండి. న్యాయపరమైన ప్రక్రియను పార్టీ తీసుకుంటుంది’ అని చెప్పారు. ఎన్నికల్లో ఓటమి, ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్, కౌంటింగ్‌ సరళిపై వారికున్న అనుమానాలను కొందరు నేతలు జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. ‘ఈవీఎంల వ్యవహారంపై ఓ పరిశీలన చేయాల్సిన అవసరముంది. పక్కాగా మన పార్టీకి అనుకూల గ్రామాల్లోనూ ఓట్లు రాకపోవడంపై అనుమానాలున్నాయి. ముస్లింల ఓట్లు పూర్తిగా మనకే పడ్డా ఫలితాల్లో అది ప్రతిఫలించలేదు. ఎన్నికల సంఘం, ఎన్డీయే అనుకూల అధికారులు, పోలీసుల మధ్య కుమ్మక్కు నడిచిందని స్పష్టంగా అర్థమవుతోంది. పార్టీ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశపూర్వకంగా భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా పోలింగ్‌ సమయంలో భయానక పరిస్థితులు సృష్టించారు’ అని తెలిపారు. వైకాపా పాలనను ప్రస్తావిస్తూ ‘ప్రజలకు మంచి చేశాం. కచ్చితంగా పార్టీ పునర్వైభవం సాధిస్తుంది. ప్రతి కుటుంబ జీవన ప్రమాణాలను పెంచేందుకు మీరు (జగన్‌) చేసిన కృషి ప్రజల మనసుల్లో నిలిచిపోతుంది. అందువల్లే అవతల ఎన్ని కుట్రలు చేసినా వైకాపాకు 40 శాతం ఓట్లు రాకుండా ఆపలేకపోయారు. గత ఐదేళ్ల కాలం సుపరిపాలనకు ఒక గీటురాయిలా నిలిచిపోతుంది. ఈ ఐదేళ్లలో అమలైన పథకాలు, చేసిన అభివృద్ధి ప్రజల కళ్ల ముందే ఉంది. కాబట్టి ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తాం. కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలుపై ప్రజలు మన ఐదేళ్ల పాలనతో బేరీజు వేసుకుంటారు’ అని పలువురు నేతలు చెప్పారు. జగన్‌ను కలిసిన వారిలో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, అరకు, పాడేరు ఎమ్మెల్యేలు రేగం మత్స్యలింగం, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, మాజీ మంత్రులు పేర్ని నాని, ఉషశ్రీ చరణ్, వెలంపల్లి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ, కొడాలి నాని, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, విడదల రజిని, పార్టీ నేతలు ముదునూరి ప్రసాదరాజు, కేశినేని నాని, ఉప్పాళ్ల రాము, ప్రతాప్‌కుమార్‌రెడ్డి, జగన్మోహన్‌రావు, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, పేర్ని కిట్టు తదితరులు ఉన్నారు. వీరితో పాటు శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేనురాజు, డిప్యూటీ ఛైర్మన్‌ జకియా ఖానమ్‌ కూడా జగన్‌ను కలిశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని