నీట్‌ అవకతవకలపై సుప్రీం పర్యవేక్షణలో విచారణ జరపాలి: కాంగ్రెస్‌

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి విచారణ జరపాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది.

Published : 08 Jun 2024 06:29 IST

దిల్లీ: వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి విచారణ జరపాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. యువతను మోసం చేసి వారి జీవితాలతో భాజపా ఆడుకుంటోందని దుయ్యబట్టింది. నీట్‌తో పాటు అనేక పోటీ పరీక్షల్లో పేపర్‌ లీక్‌లు, రిగ్గింగ్, అవినీతి అంతర్భాగమయ్యాయని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్‌ వేదికగా ధ్వజమెత్తారు. ఈనెల 14న ప్రకటిస్తామన్న నీట్‌ ఫలితాలను ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల ఫలితాల రోజు విడుదల చేశారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్‌ ఆరోపించారు. నీట్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై విద్యార్థుల చట్టపరమైన ఫిర్యాదులను విచారణ ద్వారా పరిష్కారించాలని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ పిలుపునిచ్చారు. ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించడం ఎలా సాధ్యమైందని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఫలితాలు విడుదలయ్యాక దేశవ్యాప్తంగా చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండడం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని