సంక్షిప్తవార్తలు(4)

లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల చేసిన సంస్థలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని జమ్మూ-కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా డిమాండ్‌ చేశారు.

Updated : 08 Jun 2024 07:19 IST

ఎగ్జిట్‌ పోల్స్‌ సంస్థలు క్షమాపణ చెప్పాలి
ఎన్సీ అధినేత ఫరూఖ్‌ అబ్దుల్లా డిమాండ్‌

శ్రీనగర్‌: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల చేసిన సంస్థలు ప్రజలకు క్షమాపణ చెప్పాలని జమ్మూ-కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూఖ్‌ అబ్దుల్లా డిమాండ్‌ చేశారు. ఎన్నికల ఫలితాలపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తప్పుడు ఫలితాలను వెల్లడించిన ఆ సంస్థలు దుకాణాలను మూసివేయాలని విమర్శించారు. ఈ ఎన్నికల ఫలితాలతో దేశంలో నియంతృత్వ రోజులు ముగిసాయని, ప్రజలు తమ తీర్పుతో రాజ్యాంగాన్ని రక్షించారని అన్నారు. 


సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తాం: రాజ్‌నాథ్‌

దిల్లీ: భాజపా సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తుందని రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఎన్డీయే నేతగా ఎంపికైన ప్రధాని మోదీకి ఆయన ‘ఎక్స్‌’ వేదికగా అభినందనలు తెలిపారు. మంత్రిమండలిలో సభ్యునిగా గత పదేళ్లుగా ప్రధానితో కలిసి దగ్గరగా పనిచేసే అవకాశం తనకు కలిగిందని చెప్పారు. మోదీ సామర్థ్యం, దూరదృష్టి, విశ్వసనీయతను ఈ దేశం గుర్తించిందని అన్నారు. పదేళ్లుగా భారత్‌కు సేవ చేసి ఎన్డీయే ప్రభుత్వానికి మూడోసారి భారతీయులు మద్దతు పలకడం చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పారు.


రాహుల్‌పై పరువు నష్టం కేసు..  విచారణ 18కి వాయిదా

సుల్తాన్‌పుర్‌ (యూపీ): కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు వ్యతిరేకంగా 2018లో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువునష్టం కేసులో విచారణను ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు శుక్రవారం ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది. ఓ న్యాయవాది మరణంతో కోర్టులో సంతాపసభను ఏర్పాటు చేయడంతో శుక్రవారం జరగాల్సిన విచారణ వాయిదా పడిందని రాహుల్‌ న్యాయవాది కాశీ ప్రసాద్‌ శుక్లా వెల్లడించారు. గత ఫిబ్రవరిలో జరిగిన విచారణకు హాజరైన రాహుల్‌కు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది.


దిల్లీకి నీటి విడుదలలో హరియాణా కుట్ర: ఆప్‌ 

దిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా హరియాణా ప్రభుత్వం దిల్లీకి నీటి సరఫరాను అడ్డుకుంటోందని ఆప్‌ నేత, దిల్లీ మంత్రి ఆతిశీ ఆరోపించారు. దిల్లీకి 137 క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. నీటి విషయంలో రాజకీయాలు చేయకూడదన్న సుప్రీంకోర్టు.. దేశ రాజధానికి మిగులు జలాలను తరలించాలని తాజాగా హరియాణాను కూడా ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు