తెదేపా దాడులతో భయానక వాతావరణం

రాష్ట్రంలో తెదేపా దాడులకు దిగుతోందని వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆయన ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ‘రాష్ట్రవ్యాప్తంగా తెదేపా దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది.

Published : 07 Jun 2024 05:16 IST

శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి
గవర్నర్‌ కలగజేసుకోవాలి:  ఎక్స్‌ వేదికగా జగన్‌ 
వైకాపా శ్రేణుల ఇళ్లపై తెదేపా దాడులు చేస్తోంది
గవర్నర్‌కు వైకాపా నేతల ఫిర్యాదు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో తెదేపా దాడులకు దిగుతోందని వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆయన ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. ‘రాష్ట్రవ్యాప్తంగా తెదేపా దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే తెదేపా శ్రేణులు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల లాంటి ప్రభుత్వ, ఇతర ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైకాపా నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. ఐదేళ్లుగా పటిష్ఠంగా ఉన్న శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గవర్నర్‌ జోక్యం చేసుకుని ఈ అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెదేపా దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సామాజిక మాధ్యమ సైనికులకు తోడుగా ఉంటాం’ అని పేర్కొన్నారు. తెదేపా దాడులు చేస్తోందంటూ మరోవైపు వైకాపా ప్రతినిధుల బృందం గురువారం సాయంత్రం గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ను కలిసి ఫిర్యాదుచేసింది. గవర్నర్‌ కలిసిన తర్వాత మాజీ మంత్రి పేర్ని నాని రాజ్‌భవన్‌ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ‘కౌంటింగ్‌ తర్వాత ఏపీలో బిహార్‌ తరహా కిరాతకాలు జరుగుతున్నాయి. తెదేపా వారు వైకాపా శ్రేణుల ఇళ్లపై దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేశారు. కిరాతకంగా హింసించి ఆస్తులను ధ్వంసం చేయడమే లక్ష్యంగా తెదేపా అధికారంలోకి వచ్చినట్లుంది. జరుగుతున్న దారుణాలన్నింటినీ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లాం. ఆయనకు ఆధారాలు ఇచ్చాం. డీజీపీని పిలిపించి మాట్లాడి విచారణ చేయిస్తామని గవర్నర్‌ మాకు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో బిహార్‌ సంస్కృతికి తెదేపా నేతలు బీజం నాటుతున్నారు. ఇది మానుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. మేము తిరుగుబాటు చేసేలా చేయొద్దని చంద్రబాబును కోరుతున్నా. తెదేపా వాళ్లు దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. మాజీ మంత్రులతో కమిటీలుగా ఏర్పడి అన్ని నియోజకవర్గాల్లో తిరిగి మారణకాండపై వివరాలు సేకరించి మరోసారి గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తాం’ అని తెలిపారు. గవర్నర్‌ను కలిసినవారిలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, జి.తనూజ, ఎమ్మెల్యేలు మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని