క్రాస్‌ ఓటింగ్‌తోనే 3 ఎంపీ స్థానాలు

అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి పాలై 11 స్థానాలతో సరిపెట్టుకున్న వైకాపా.. గెలిచిన నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ మూడుచోట్ల క్రాస్‌ ఓటింగ్‌ పుణ్యమాని గట్టెక్కింది. అక్కడ ఎన్డీయే అసెంబ్లీ అభ్యర్థుల కంటే.. ఆయా పార్టీల లోక్‌సభ అభ్యర్థులకు తక్కువ ఓట్లు రావడంతో వైకాపాకు విజయం దక్కింది.

Updated : 08 Jun 2024 07:26 IST

వైకాపా సాధించింది 11 అసెంబ్లీ స్థానాలు.. అయినా నాలుగు ఎంపీ స్థానాల కైవసం
తిరుపతి లోక్‌సభలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్డీయే గెలిచినా..  లోక్‌సభ వైకాపా ఖాతాలోకి
కడప, అరకుల్లో మెజారిటీ స్థానాలు ఎన్డీయేకు.. లోక్‌సభ స్థానాల్లో విజయాలు తారుమారు
10 లోక్‌సభ నియోజకవర్గాల్లో 30వేల నుంచి  లక్షకు పైగా క్రాస్‌ ఓటింగ్‌

ఈనాడు, అమరావతి: అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి పాలై 11 స్థానాలతో సరిపెట్టుకున్న వైకాపా.. గెలిచిన నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ మూడుచోట్ల క్రాస్‌ ఓటింగ్‌ పుణ్యమాని గట్టెక్కింది. అక్కడ ఎన్డీయే అసెంబ్లీ అభ్యర్థుల కంటే.. ఆయా పార్టీల లోక్‌సభ అభ్యర్థులకు తక్కువ ఓట్లు రావడంతో వైకాపాకు విజయం దక్కింది. తిరుపతి లోక్‌సభ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు గెలిచినా, లోక్‌సభ అభ్యర్థి వరప్రసాద్‌ ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే.. ఆయనకు 1,34,883 ఓట్లు తక్కువగా రావడమే దీనికి కారణం. ఫలితంగా అక్కడ నుంచి వైకాపా అభ్యర్థి గురుమూర్తి 14,569 ఓట్ల తేడాతో బయటపడ్డారు. అరకు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనూ ఎన్డీయే అసెంబ్లీ అభ్యర్థులందరికీ కలిపి 4.95 లక్షల ఓట్లు లభించగా.. లోక్‌సభకు పోటీచేసిన కొత్తపల్లి గీతకు 69వేల ఓట్లు తగ్గాయి. ఇక్కడ వైకాపా లోక్‌సభ అభ్యర్థి 50,580 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరోవైపు అరకులో నోటాకు 50,470 ఓట్లు పడ్డాయి! రాజంపేట లోక్‌సభ నియోజకవర్గంలో నాలుగు అసెంబ్లీ స్థానాలను కూటమి దక్కించుకున్నా.. లోక్‌సభ స్థానాన్ని కోల్పోయింది. క్రాస్‌ ఓటింగ్‌ కారణంగా 76,071 ఓట్ల మెజారిటీతో వైకాపా అభ్యర్థి మిథున్‌రెడ్డి గెలిచారు. రాయచోటిలో కూటమి అసెంబ్లీ అభ్యర్థికి 95,925 ఓట్లు లభించగా.. లోక్‌సభ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డికి 70,568 ఓట్లే వచ్చాయి. ఈ ఒక్కచోటే 25వేలకు పైగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. మొత్తం ఏడు అసెంబ్లీల్లో కలిపి చూస్తే 73,632 ఓట్ల క్రాస్‌ ఓటింగ్‌ కారణంగానే కిరణ్‌కుమార్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. కడప లోక్‌సభ పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలిచినా.. క్రాస్‌ ఓటింగ్‌ కారణంగా లోక్‌సభ అభ్యర్థి భూపేశ్‌రెడ్డి పరాజయం పాలయ్యారు. కడప, అరకు లోక్‌సభ స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థులకు లక్షకుపైగా ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి షర్మిల, సీపీఎం అభ్యర్థి అప్పలనర్సకు పడిన క్రాస్‌ ఓటింగ్‌.. కూటమి అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీసింది. మచిలీపట్నం లోక్‌సభలోనూ అసెంబ్లీ స్థానాలకు పోలైన ఓట్ల కంటే.. 70,092 ఓట్లు కూటమి లోక్‌సభ అభ్యర్థి బాలశౌరికి తక్కువగా వచ్చాయి. అయితే భారీ మెజారిటీ ఉండటంతో క్రాస్‌ ఓటింగ్‌ ఆయన విజయాన్ని ప్రభావితం చేయలేకపోయింది. మొత్తం 16 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్డీయే అసెంబ్లీ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే లోక్‌సభ అభ్యర్థులకు తక్కువ ఓట్లు వచ్చాయి. 9 లోక్‌సభ నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థులు సాధించిన ఓట్లను మించి.. లోక్‌సభ అభ్యర్థులు సాధించారు.


లోక్‌సభ నియోజకవర్గాల వారీగా పరిస్థితి ఇలా...

అరకు

అరకు లోక్‌సభ పరిధిలో ఎన్డీయే అసెంబ్లీ అభ్యర్థులందరికీ కలిపి 4,95,451 ఓట్లు రాగా.. లోక్‌సభ అభ్యర్థికి 69వేలకు పైగా ఓట్లు తగ్గాయి. ఇక్కడ ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్డీయే అభ్యర్థులే గెలిచారు. పాడేరు, అరకు స్థానాల్లోనే వైకాపా అభ్యర్థులు గెలిచినా, క్రాస్‌ ఓటింగ్‌ కారణంగా అరకు స్థానాన్ని వైకాపా దక్కించుకుంది. ఇండియా కూటమి తరఫున పోటీచేసిన సీపీఎం అభ్యర్థి పాచిపెంట అప్పలనర్సకు 1,23,129 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి లహరికి 25,750 ఓట్లు లభించాయి. కూటమి అసెంబ్లీ అభ్యర్థులు సాధించిన ఓట్ల కంటే.. కొత్తపల్లి గీతకు 69వేల ఓట్లు తక్కువగా వచ్చాయి. 50,580 ఓట్ల తేడాతో వైకాపా అభ్యర్థి తనూజారాణి విజయం సాధించారు.

  • నరసరావుపేట లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి నుంచి వైకాపాకు ఓట్లు క్రాస్‌ అయ్యాయి. ఎన్డీయే కూటమి అసెంబ్లీ అభ్యర్థులందరికీ కలిపి 8,27,203 ఓట్లు రాగా.. లోక్‌సభ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలుకు 8,07,996 ఓట్లు వచ్చాయి. 19వేలకు పైగా ఓట్లు తగ్గాయి. వైకాపా లోక్‌సభ అభ్యర్థి అనిల్‌కుమార్‌ యాదవ్‌కు ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల కంటే 6,081 ఓట్లు ఎక్కువ వచ్చాయి.
  • శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానాలకు వచ్చిన ఓట్ల కంటే తెదేపా అభ్యర్థికి అధికంగా పోలయ్యాయి. ఎర్రన్నాయుడి కుటుంబానికి ఉన్న పేరు, సానుభూతి ఆయనకు అనుకూలించింది. అన్ని అసెంబ్లీ స్థానాల్లో కలిపి 7,14,592 ఓట్లు రాగా.. రామ్మోహన్‌నాయుడికి 7,54,328.. అంటే 39వేలకు పైగా ఓట్లు అధికంగా వచ్చాయి.  


కడప

కడప లోక్‌సభ స్థానం పరిధిలో క్రాస్‌ ఓటింగ్‌ పెద్దఎత్తున జరిగింది. ఈ లోక్‌సభ పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలను తెదేపా గెలుచుకోగా, రెండు స్థానాలనే వైకాపా దక్కించుకుంది. అయినా వైకాపా లోక్‌సభ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి గట్టెక్కారు. కడప అసెంబ్లీ తెదేపా అభ్యర్థి మాధవిరెడ్డికి 90,988 ఓట్లు వస్తే, అక్కడ లోక్‌సభ అభ్యర్థి భూపేశ్‌రెడ్డికి 66,090 ఓట్లే పోలయ్యాయి. 24,898 ఓట్లు క్రాస్‌ అయ్యాయి. కమలాపురం అసెంబ్లీ స్థానంలోనూ తెదేపా అభ్యర్థి పుత్తా కృష్ణచైతన్యరెడ్డికి 95,207 ఓట్లు పోలవ్వగా, లోక్‌సభ అభ్యర్థికి 79,750 ఓట్లు వచ్చాయి. 14,457 ఓట్లు క్రాస్‌ అయ్యాయి. వైకాపా అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల మధ్య క్రాస్‌ ఓటింగ్‌ కూడా అధికంగానే ఉంది. కడప అసెంబ్లీ అభ్యర్థి అంజాద్‌బాషాకు 72,128 ఓట్లు పోలవ్వగా, లోక్‌సభ అభ్యర్థి అవినాష్‌రెడ్డికి 62,015 ఓట్లు వచ్చాయి. 10,113 ఓట్లు క్రాస్‌ అయ్యాయి. కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థి వైఎస్‌ షర్మిలకు 1,41,039 ఓట్లు పోలయ్యాయి. క్రాస్‌ ఓటింగ్‌లో అధికశాతం షర్మిలకు పడినట్లు తేలుతోంది. 

ఏలూరు లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్డీయే శాసనసభ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే లోక్‌సభ అభ్యర్థి పుట్టా మహేష్‌కుమార్‌కు 18,875 ఓట్లు తక్కువగా వచ్చాయి. ఎన్డీయే అసెంబ్లీ అభ్యర్థులందరికీ కలిపి 7,65,226 ఓట్లు రాగా.. పుట్టా మహేష్‌కుమార్‌కు 7,46,351 ఓట్లు వచ్చాయి. వైకాపా శాసనసభ అభ్యర్థులందరికీ కలిపి 5,39,069 ఓట్లు రాగా.. లోక్‌సభ అభ్యర్థి కారుమూరి సునీల్‌కుమార్‌కు 5,59,318 ఓట్లు వచ్చాయి. ఓట్లు క్రాస్‌ కావడంతో వైకాపా లోక్‌సభ అభ్యర్థికి 19వేల పైగా ఓట్లు అధికంగా వచ్చాయి. 


తిరుపతి

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ ఎన్డీయే కూటమి గెలిచింది. ఇక్కడ క్రాస్‌ ఓటింగ్‌ లోక్‌సభ అభ్యర్థి వరప్రసాదరావు విజయావకాశాలను దెబ్బతీసింది. చివరి నిమిషంలో భాజపాలో చేరి పోటీచేసిన ఆయనకు.. ఎన్డీయే అసెంబ్లీ స్థానాలకు పడిన ఓట్ల కంటే 1,34,883 ఓట్లు తక్కువగా వచ్చాయి. తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఒక్క అసెంబ్లీ స్థానంలోనూ వైకాపా గెలవలేదు గానీ, పార్లమెంటు స్థానాన్ని దక్కించుకుంది. ఆ పార్టీ అభ్యర్థి గురుమూర్తి కేవలం 14,569 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. వైకాపా నుంచి అసెంబ్లీకి పోటీచేసిన అభ్యర్థులకు మొత్తం 5,60,644 ఓట్లు పోలైతే.. లోక్‌సభ అభ్యర్థికి 71,584 ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఇక్కడినుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన చింతా మోహన్‌కు 65,520 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ స్థానానికి కూటమికి ఓట్లు వేసినవారు.. లోక్‌సభకు కాంగ్రెస్, వైకాపా వైపు మొగ్గుచూపారు.


రాజంపేట

రాజంపేట లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో.. రాయచోటి, రైల్వేకోడూరు, పీలేరు, మదనపల్లె స్థానాలను కూటమి సొంతం చేసుకోగా.. రాజంపేట, పుంగనూరు, తంబళ్లపల్లెలోనే వైకాపా గెలిచింది. అయినా క్రాస్‌ ఓటింగ్‌తో ఈ లోక్‌సభ స్థానాన్ని వైకాపా దక్కించుకుంది. రాయచోటి అసెంబ్లీ స్థానంలో తెదేపా అభ్యర్థి రాంప్రసాద్‌రెడ్డికి 95,925 ఓట్లు వస్తే, అక్కడ భాజపా లోక్‌సభ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి 70,568 ఓట్లే వచ్చాయి. అంటే 25,357 ఓట్లు క్రాస్‌ అయ్యాయి. పీలేరులో తెదేపా అసెంబ్లీ అభ్యర్థి నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డికి 1,05,582 ఓట్లు పోలైతే, ఆయన సోదరుడైన లోక్‌సభ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డికి 90,602 ఓట్లే వచ్చాయి. ఇక్కడ 14,980 ఓట్లు క్రాస్‌ అయ్యాయి. ఇలా అన్నిచోట్లా క్రాస్‌ ఓటింగ్‌ కారణంగా కూటమి అసెంబ్లీ అభ్యర్థుల కంటే, కిరణ్‌కుమార్‌రెడ్డికి తక్కువ ఓట్లు వచ్చాయి. రాజంపేట లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైకాపా అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే, లోక్‌సభ అభ్యర్థి మిథున్‌రెడ్డికి ఎక్కువ ఓట్లు పడ్డాయి. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి 1,00,793 ఓట్లు వస్తే, ఆయన కుమారుడైన లోక్‌సభ అభ్యర్థి మిథున్‌రెడ్డికి 1,04,833 ఓట్లు వచ్చాయి. క్రాస్‌ ఓటింగ్‌ కారణంగా ఈ లోక్‌సభ స్థానం పరిధిలో కాంగ్రెస్‌ అభ్యర్థి షేక్‌ బషీర్‌కు 53,300 ఓట్లు పడటం గమనార్హం.

విజయవాడ లోక్‌సభ తెదేపా అభ్యర్థి కేశినేని చిన్నికి శాసనసభ్యులకు వచ్చిన ఓట్ల కంటే అధికంగా వచ్చాయి. ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి 7,93,281 ఓట్లు రాగా.. కేశినేని చిన్నికి 7,94,154 ఓట్లు వచ్చాయి. ఇతర పార్టీల నుంచి క్రాస్‌ ఓట్లు 873 చిన్నికి పడ్డాయి. వైకాపా నుంచి ఇతరులకు క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. శాసనసభ్యులు అందరికీ కలిపి 5,19,648 ఓట్లు రాగా.. కేశినేని నానికి 7,579 ఓట్లు తక్కువగా వచ్చాయి.

రాజమహేంద్రవరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో కూటమి, వైకాపా అభ్యర్థులు ఇద్దరిపై క్రాస్‌ ఓటింగ్‌ ప్రభావం పడింది. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కూటమి అభ్యర్థులకు మొత్తం 7,73,928 ఓట్లు రాగా.. భాజపా లోక్‌సభ అభ్యర్థిగా గెలిచిన దగ్గుబాటి పురందేశ్వరి క్రాస్‌ ఓటింగ్‌తో 47,413 ఓట్లు కోల్పోయారు. రాజమహేంద్రవరం గ్రామీణ, నగరం, గోపాలపురం నియోజకవర్గాల్లో క్రాస్‌ ఓటింగ్‌ అధికంగా ఉంది. వైకాపా అసెంబ్లీ అభ్యర్థులకు మొత్తం 4,89,501 ఓట్లు రాగా, వైకాపా లోక్‌సభ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్‌కు 4,87,376 ఓట్లు వచ్చాయి. క్రాస్‌ ఓటింగ్‌తో 2,125 ఓట్లు కోల్పోయారు. ఈ ఓట్లు కాంగ్రెస్, బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థులకు మళ్లాయి.

ఒంగోలు లోక్‌సభ పరిధిలో ఎన్డీయే అసెంబ్లీ అభ్యర్థులకు మొత్తం 7.25 లక్షల ఓట్లు లభించగా.. లోక్‌సభ అభ్యర్థికి 24వేల ఓట్లు తగ్గాయి. వైకాపా అసెంబ్లీ అభ్యర్థులందరికీ కలిపి 6.45 లక్షల ఓట్లు లభించగా.. ఆ పార్టీ లోక్‌సభ అభ్యర్థికి 6,416 ఓట్లు పెరిగాయి. ఈ లోక్‌సభ పరిధిలో వైకాపా అభ్యర్థిగా పోటీచేసిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లో అసెంబ్లీ అభ్యర్థుల కంటే ఎక్కువగా వచ్చాయి. ఒంగోలు, దర్శి, యర్రగొండపాలెం, కొండపి నియోజకవర్గాల్లో తగ్గాయి.

అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి సీఎం రమేశ్‌ 2,96,530 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే, ఆయనకు 33,522 తక్కువగా పడ్డాయి. పెందుర్తి పరిధిలో జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు కంటే, సీఎం రమేశ్‌కు 9,617 ఓట్లు తక్కువగా వచ్చాయి. వైకాపా అసెంబ్లీ అభ్యర్థుల కంటే లోక్‌సభ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడికి 5,156 ఓట్లు అధికంగా వచ్చాయి. ఈ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి వేగి వెంకటేశ్‌కు 25,651 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి పి.శ్రీరామమూర్తికి 19,157 ఓట్లు పోలయ్యాయి.

నంద్యాల లోక్‌సభ నియోజకవర్గంలో క్రాస్‌ ఓటింగ్‌ అధికంగా జరిగింది. ఎన్డీయే కూటమి, వైకాపా శాసనసభ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే ఆ పార్టీల లోక్‌సభ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు తక్కువ. రెండుపార్టీల ఓట్లు కాంగ్రెస్‌కు పడ్డాయి. డోన్‌ మినహా అన్నిచోట్లా ఎన్డీయే శాసనసభ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే లోక్‌సభ అభ్యర్థి బైరెడ్డి శబరికి ఓట్లు తక్కువగా వచ్చాయి. అసెంబ్లీ అభ్యర్థులందరికీ వచిచన ఓట్ల కంటే 19,926 ఓట్లు శబరికి తగ్గాయి. వైకాపాకు ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో కలిపి 6.08 లక్షలకుపైగా ఓట్లు రాగా.. వైకాపా లోక్‌సభ అభ్యర్థి పోచా బ్రహ్మనందరెడ్డికి 5,89,156 ఓట్లు వచ్చాయి. అంటే 19,148 ఓట్లు తగ్గాయి. కాంగ్రెస్‌ అభ్యర్థికి 56,204 ఓట్లు లభించాయి. 

చిత్తూరు లోక్‌సభ పరిధిలో రెండు నియోజకవర్గాల్లో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గురజాల జగన్‌మోహన్‌కు వచ్చిన ఓట్ల కంటే కూటమి లోక్‌సభ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావుకు 55,775 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. చంద్రగిరిలో అసెంబ్లీ అభ్యర్థి కంటే 46,784 ఓట్లు తక్కువ వచ్చాయి. ప్రత్యర్థి కంటే 2,20,479 ఓట్ల ఆధిక్యం ఉంది కాబట్టి క్రాస్‌ ఓటింగ్‌ ప్రభావం ఆయనపై పడలేదు.

అనంతపురం లోక్‌సభ స్థానంతో పాటు, ఏడు అసెంబ్లీ స్థానాలనూ తెదేపా సొంతం చేసుకుంది. ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే, లోక్‌సభ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణకు తక్కువ ఓట్లు వచ్చాయి. వైకాపాలోనూ పెద్దఎత్తున క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. అనంతపురం అసెంబ్లీ అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డికి 80,311 ఓట్లు వస్తే, లోక్‌సభ అభ్యర్థి ఎం.శంకరనారాయణకు 66,494 ఓట్లే వచ్చాయి. అంటే 13,817 ఓట్లు క్రాస్‌ అయ్యాయి. గుంతకల్లు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి వై.వెంకట్రామిరెడ్డికి 94,874 ఓట్లు వస్తే, అక్కడ శంకరనారాయణకు 85,680 ఓట్లే వచ్చాయి. 9,194 ఓట్లు క్రాస్‌ అయ్యాయి. ఈ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి వజ్జల మల్లికార్జునకు 43,217 ఓట్లు పోలయ్యాయి.

కర్నూలు లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి శాసనసభ్యులకు వచ్చిన ఓట్ల కంటే లోక్‌సభ అభ్యర్థి బస్తిపాటి నాగరాజుకు అధికంగా ఓట్లు వచ్చాయి. ఎన్డీయే కూటమి శాసనసభ అభ్యర్థులకు 6,57,550 ఓట్లు రాగా.. లోక్‌సభ అభ్యర్థికి 1,364 ఓట్లు అధికంగా వచ్చాయి. వైకాపా అసెంబ్లీ అభ్యర్థులకు 5,84,515 ఓట్లు రాగా.. వైకాపా లోక్‌సభ అభ్యర్థి బీవై రామయ్యకు 36,899 ఓట్లు తగ్గాయి. వీటిలో కొన్ని ఎన్డీయే లోక్‌సభ అభ్యర్థికి, మిగతావి కాంగ్రెస్‌కు మళ్లాయి. కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థి రాంపుల్లయ్యకు 70వేలకు పైగా ఓట్లు వచ్చాయి.

హిందూపురం లోక్‌సభ స్థానం పరిధిలో క్రాస్‌ ఓటింగ్‌ కొన్నిచోట్ల స్వల్పంగా, మరికొన్నిచోట్ల ఎక్కువగా జరిగింది. పెనుకొండ అసెంబ్లీ తెదేపా అభ్యర్థి ఎస్‌.సవితకు 1,13,832 ఓట్లు పోలైతే, అక్కడ లోక్‌సభ అభ్యర్థి బీకే పార్థసారథికి 1,13,782 ఓట్లు వచ్చాయి. 50 ఓట్లే క్రాస్‌ అయ్యాయి. ధర్మవరంలో భాజపా అభ్యర్థి సత్యకుమార్‌కు 1,06,544 ఓట్లు వస్తే, లోక్‌సభ అభ్యర్థి పార్థసారథికి 1,11,632 ఓట్లు పోలయ్యాయి. 5,088 ఓట్లు అధికంగా వచ్చాయి. ధర్మవరంలో వైకాపా అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి 1,02,810 ఓట్లు పోలైతే.. లోక్‌సభ అభ్యర్థి జె.శాంతకు 92,549 ఓట్లే వచ్చాయి. ఇక్కడ 10,261 ఓట్లు క్రాస్‌ అయ్యాయి. హిందూపురం లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి బీఏ సమద్‌ షహీన్‌కు 55,059 ఓట్లు పోలయ్యాయి.

గుంటూరు లోక్‌సభ పరిధిలో ఎన్డీయేకు అసెంబ్లీ స్థానాల్లో వచ్చిన ఓట్ల కంటే అక్కడి లోక్‌సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ అధిక ఓట్లు సాధించారు. ఎన్డీయే కూటమి అసెంబ్లీ అభ్యర్థులందరికీ కలిపి 8,57,213 ఓట్లు రాగా.. చంద్రశేఖర్‌కు 8,64,948 ఓట్లు.. అంటే 7,735 ఓట్లు అదనంగా వచ్చాయి. వైకాపా అసెంబ్లీ అభ్యర్థులకు 5,20,040 ఓట్లు రాగా.. లోక్‌సభ అభ్యర్థి రోశయ్యకు 5,20,253 ఓట్లు వచ్చాయి. ఈయనకు 213 ఓట్లే అధికంగా వచ్చాయి. ఇండియా కూటమి నుంచి క్రాస్‌ ఓటింగ్‌ కావడంతో ఈ ఇద్దరు అభ్యర్థులకు ఓట్లు పెరిగాయి.  

విజయనగరం లోక్‌సభ పరిధిలో ఎన్డీయే శాసనసభ అభ్యర్థుల కంటే లోక్‌సభ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడికి 10,160 ఓట్లు అధికంగా వచ్చాయి.. రెండు నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ అభ్యర్థుల కంటే లోక్‌సభ అభ్యర్థికే ఓట్లు ఎక్కువగా వచ్చాయి.

బాపట్ల లోక్‌సభ నియోజకవర్గంలో క్రాస్‌ ఓటింగ్‌ కారణంగా ఎన్డీయే లోక్‌సభ అభ్యర్థి కృష్ణప్రసాద్‌కు ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఇక్కడి శాసనసభ అభ్యర్థులందరికీ కలిపి 7,02,127 ఓట్లు రాగా.. లోక్‌సభకు వచ్చేసరికి 7,17,493 ఓట్లు పడ్డాయి. వైకాపాకు అసెంబ్లీ స్థానాల్లో 5,12,119 ఓట్లు రాగా.. లోక్‌సభ అభ్యర్థి నందిగం సురేష్‌కు 2,657 ఓట్లు తగ్గాయి. చీరాల కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసిన ఆమంచి కృష్ణమోహన్‌కు 41వేలకు పైగా ఓట్లు లభించాయి. కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థి జేడీ శీలం 19వేల ఓట్లు సాధించారు.

విశాఖ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ఇక్కడ క్రాస్‌ ఓటింగ్‌ ఆ పార్టీ అభ్యర్థి శ్రీభరత్‌కు కలిసొచ్చింది. ఆయనపై సానుభూతితో పాటు.. వివాదరహితుడు కావడం మేలుచేసింది. కూటమి అసెంబ్లీ అభ్యర్థులందరికీ కలిపి 8,74,480 ఓట్లు రాగా.. ఆయనకు 32,987 ఓట్లు అధికంగా పడ్డాయి. విశాఖ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలకు వైకాపా నుంచి పోటీచేసిన అభ్యర్థులకు మొత్తం 4,29,867 ఓట్లు పోలైతే.. లోక్‌సభ అభ్యర్థి బొత్స ఝాన్సీకి 26,638 ఓట్లు తక్కువగా వచ్చాయి.

అమలాపురం లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి శాసనసభ అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే.. లోక్‌సభ అభ్యర్థి హరీష్‌ మాథుర్‌కు అధికంగా వచ్చాయి. ఎన్డీయే కూటమి శాసనసభ అభ్యర్థులందరికీ కలిపి 7,62,578 ఓట్లు రాగా.. లోక్‌సభ అభ్యర్థికి 7,96,981 ఓట్లు వచ్చాయి. వైకాపా నుంచి ఎన్డీయే లోక్‌సభ అభ్యర్థికి ఓట్లు క్రాస్‌ అయ్యాయి. వైకాపా అసెంబ్లీ అభ్యర్థులందరికీ కలిపి 4,85,631 ఓట్లు రాగా.. లోక్‌సభ అభ్యర్థి రాపాక వరప్రసాదరావుకు 30,846 ఓట్లు తగ్గాయి. ఇవి ఎన్డీయే కూటమి, కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థులకు మళ్లాయి. 

కాకినాడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కూటమి అభ్యర్థులు 8,01,310 ఓట్లు పొందగా కాకినాడ లోక్‌సభ స్థానంలో జనసేన అభ్యర్థి ఉదయ్‌ శ్రీనివాస్‌కు 7,29,699 ఓట్లే పోలయ్యాయి. 71,611 ఓట్లు క్రాస్‌ అయినా, మెజారిటీ 2.29 లక్షలకు పైగా ఉండటంతో ఈ ప్రభావం కనిపించలేదు. ఏడు అసెంబ్లీ స్థానాల నుంచి వైకాపా అభ్యర్థులకు మొత్తం 4,55,345 ఓట్లు పోలవ్వగా.. వైకాపా లోక్‌సభ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ 44,863 ఓట్లు ఎక్కువగా పొందారు. జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, పెద్దాపురం, తుని నియోజకవర్గాల్లో ఒక్కోచోట 10వేలకు పైగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది.

నరసాపురం లోక్‌సభ నియోజకవర్గంలోనూ ఎన్డీయే శాసనసభ అభ్యర్థులందరికీ వచ్చిన ఓట్లతో పోలిస్తే.. లోక్‌సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మకు 78,605 ఓట్లు తక్కువగా వచ్చాయి. ఆయన అక్కడ్నుంచి 2.76 లక్షల ఓట్ల మెజారిటీ సాధించడంతో క్రాస్‌ ఓటింగ్‌ ప్రభావం కనిపించలేదు. వైకాపా అసెంబ్లీ అభ్యర్థులందరికీ కలిపి 3,83,347 ఓట్లు రాగా.. వైకాపా లోక్‌సభ అభ్యర్థి ఉమాబాలకు 4,30,361 ఓట్లు వచ్చాయి. అంటే 47,014 ఓట్లు పెరిగాయి. తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం సహా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది.

నెల్లూరు లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలనూ కూటమి కైవసం చేసుకుంది. ఒక్క కావలిలోనే అసెంబ్లీ అభ్యర్థి కంటే లోక్‌సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి 5,404 ఓట్లు అధికంగా వచ్చాయి. మిగిలిన అన్నిచోట్లా అసెంబ్లీ అభ్యర్థుల కంటే తగ్గాయి. నెల్లూరు సిటీలో అసెంబ్లీ అభ్యర్థి నారాయణకు లోక్‌సభ అభ్యర్థి కంటే 12,753 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఇక్కడ గణనీయంగా ఉన్న ముస్లింలు లోక్‌సభకు కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓట్లు వేశారు. కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థి కొప్పుల రాజుకు మొత్తం 54,844 ఓట్లు పోలయ్యాయి. అందులో 17,231 ఓట్లు నెల్లూరు సిటీ నుంచే ఉన్నాయి. ఇక్కడ వైకాపా అభ్యర్థి విజయసాయిరెడ్డికీ క్రాస్‌ ఓటింగ్‌ బెడద తప్పలేదు. పార్టీ తరఫున అసెంబ్లీ అభ్యర్థుల కంటే ఆయనకు 21,605 ఓట్లు తక్కువగా పోలయ్యాయి.

మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్డీయే కూటమి నుంచి వైకాపాకు క్రాస్‌ ఓటింగ్‌ జరిగింది. కూటమి శాసనసభ అభ్యర్థులందరికీ కలిపి 7,94,531 ఓట్లు రాగా.. లోక్‌సభ అభ్యర్థి బాలశౌరికి 7,24,439 ఓట్లే వచ్చాయి. పెనమలూరులో 18,134 ఓట్లు, పామర్రులో 16,529, గుడివాడలో 15,472, గన్నవరంలో 14,586 ఓట్లు క్రాస్‌ అయ్యాయి. మిగిలిన నియోజకవర్గాల్లోనూ కలిపితే 70వేల ఓట్లకు పైగా క్రాస్‌ ఓటింగ్‌ కనిపించింది. ఇదే లేకుంటే ఆయన మెజారిటీ మరింత పెరిగేది. వైకాపా అసెంబ్లీ అభ్యర్థులకు 4,79,459 ఓట్లు రాగా.. ఆ పార్టీ లోక్‌సభ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావుకు 5,01,260 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ స్థానాల కంటే లోక్‌సభ అభ్యర్థికి 21వేలకు పైగా ఓట్లు పెరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని