విశాఖ కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్‌లపై నిఘా పెట్టాలి

‘ఉత్తరాంధ్రలో రూ.వేల కోట్లు విలువచేసే వందల ఎకరాల ఎసైన్డ్‌ భూములను జీఓ 596 ముసుగులో కొట్టేసిన ఐఏఎస్‌ అధికారులపై నిఘా పెట్టాలి.

Published : 08 Jun 2024 06:32 IST

‘ఎసైన్డ్‌’ ఫైళ్లు స్వాధీనం చేసుకోవాలి 
మూర్తియాదవ్‌ డిమాండ్‌


ఎసైన్డ్‌ భూముల వివరాలు చూపుతున్న పీతల మూర్తియాదవ్‌

విశాఖపట్నం (సీతంపేట), న్యూస్‌టుడే: ‘ఉత్తరాంధ్రలో రూ.వేల కోట్లు విలువచేసే వందల ఎకరాల ఎసైన్డ్‌ భూములను జీఓ 596 ముసుగులో కొట్టేసిన ఐఏఎస్‌ అధికారులపై నిఘా పెట్టాలి. సంబంధిత ఫైళ్లు మాయం కాకుండా విశాఖ, విజయనగరం జిల్లాల కలెక్టరేట్‌ల నుంచి వాటిని స్వాధీనం చేసుకోవాలి’ అని జనసేన నాయకుడు, కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ డిమాండ్‌ చేశారు. విశాఖ పౌర గ్రంథాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కుంభకోణం బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, విశాఖ కలెక్టర్‌ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ కింది స్థాయి అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని, వారిపై నిఘా పెట్టాలని కోరారు. రాయలసీమకు చెందిన ఈ ముగ్గురు అధికారులు విశాఖలో భూములు దోచేశారని ఆరోపించారు. జవహర్‌రెడ్డికి, ఆయన అనుయాయులకు విశాఖ, విజయనగరం జిల్లాలలో 800 ఎకరాల ఎసైన్డ్‌ భూముల బదిలీకి కలెక్టర్లు మల్లికార్జున, నాగలక్ష్మి కారణమని ఆరోపించారు. కలెక్టర్‌ మల్లికార్జున చేతుల మీదుగా సుమారు రూ.పది వేల కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ భూములు వైసీపీ నేతల పరమయ్యాయని ఆరోపించారు. 

  • డ్రైవర్‌గా వ్యవహరించిన కమిషనర్‌: గత నెలలో విశాఖపట్నం వచ్చిన అప్పటి సీఎస్‌ జవహర్‌రెడ్డికి విమానాశ్రయం నుంచి జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ డ్రైవర్‌గా వ్యవహరించారని, తన డ్రైవర్‌ను కారులో నుంచి దింపేసిన జవహర్‌రెడ్డి భూలావాదేవీల గురించి మాట్లాడేందుకు సాయికాంత్‌ వర్మను డ్రైవింగ్‌ చేయమన్నారని మూర్తియాదవ్‌ ఆరోపించారు. అనకాపల్లి జిల్లా పరిధిలో కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ తన భార్యపేరిట 12 ఎకరాల భూమి కొనుగోలు చేశారని ఆరోపించారు. 
  • త్రిలోక్, సుభాష్‌ల పాస్‌పోర్టులు సీజ్‌ చేయాలి: జవహర్‌రెడ్డి బ్రోకర్లుగా రూ.వందల కోట్ల విలువైన భూములను రిజిస్ట్రేషన్లు చేయించుకొన్న త్రిలోక్, భరత్‌ సుభాష్‌ల పాస్‌పోర్టులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. వీరు ఏ కంపెనీల పేరిట భూములు కొనుగోలు చేశారు? ఎక్కడ నుంచి నిధులు వచ్చాయి వంటి వివరాలను సేకరించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే ఈ భూముల రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించిన 596 జీవోను రద్దు చేయడంతో పాటు, ఈ జీవో కింద జరిగిన లావాదేవీలను అబయన్స్‌లో పెట్టాలన్నారు. సమావేశంలో పోతు వెంకట ప్రసాద్‌ పాల్గొన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు