లోక్‌సభలో విపక్ష నేత బాధ్యతలు చేపట్టండి

దశాబ్దం తర్వాత లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా అర్హత సాధించిన కాంగ్రెస్‌ పార్టీలో ఆ బాధ్యతలు చేపట్టేదెవరు? పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అందుకు అంగీకరిస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది.

Published : 09 Jun 2024 05:04 IST

రాహుల్‌గాంధీకి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ విజ్ఞప్తి, తీర్మానం ఆమోదం
ఆ డిమాండ్‌తో స్వరం కలిపిన సీఎం రేవంత్‌ రెడ్డి
త్వరలో నిర్ణయం చెబుతానన్న అగ్రనేత

దిల్లీ: దశాబ్దం తర్వాత లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా అర్హత సాధించిన కాంగ్రెస్‌ పార్టీలో ఆ బాధ్యతలు చేపట్టేదెవరు? పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ అందుకు అంగీకరిస్తారా లేదా అనే ఉత్కంఠ నెలకొంది. దిల్లీలో శనివారం సమావేశమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)... ప్రధాన విపక్ష నేతగా సారథ్య బాధ్యతలు చేపట్టాలంటూ ఏకగ్రీవంగా రాహుల్‌కు విజ్ఞప్తి చేసింది. అయితే, దీనిపై త్వరలో తన నిర్ణయం చెబుతానంటూ రాహుల్‌ సమాధానమివ్వడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణయాత్మక విభాగమైన సీడబ్ల్యూసీ భేటీకి ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత వహించారు. అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీతో పాటు సీనియర్‌ నేతలు కె.సి.వేణుగోపాల్, జైరాం రమేశ్‌ తదితరులు హాజరయ్యారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో గతంలో కన్నా మెరుగైన ఫలితాలు సాధించడంపై భేటీలో హర్షం వ్యక్తమైంది. పేలవమైన పనితీరు కనబరచిన రాష్ట్రాల్లో దిద్దుబాటు చర్యల కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. లోక్‌సభలో విపక్ష నేత బాధ్యతలు చేపట్టాలని రాహుల్‌ గాంధీని కోరుతూ ఒక తీర్మానం; రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని రక్షించేలా ఓటేసినందుకు ప్రజలకు అభినందనలు తెలుపుతూ మరో తీర్మానాన్ని సీడబ్ల్యూసీ ఆమోదించింది. లోక్‌సభ ఎన్నికల్లో ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ కృషిని సమావేశం కొనియాడింది. రాహుల్‌ ప్రతిపక్ష నేతగా ఉండాలనేది 140 కోట్ల మంది భారతీయుల డిమాండ్‌ అని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో 99 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌ అవతరించింది. దీంతో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎవరు ఉంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది.


నియంతృత్వ శక్తులకు ప్రజలు తగిన జవాబిచ్చారు

-ఖర్గే 

లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు నియంతృత్వ, రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు తగిన సమాధానం చెప్పారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే అన్నారు. దిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్‌ పార్టీ కొన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో చూపిన పనితీరును లోక్‌సభ పోరులో పునరావృతం చేయలేకపోయింది. అలాంటి రాష్ట్రాల్లో ఫలితాలపై విశ్లేషణ చేసుకుంటాం. భారత్‌ జోడో యాత్ర కొనసాగిన చోట కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు, సీట్లు పెరిగాయి’ అని ఖర్గే తెలిపారు.


సీపీపీ ఛైర్‌పర్సన్‌గా సోనియా 

కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ)   ఛైర్‌పర్సన్‌గా సోనియా గాంధీ మరోసారి ఎన్నికయ్యారు. పార్లమెంటు సెంట్రల్‌ హాలులో శనివారం జరిగిన కాంగ్రెస్‌కు చెందిన లోక్‌సభ నూతన ఎంపీలు, రాజ్యసభ సభ్యుల సమావేశంలో మూజువాణి ఓటుతో ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం సోనియా ప్రసంగిస్తూ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో భాజపాకి గతంలో కన్నా సీట్లు తగ్గినప్పటికీ ప్రధాని మోదీ ఆ వైఫల్యానికి బాధ్యత వహించకుండా మరోసారి ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నారంటూ ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు