వైకాపా నాయకుల ఇళ్ల వద్ద ఉద్రిక్తత

ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు వైకాపా నాయకుల ఇళ్ల వద్ద శుక్రవారం ఆందోళనలకు దిగారు. విజయవాడ లబ్బీపేటలోని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన నివాసంలో ఉన్నారని తెలిసి గుర్తుతెలియని వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు.

Published : 08 Jun 2024 05:47 IST

మాజీ ఎమ్మెల్యే వంశీ ఇంటి వద్ద లాఠీఛార్జి
కొడాలి నాని ఇంటి ముట్టడికి యత్నం

విజయవాడ (పటమట, గవర్నర్‌పేట), గన్నవరం గ్రామీణం, గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు వైకాపా నాయకుల ఇళ్ల వద్ద శుక్రవారం ఆందోళనలకు దిగారు. విజయవాడ లబ్బీపేటలోని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన నివాసంలో ఉన్నారని తెలిసి గుర్తుతెలియని వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. వంశీ బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు తమను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. వంశీ నివసిస్తున్న అపార్టుమెంట్‌ పైనుంచి ఆయన అనుచరులు కవ్వించడంతో ఆందోళనకారులు పార్కింగ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే కార్లపై రాళ్ల దాడి చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సీఆర్పీఎఫ్‌ బలగాలతో కలిసి పోలీసులు లాఠీఛార్జి చేశారు. కొందరు యువకులకు గాయాలు కాగా.. పోలీసులు మరికొందరిని స్టేషన్‌కు తరలించారు. మరోవైపు గుణదలలోని వైకాపా తూర్పు నియోజకవర్గ నేత దేవినేని అవినాష్‌ ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటుచేశారు. 

  • గుడివాడ రాజేంద్రనగర్‌లోని మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వీధిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గుర్తుతెలియని యువకులు పూలదండ, పాడైపోయిన ఒక ఫ్యాన్‌తో ప్రత్యక్షమయ్యారు. అప్పటికే అక్కడున్న సీఐలు కె.ఇంద్ర శ్రీనివాస్, ఎం.వి.దుర్గారావు, కె.యేసుబాబు సిబ్బందితో కలిసి వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఓ సందర్భంలో వన్‌టౌన్‌ సీఐ ఇంద్రశ్రీనివాస్‌తో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో కొందరు యువకులు పోలీసులు వేసిన ఇనుప కంచె దాటి వచ్చేందుకు యత్నించారు. ఇంటిపైకి కోడిగుడ్లు విసిరారు. కొడాలి నానికి వ్యతిరేకంగా నినదిస్తూ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
  • విజయవాడ రాజీవ్‌నగర్‌లో వైకాపా నాయకుడు పెద్దిరెడ్డి శివారెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి రాళ్లతో దాడి చేశారు. ఇంటి అద్దాలు, కారును ధ్వంసం చేశారు. దీనిపై శివారెడ్డి నున్న పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
  • గన్నవరంలోని వైకాపా కార్యాలయాన్ని శుక్రవారం తొలగించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు