సీఐడీని జగన్‌ స్వార్థానికి వాడుకున్నారు

సీఐడీని జగన్‌ స్వార్థానికి వాడుకుని అరాచక పాలన సాగించారని తెలుగు యువత రాష్ట్ర నాయకుడు రావిపాటి సాయికృష్ణ విమర్శించారు. ఎన్నికల్లో కూటమి ఘన విజయంతో గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో తెలుగు యువత నాయకులు శుక్రవారం విజయోత్సవాలు నిర్వహించారు.

Published : 08 Jun 2024 05:44 IST

గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయం వద్ద తెదేపా సంబరాలు

సీఐడీ ప్రాంతీయ కార్యాలయం ఎదుట కేకు కోసి విజయోత్సవాలు నిర్వహిస్తున్న రావిపాటి సాయికృష్ణ, షేక్‌ ఫిరోజ్‌ తదితరులు

గుంటూరు (పట్టాభిపురం, నేరవార్తలు), న్యూస్‌టుడే: సీఐడీని జగన్‌ స్వార్థానికి వాడుకుని అరాచక పాలన సాగించారని తెలుగు యువత రాష్ట్ర నాయకుడు రావిపాటి సాయికృష్ణ విమర్శించారు. ఎన్నికల్లో కూటమి ఘన విజయంతో గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో తెలుగు యువత నాయకులు శుక్రవారం విజయోత్సవాలు నిర్వహించారు. కార్యాలయం వద్ద బాణసంచా కాల్చారు. కేకు కోసి జగన్‌కు వ్యతిరేకంగా నినదించారు. తెలుగు యువత నాయకులు వస్తున్నారన్న సమాచారం తెలిసి సీఐడీ అధికారులు ముఖం చాటేయగా.. కార్యాలయంలోని సిబ్బందికి మిఠాయిలు పంచారు. ‘అయిదేళ్లలో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, మీడియా సంస్థల యాజమాన్యాలపై సైతం సీఐడీని అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు పెట్టి జగన్‌ అక్రమ అరెస్టులు చేశారు. అధికార దురహంకారంతో జగన్‌రెడ్డికి తాబేదార్లుగా వ్యవహరించిన అధికారులకు శాస్తి తప్పదు..’ అని సాయికృష్ణ పేర్కొన్నారు. ‘జగన్‌ తప్పుల్ని ఎత్తిచూపిన వారిని ఇదే సీఐడీ కార్యాలయంలో ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు సీఐడీ అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తించుకోవచ్చు..’ అని తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్‌ ఫిరోజ్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐడీ కేసు బాధితులు చేరెడ్డి జనార్దన్, మణి, కరణం ప్రభాకర్, అభిరామ్‌తో పాటు తెదేపా నాయకులు కొమ్మినేని కోటేశ్వరరావు, వలివేటి కృష్ణ, తల్లం శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని