ఉద్ధవ్‌ ఎన్డీయేలోకి వెళ్లడం లేదు

భాజపా నేతృత్వంలోని ఎన్డీయేలోకి శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే వెళ్లడంలేదని మహారాష్ట్ర ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌ గురువారం పేర్కొన్నారు.

Published : 07 Jun 2024 05:25 IST

- ఎన్సీపీ (ఎస్పీ) నేత జయంత్‌ పాటిల్‌ వెల్లడి

ముంబయి: భాజపా నేతృత్వంలోని ఎన్డీయేలోకి శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే వెళ్లడంలేదని మహారాష్ట్ర ఎన్సీపీ (ఎస్పీ) అధ్యక్షుడు జయంత్‌ పాటిల్‌ గురువారం పేర్కొన్నారు. ఉద్ధవ్‌తో తాను సమావేశమై మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ) విజయంపై ఆయనకు శుభాకాంక్షలు తెలిపానన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దిల్లీలో బుధవారం జరిగిన ఇండియా కూటమి సమావేశానికి ఉద్ధవ్‌ గైర్హాజరుపై అడిగిన ప్రశ్నకు..‘‘ఉద్ధవ్‌.. కూటమి మార్చే అవకాశమే లేదు’’ అని సమాధానమిచ్చారు. అంతేకాకుండా అక్టోబరులో జరగబోయే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎంవీఏకు ఘనవిజయం చేకూర్చి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఉద్ధవ్‌ ప్రయత్నాలు ప్రారంభించారన్నారు. రాష్ట్రంలోని మొత్తం 48 లోక్‌సభ స్థానాల్లో ప్రతిపక్ష ఎంవీఏ కూటమి 30 స్థానాలను కైవసం చేసుకుంది. శివసేన (యూబీటీ) 9 ఎంపీ స్థానాలను దక్కించుకుంది. 

తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ గురువారం శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రేతో ముంబయిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల్లో వారి పార్టీలు సాధించిన విజయాలపై ఒకరినొకరు అభినందించుకున్నారు. అంతకు ముందు దిల్లీలో ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో కూడా అభిషేక్‌ భేటీ అయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని