బెంగాల్‌ భాజపాలో ‘ఘోష’!

లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో పశ్చిమ బెంగాల్‌లో డీలా పడిన భాజపాలో అంతర్గత విభేదాలు మరింత తలనొప్పిగా మారాయి.

Published : 07 Jun 2024 05:24 IST

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో పశ్చిమ బెంగాల్‌లో డీలా పడిన భాజపాలో అంతర్గత విభేదాలు మరింత తలనొప్పిగా మారాయి. పార్టీ సీనియర్‌ నేత దిలీప్‌ ఘోష్‌ గురువారం ఎక్స్‌లో చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలోని పాత, కొత్త నేతల మధ్య విభేదాలను ఎత్తి చూపాయి. మాజీ ప్రధాని వాజ్‌పేయీ ఒకప్పుడు చేసిన వ్యాఖ్యలను ఘోష్‌ ఇప్పుడు ప్రస్తావించారు. ‘ఒకటి గుర్తుంచుకోండి.. ఒక్క పాత కార్యకర్తనూ నిర్లక్ష్యం చేయవద్దు. ఆ పరిస్థితి వస్తే 10 మంది కొత్త కార్యకర్తలను వదులుకున్నా ఫర్వాలేదు. ఎందుకంటే పాత కార్యకర్తలు విజయానికి గ్యారంటీ ఇస్తారు. కొత్త కార్యకర్తలను వెంటనే నమ్మడం వాంఛనీయం కాదు’ అని ఘోష్‌ వ్యాఖ్యానించారు. బర్దమాన్‌ దుర్గాపుర్‌లో పోటీ చేసిన ఆయన కీర్తి ఆజాద్‌ చేతిలో ఓడిపోయారు. తన నియోజకవర్గాన్ని మార్చడం మంచిది కాదన్న విషయం రూఢీ అయిందని, అది తప్పని తేలిందని మీడియాతో ఆయన వ్యాఖ్యానించారు. భాజపా రాష్ట్రశాఖ మాజీ అధ్యక్షుడైన దిలీప్‌ ఘోష్‌ గత ఎన్నికల్లో మేదినీపుర్‌లో పోటీ చేసి గెలిచారు. ఈసారి ఘోష్‌ను బర్దమాన్‌ దుర్గాపుర్‌కు పార్టీ మార్చింది. అక్కడి ఎంపీ ఎస్‌ఎస్‌ అహ్లూవాలియాను అసన్‌సోల్‌కు, సిటింగ్‌ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్‌ను మేదినీపుర్‌కు పార్టీ మార్చింది. ఈ ముగ్గురు అభ్యర్థులు తృణమూల్‌ చేతిలో ఓడిపోయారు. ఇదంతా 2021లో పార్టీలోకి వచ్చి పెత్తనం చెలాయిస్తున్న అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన సువేందు అధికారివల్లేననేది ఘోష్‌ భావనగా ఉంది. అందుకే ఆయన కొత్త నేతలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేపథ్యమున్న ఘోష్‌ ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని